logo

9 మంది ఎంపీల్లో ఏడుగురు స్థానికేతరులే..!

వికారాబాద్‌ జిల్లా ఆధ్యాత్మికంగా ఎంత ప్రత్యేకత పొందిందో రాజకీయంగానూ అంతే గుర్తింపు సంతరించుకుంది.

Published : 22 Apr 2024 03:27 IST

రాజకీయంగా మహబూబ్‌నగర్‌కు ప్రత్యేక గుర్తింపు

న్యూస్‌టుడే, కొడంగల్‌ గ్రామీణం, బొంరాస్‌పేట: వికారాబాద్‌ జిల్లా ఆధ్యాత్మికంగా ఎంత ప్రత్యేకత పొందిందో రాజకీయంగానూ అంతే గుర్తింపు సంతరించుకుంది. జిల్లాలో మొత్తం నాలుగు నియోజకవర్గాలు (కొడంగల్‌, పరిగి, తాండూరు, వికారాబాద్‌) ఉండగా వీటిలో పరిగి, తాండూరు, వికారాబాద్‌.. చేవెళ్ల ఎంపీ పరిధిలోకి వస్తాయి. కొడంగల్‌ ఒక్కటే మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలోకి వస్తుంది. సీఎం రేవంత్‌రెడ్డి ఈ కొడంగల్‌ నియోజక వర్గంనుంచే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అందరి దృష్టి దీనిపై పడింది. మహబూబ్‌నగర్‌ ఎంపీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని అన్ని విధాలా పావులు కదుపుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించారు. దీనికి అనుగుణంగా స్థానిక నేతలు సైతం సమాయత్తమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరి గెలుపు బావుటా ఎగురవేయాలని ప్రచారం చేస్తున్నారు.

ఆదిలోనే ఇతరులకు చోటు

‘వలసల జిల్లా’గా పేరున్న పాలమూరు (మహబూబ్‌నగర్‌)కు ఇప్పటివరకు తొమ్మిది మంది ఎంపీలు పనిచేయగా అందులో ఏడుగురు స్థానికేతరులే కావడం విశేషం. పార్లమెంట్‌కు ఇప్పటి వరకు 17 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి.  
1952లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల సమయంలోనే స్థానికేతరులైన జనార్దన్‌రెడ్డి, 1962లో ముత్యాలరావులు ఇక్కడినుంచే విజయం సాధించారు. 1980, 1989, 1991, 1996 ఎన్నికల్లో మెదక్‌ జిల్లాకు చెందిన మల్లికార్జున్‌ నాలుగు పర్యాయాలు కాంగ్రెస్‌ పార్టీ నుంచి మహబూనగర్‌ ఎంపీగా గెలుపొంది రక్షణ శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2009లో అప్పటి తెరాస అధ్యక్షులు కేసీఆర్‌ (మెదక్‌ జిల్లా) ఇక్కడినుంచే పోటీ చేసి గెలుపొందారు. ఇలా ఏడు పర్యాయాలు నలుగురు స్థానికేతరులు ఎంపీలుగా కొనసాగారు. గుర్తింపు తెచ్చుకున్నారు.

నాలుగుసార్లు వనపర్తి సంస్థానాధీశుడు

1957, 1967, 1971, 1977 ఎన్నికల్లో వనపర్తి సంస్థానాధీశులైన రామేశ్వర్‌రావును విజయం వరించింది. 1984, 1998 ఎన్నికల్లో కల్వకుర్తికి చెందిన జైపాల్‌రెడ్డి గెలుపొంది రాజకీయంగా రాణించి ‘ఉత్తమ పార్లమెంటరీయన్‌’గా అవార్డు తీసుకున్నారు. 1999, 2014లో ఆలంపూర్‌కు చెందిన జితేందర్‌రెడ్డి గెలుపొందారు. వీరు ముగ్గురూ మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన వ్యక్తులే అయినా నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ పరిధిలోని ప్రాంతాలకు చెందిన వారు కావడంతో ఇక్కడి ఎంపీ స్థానానికి స్థానికేతరులుగానే గుర్తింపు పొందారు.

విఠల్‌రావు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాత్రమే..

విఠల్‌రావు , మన్నె శ్రీనివాస్‌రెడ్డి

2004లో బొంరాస్‌పేట మండలం లగచర్లకు చెందిన విఠల్‌రావు, 2019లో జడ్చర్లకు చెందిన మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఇద్దరు మాత్రమే మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని వ్యక్తులు గెలుపొందారు. ప్రస్తుత 2024 ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన అభ్యర్థులు డీకే అరుణ (గద్వాల్‌), వంశీచంద్‌రెడ్డి (కల్వకుర్తి) నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ పరిధిలోకే వస్తారు. గద్వాల్‌, కల్వకుర్తి నియోజకవర్గాలు నాగర్‌కర్నూల్‌ ఎంపీ స్థానం కిందకే రావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని