logo

అలా కాదు.. ఇలా మేలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో జీవ వ్యర్థాల నిర్వహణ సవాలుగా మారుతోంది. ప్రధాన ఆసుపత్రులైన ఉస్మానియా, గాంధీతోపాటు వాటి పరిధిలోని ఏ ఆసుపత్రిలోనూ ప్రమాణాల ప్రకారం జీవ వ్యర్థాల సేకరణ, ధ్వంసం జరగడం లేదు.

Published : 08 Feb 2023 02:40 IST

నిలోఫర్‌లో జీవ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక చర్యలు

పారిశుద్ధ్య నిర్వహణపై సిబ్బందికి శిక్షణ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆసుపత్రుల్లో జీవ వ్యర్థాల నిర్వహణ సవాలుగా మారుతోంది. ప్రధాన ఆసుపత్రులైన ఉస్మానియా, గాంధీతోపాటు వాటి పరిధిలోని ఏ ఆసుపత్రిలోనూ ప్రమాణాల ప్రకారం జీవ వ్యర్థాల సేకరణ, ధ్వంసం జరగడం లేదు. ఫలితంగా ఇన్‌ఫెక్షన్ల కారక వైరస్‌, బ్యాక్టీరియాలు గాలిలో కలుస్తున్నాయి. జీవ వ్యర్థాల నిర్వహణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నాయి. వివిధ వ్యర్థాల సేకరణ, వాటిని పద్ధతి ప్రకారం ధ్వంసం చేసేందుకు 5 రకాల రంగుల డబ్బాలను వినియోగించాలి. కానీ, అన్ని రకాల వ్యర్థాల సేకరణకు నల్ల బ్యాగులనే వినియోగిస్తున్నారు. వాటిని అలానే జీహెచ్‌ఎంసీ చెత్త సేకరణ బృందాలకు అప్పగిస్తున్నారు. కానీ, చిన్న పిల్లల ఆసుపత్రి అయిన నిలోఫర్‌లో మాత్రం వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎలా చేస్తారంటే..

* ఈ ఆసుపత్రిలో నిత్యం 1500 వరకు ఓపీ ఉంటోంది.  పడక నుంచి నిత్యం అన్ని రకాలు కలిసి 600 గ్రాముల చెత్త ఉత్పత్తి అవుతోంది. దీంతో చెత్త సేకరణ, నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయించారు.
* వ్యర్థాల సేకరణతోపాటు తరలించే సిబ్బంది, నర్సులకు శిక్షణ అందిస్తున్నారు. వ్యర్థాలను నిల్వ ఉంచే ప్రాంతంలో ప్రత్యేకంగా అయిదు వరకు చిన్న రంగుల గదులు ఏర్పాటు చేస్తున్నారు. సేకరించిన రంగుల డబ్బాలు లేదంటే సంచులను ఈ గదుల్లో నిల్వ చేస్తారు.
* అనంతరం వాటిని అలానే చెత్త సేకరించే సిబ్బందికి అప్పగించి ప్రమాణాల ప్రకారం ధ్వంసం చేయనున్నారు. అన్ని రకాల వ్యర్థాలు సాధారణ చెత్తలో కలవకుండా  నిర్వహణ చేపడుతున్నారు.

ఏ డబ్బాలో ఏంటంటే...

* పసుపు: ఇన్‌పెక్షన్‌ వ్యర్థాలు, బ్యాండేజీలు, కాటన్‌, శరీర భాగాలు
* ఎరుపు: ఇన్‌ఫెక్షన్‌ డ్రెస్సింగ్‌ మెటీరియల్‌, పర్సనల్‌ ప్రొటెక్షన్‌ క్లోత్స్‌ ఇతరాలు
* నలుపు: విషపూరిత మందులు, వ్యర్థాలు, రసాయన వ్యర్థాలు
* నీలం: గ్లౌజులు, సిరంజీలు, ఇతర ప్లాస్టిక్‌ వ్యర్థాలు
* తెలుపు: ఇంజక్షన్‌ సీసాలు, సూదులు, గాజు వ్యర్థాలు


వ్యర్థాల నిర్వహణలో ‘నిలోఫర్‌’ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

- డాక్టర్‌ ఉషారాణి, సూపరింటెండెంట్‌

నిలోఫర్‌లో వ్యర్థాల నిర్వహణకు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించాం. ప్రతి ఒక్క పారిశుద్ధ్య సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నాం. గత నెల రోజుల నుంచి విడతల వారీగా అందరికి శిక్షణ ఇస్తున్నాం. రకరకాల వ్యర్థాలను సేకరించే సమయంలో అన్ని ఒకే సంచిలో కాకుండా ఆయా రంగుల వారీగా అందులో వేయాలని చెబుతున్నాం. బృందంలో ఒక్కొక్కరు ఒక్కో రంగు సంచితో చెత్తను సేకరించేలా చూస్తున్నాం. వ్యర్థాల సేకరణ, నిర్వహణ, తరలింపు విషయంలో నిలోఫర్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని