icon icon icon
icon icon icon

7 దశాబ్దాలు 10 మందే వనితలు

గ్రేటర్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించే స్థితిలో మహిళలు ఉన్నా శాసనసభలో వారి ప్రాతినిధ్యం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది.

Updated : 16 Nov 2023 10:00 IST

శాసనసభలోకి అడుగిడింది వీరే
ఈనాడు, హైదరాబాద్‌

గ్రేటర్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించే స్థితిలో మహిళలు ఉన్నా శాసనసభలో వారి ప్రాతినిధ్యం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. 1952లో నియోజకవర్గాలు ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కేవలం 10 మంది మహిళలు మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టారు. పలు నియోజకవర్గాల్లో మహిళలు ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా బరిలో దిగినా అంతగా ప్రభావం చూపలేకపోయారు.

మేడ్చల్‌ నియోజకవర్గం 1967, 1972 ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్‌డ్‌గా కేటాయించారు. రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన       సుమిత్రాదేవీ గెలుపొందారు.


ముషీరాబాద్‌లో  ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. ఒకే ఒక్క మహిళ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన నాయిని నర్సింహారెడ్డి 2008లో రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన టి.అంజయ్య సతీమణి మణెమ్మ గెలుపొందారు. ఆ తర్వాతి ఎన్నికలోనూ ఆమె విజయకేతనం ఎగరేశారు.


1952 శాలిబండ, 1957 పత్తర్‌ఘట్టి నియోజకవర్గాల్లో మసూమా బేగం కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందారు.


1962లో ఏర్పడిన చేవెళ్ల నియోజకవర్గానికి 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 1999 ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి భర్త పటోళ్ల ఇంద్రారెడ్డి విజయం సాధించారు. ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో జరిగిన ఉప ఎన్నికల్లో సబిత రాజకీయ ప్రవేశం చేశారు. ఆ ఎన్నికల్లో 10వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం నియోజకవర్గం రిజర్వ్‌డ్‌ కావడంతో.. 2009లో ఏర్పడిన మహేశ్వరం నియోజకవర్గం నుంచి సబిత పోటీ చేసి ప్రత్యర్థి తీగల కృష్ణారెడ్డిపై విజయం సాధించారు. 2018లోనూ ఆమె విజయం సాధించారు.


బ్రహీంపట్నం నుంచి 1999 ఎన్నికల్లో తెదేపా తరఫున పోటీ చేసిన కొండ్రు పుష్పలీల.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఎ.గంగారాం కృష్ణపై గెలుపొందారు.


2009 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన జయసుధ సమీప అభ్యర్థి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై గెలుపొందారు.


లక్‌పేట్‌ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. 1967, 1972 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ప్రాతినిధ్యం వహించిన బి.సరోజినీ పుల్లారెడ్డి విజయం సాధించారు.


నత్‌నగర్‌ నియోజకవర్గానికి 11 సార్లు ఎన్నికలు జరగ్గా.. 1983 ఎన్నికల్లో తెదేపా నుంచి తరఫున పోటీ చేసిన కాట్రగడ్డ ప్రసూన కాంగ్రెస్‌ అభ్యర్థిపై విజయం సాధించారు.


  • 1972లో గగన్‌మహల్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసిన టి.శాంతాబాయి 5వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు.
  • కంటోన్మెంట్‌లో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 1967లో ఈ స్థానం నుంచి వి.రామారావు గెలిచారు. ఆయన మరణించడంతో 1969లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య వి.మంకమ్మ కాంగ్రెస్‌ తరఫున బరిలో దిగి గెలుపొందారు. 1972 ఎన్నికల్లోనూ విజయం సాధించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img