logo

ఇన్‌స్పెక్టర్‌ మానవత్వం.. సకాలంలో పరీక్షకు హాజరైన విద్యార్థిని

ఓ పరీక్ష కేంద్రానికి బదులు మరో కేంద్రానికి వెళ్లిన విద్యార్థిని ఓ ఇన్‌స్పెక్టర్‌ సహకారంతో సకాలంలో తన పరీక్ష కేంద్రానికి చేరింది.

Published : 22 Apr 2024 05:18 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఓ పరీక్ష కేంద్రానికి బదులు మరో కేంద్రానికి వెళ్లిన విద్యార్థిని ఓ ఇన్‌స్పెక్టర్‌ సహకారంతో సకాలంలో తన పరీక్ష కేంద్రానికి చేరింది. నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన వైష్ణవి టీఎస్‌ఆర్‌జేసీ పరీక్ష రాయడానికి శనివారం నగరానికి వచ్చి పాతబస్తీలోని తన బాబాయి ఇంట్లో దిగింది. ఆదివారం ఉదయాన్నే బాబాయి బైకుపై ఆమెను పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్లేందుకు బయలుదేరారు. దారిలో బైకు ఆగిపోవడంతో అమ్మమ్మతో ఆటోలో బయల్దేరింది. ఆటోవాలాకు చిరునామా తెలియక నారాయణగూడలోని గురునానక్‌ పాఠశాల వద్ద దింపేసి వెళ్లిపోయాడు. అక్కడున్న సిబ్బంది హాల్‌టికెట్‌ పరిశీలించి ‘మీ పరీక్ష కేంద్రం ఇది కాదు.. అంబర్‌పేట్‌ సీపీఎల్‌ రోడ్డు, పటేల్‌నగర్‌ వద్ద ఉన్న ప్రభుత్వ బాలుర పాఠశాలకు వెళ్లాలి’ అని సూచించారు. వైష్ణవి కంగారుగా మరో ఆటో కోసం పరుగులు పెట్టింది. అక్కడే గస్తీలో ఉన్న నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ విషయం తెలుసుకొని తన వాహనంలో ఎక్కించుకొని సైరన్‌ మోగిస్తూ అంబర్‌పేట్‌ ప్రభుత్వ బాలుర పాఠశాల వద్ద దించారు. ఆమె హాల్‌ టికెట్‌ చూపించి లోపలకు వెళ్లగానే గేటు మూసివేశారు. సకాలంలో పరీక్షకు హాజరయ్యేలా సహకరించిన ఇన్‌స్పెక్టర్‌ను పలువురు అభినందించారు. వైష్ణవి ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. తనకు పోలీసు అధికారి కావాలని ఉందని చెప్పిందని ఆయన చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని