logo

గెలుపే లక్ష్యం.. వెన్నంటి ఉంటాం

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్న భాజపా, కాంగ్రెస్‌, భారాస అభ్యర్థుల విజయం కోసం వారి కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు.

Updated : 22 Apr 2024 05:24 IST

లోక్‌సభ అభ్యర్థుల కోసం కుటుంబ సభ్యుల ప్రచారం

కిషన్‌రెడ్డి సతీమణి కావ్యారెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్న భాజపా, కాంగ్రెస్‌, భారాస అభ్యర్థుల విజయం కోసం వారి కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. అభ్యర్థులతోపాటు సమాంతరంగా ఆయా పార్టీల నేతలతో పర్యటిస్తున్నారు. అభ్యర్థులు బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తుంటే వారి కుటుంబ సభ్యులు ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకుంటున్నారు. తమ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలంటూ మద్దతు కోరుతున్నారు. ప్రచారానికి వెళ్లినప్పుడు ఓటర్లు, ప్రజలు చెబుతున్న సమస్యలను శ్రద్ధగా వింటున్నారు. అత్యవసరంగా చేయాల్సిన వాటిని ఒక పుస్తకంలో రాసుకుంటున్నారు.

వినతులు వింటూ... ఆకట్టుకుంటూ...

గడ్డం రంజిత్‌రెడ్డి సతీమణి సీతారెడ్డి

చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌ తరఫున గడ్డం రంజిత్‌రెడ్డి, సునీతా మహేందర్‌రెడ్డి పోటీచేస్తున్నారు. గడ్డం రంజిత్‌రెడ్డి భార్య జి.సీతారెడ్డి చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని వికారాబాద్‌, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో ఇప్పటికే పర్యటించారు. ఆయా ప్రాంతాల్లోని కాంగ్రెస్‌ నాయకులతో కలిసి గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్రచారం నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి మహిళలు, వృద్ధులను కలుసుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో రైతుల వద్దకు వెళ్లి ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. మహేశ్వరం, చేవెళ్ల, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మల్కాజిగిరి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డి స్వయంగా ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో క్రీడాకారులు, వయోధికులను కలుసుకుంటున్నారు. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, మేడ్చల్‌ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆమె విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండగా... ఆమె భర్త పట్నం మహేందర్‌ రెడ్డి ఉప్పల్‌, మల్కాజిగిరి, కంటోన్మెంట్‌, ఎల్బీనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్లల్లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులను వ్యక్తిగతంగా కలుసుకుని వారితో ముమ్మరంగా ప్రచారం చేయిస్తున్నారు.

కేంద్రంలో మళ్లీ మనమే అంటూ..

ఈటల కోడలు క్షమిత

భాజపా అభ్యర్థులు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాధవీలత పోటీచేస్తున్నారు. కిషన్‌రెడ్డి ప్రచార రథంలో పర్యటిస్తుండగా ఆయన సతీమణి కావ్యారెడ్డి అంబర్‌పేట, ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌ నాంపల్లి సెగ్మెంట్లలో ఇంటింటికీ వెళ్లి కిషన్‌రెడ్డికి మద్దతుగా ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సతీమణి, అపోలో ఆసుపత్రుల గ్రూప్‌ జేఎండీ సంగీతారెడ్డి ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లు అత్యధికంగా ఉండే శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్‌ నియోజవర్గాల్లో ఆమె ఇంటింటికీ వెళ్తున్నారు. మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్‌ సతీమణి జమున, కోడలు క్షమిత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈటల క్షమిత యువ ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్‌ భాజపా అభ్యర్థి మాధవీలత తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మజ్లిస్‌ కంచుకోటలను బద్దలు చేద్దాం.. మద్దతు ఇవ్వండంటూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తనకు ఓటేస్తే పాతబస్తీలో మరింత అభివృద్ధి చేస్తామంటున్నారు.

కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సతీమణి సంగీతారెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని