logo

శుచి లేదు.. శుభ్రతా లేదు!

గ్రేటర్‌ నగరంలో మినరల్‌ వాటర్‌ పేరుతో భారీదందా నడుస్తోంది. శుచి.. శుభ్రత లేకుండా మురికి వాడలు, చిన్నచిన్న గల్లీల్లో వాటర్‌ ప్లాంట్లు పెట్టి రూ.కోట్లు దండుకుంటున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న ఈ ప్లాంట్లపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా... అనేక ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేవని తేలింది. తాగునీటి వ్యాపారం చేయాలంటే భారతీయ ప్రమాణాల బ్యూరో(బీఐఎస్‌)

Updated : 14 Mar 2022 03:49 IST

 మినరల్‌ వాటర్‌ పేరుతో దందా

 అక్రమంగా ఐఎస్‌ఐ మార్కు వినియోగం

ఈనాడు, హైదరాబాద్‌

నాంపల్లిలో వాటర్‌ప్లాంటు చుట్టూ మురుగునీరు

గ్రేటర్‌ నగరంలో మినరల్‌ వాటర్‌ పేరుతో భారీదందా నడుస్తోంది. శుచి.. శుభ్రత లేకుండా మురికి వాడలు, చిన్నచిన్న గల్లీల్లో వాటర్‌ ప్లాంట్లు పెట్టి రూ.కోట్లు దండుకుంటున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న ఈ ప్లాంట్లపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా... అనేక ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేవని తేలింది. తాగునీటి వ్యాపారం చేయాలంటే భారతీయ ప్రమాణాల బ్యూరో(బీఐఎస్‌) లైసెన్సు తీసుకోవాలి. గ్రేటర్‌లో వందల సంఖ్యలో నీటి ప్లాంట్లు ఉంటే... తెలంగాణ వ్యాప్తంగా ఈ కోడ్‌ పొందిన ప్లాంట్లు కేవలం 154 మాత్రమే. కొన్ని ప్లాంట్లును అక్రమంగా ఐఎస్‌ఐ కోడ్‌ను వినియోగిస్తున్నాయి. కొత్తూరులోని ఓ ప్లాంట్‌ను ఇటీవలే బీఐఎస్‌ అధికారులు సీజ్‌ చేశారు.

అనేక రోగాలకు కారణం

అపరిశుభ్రత, కల్తీ నీటిని తాగడం వల్ల అనేక రోగాలు దాడిచేసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నాంపల్లి, అమీర్‌పేట, జియాగూడ, సికింద్రాబాద్‌, చాంద్రాయణగుట్ట.. ఇలా అనేక ప్రాంతాల్లో ఇరుకు గల్లీలు, అపరిశుభ్రమైన ప్రాంతాల్లో తాగు నీటి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. కొన్ని మురికి కాల్వల పక్కనే దర్శనమిస్తున్నాయి. ల్యాబొరేటరీ, టెస్ట్‌ రికార్డులు, లేబుల్‌, ప్యాకేజీ ఇవన్నీ పక్కాగా జరగడం లేదని ‘ఈనాడు’ పరిశీలనలో తేలింది.


బోరు  నీరే  సరఫరా

అమీర్‌పేట: సనత్‌నగర్‌, అమీర్‌పేటల్లో పదికి పైగా మినరల్‌ వాటర్‌ ప్లాంట్లకు ఎటువంటి అనుమతి లేదు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, వెంకటేశ్వర ఆలయం, సనత్‌నగర్‌, అశోక్‌ కాలనీల్లో వాటర్‌ ప్లాంట్లు అక్రమంగా కొనసాగుతున్నాయి. బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు ఇక్కడి చాలా దుకాణాల్లో ఈ నీటిని విక్రయిస్తున్నారు. ఫతేనగర్‌ ఎంఎంటీఎస్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో మురుగు కాల్వ పక్కనే బోరువేసి, ఆ నీటినే మినరల్‌ వాటర్‌గా విక్రయించడంతో గతంలో అధికారులు ప్లాంట్‌ను సీజ్‌ చేశారు.


విచ్చలవిడిగా బోర్లు

చాంద్రాయణగుట్ట: ఉప్పుగూడ దానయ్యనగర్‌, లలితాబాగ్‌, కందికల్‌గేట్‌, బండ్లగూడ, గౌలిపురా శ్రీరాంనగర్‌ కాలనీ, ఉప్పుగూడ, శివసాయినగర్‌, చాంద్రాయణగుట్ట, బాబానగర్‌, తలాబ్‌కట్ట, మొఘల్‌పురా, ఇంజన్‌బౌలి, జంగమ్మెట్‌ తదితర ప్రాంతాల్లో అక్రమ మంచినీటి వ్యాపారం జోరుగా సాగుతోంది.


30పైగా ప్లాంట్లు

చిలకలగూడ దోభీఘాట్‌ బస్తీలో

సికింద్రాబాద్‌: చిలకలగూడ, ఉప్పర్‌బస్తీ, తార్నాక, మెట్టుగూడ, అడ్డగుట్ట, సీతాఫల్‌మండి, పార్శిగుట్ట, వారాసిగూడ, బౌద్ధనగర్‌ తదితర ప్రాంతాల్లో సుమారు ముప్పైకిపైగా అక్కమ ప్లాంట్లు విస్తరించి ఉన్నట్లు సమాచారం.


బోర్లతో తోడేసి

రెజిమెంటల్‌ బజారులో

యూసుఫ్‌గూడ: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో సుమారుగా పాతిక అనధికారిక మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఉన్నాయి. యూసుఫ్‌గూడ, వెంకటగిరి, సీ-బ్లాకు, హైలంకాలనీ, రహ్మత్‌నగర్‌, బోరబండ, ఎర్రగడ్డ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా వెయ్యి అడుగుల లోతు వరకు బోర్లను ఏర్పాటు చేసుకున్నారు.


మూసీ నది ఒడ్డున

గౌలిగూడచమన్‌లో అపరిశుభ్రత నడుమ

నాంపల్లి: గాంధీ భవన్‌ పక్కనే, మెయిన్‌ రోడ్డుకు కూతవేటు దూరంలోనే పటేల్‌ నగర్‌లో ఓ వాటర్‌ ప్లాంటులో నీటి దందా నడుస్తోంది. బజార్‌ఘాట్‌, షేర్‌గల్లీ, దేవీబాగ్‌, భరత్‌నగర్‌, హబీబ్‌నగర్‌, జవహర్‌నగర్‌, కోమటికుంట, జంగంబస్తీ, ఏడుగుళ్లు, దారుస్సలాం రోడ్‌, ఏసీ గార్డ్స్‌ తదితర ప్రాంతాల్లో గల్లీకో అక్రమ మినరల్‌ వాటర్‌ ప్లాంటు ఉన్నాయి. జియాగూడ కేశవస్వామినగర్‌, దరియాబాగ్‌ మూసీనది ఒడ్డునే రెండు అక్రమ ప్లాంట్లు కొనసాగుతున్నాయి.


 శివారుల్లోనూ అదే తీరు

ఇంట్లోనే నిర్వహణ

ఘట్‌కేసర్‌: రామంతాపూర్‌, హబ్సిగూడ, ఉప్పల్‌, చిలుకానగర్‌, నాచారం, కాప్రా, ఘట్‌కేసర్‌, మేడిపల్లి, బోడుప్పల్‌, పీర్జాదిగూడ, మేడ్చల్‌, నాగారం, దమ్మాయిగూడ, జవహర్‌నగర్‌ శామీర్‌పేట, కీసర తదితర ప్రాంతాల్లోని సామాన్యులు ఫ్లోరిన్‌ బారిన పడుతుండటంతో తాగునీటికి శుద్ధి కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. రోజుకు రూ.8 లక్షల నుంచి 10లక్షల వరకు వ్యాపారం కొనసాగిస్తున్నట్లు అంచనా.


ఇరుకైన గదుల్లోనే

బేగంబజార్‌: అఫ్జల్‌గంజ్‌ అశోక్‌బజార్‌, నాంపల్లి గాంధీ భవన్‌ వెనక పటేల్‌ నగర్‌ బస్తీ, ఏక్‌మినార్‌ మసీదు, పురానాపూల్‌, సిటీ కాలేజీ సమీపంలో అక్రమ ప్లాంట్లు కొనసాగుతున్నాయి. ఏక్‌మినార్‌ మసీదు సమీపంలో, గాంధీ భవన్‌ వెనుక కొనసాగుతున్న రెండు ప్లాంట్లను గతంలో నాంపల్లి మండల తహసీల్దారు సీజ్‌ చేసినా రాజకీయ ఒత్తిడితో కొన్ని రోజులకే తెరిచి కొనసాగిస్తున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని