logo

గ్రేటర్‌ నాడి పట్టేదెలా?

లోక్‌సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్‌లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది.

Updated : 25 Apr 2024 06:03 IST

గుంభనంగా ఓటరు.. ఐవీఆర్‌ఎస్‌ సర్వేలను నమ్ముకున్న పార్టీలు
ఎండలతో ఇంటింటికి వెళ్లలేక ఫోన్‌లోనే అభ్యర్థుల పరిచయం
ఈనాడు, హైదరాబాద్‌

లోక్‌సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్‌లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. పార్టీ తరఫున ఎలక్షనీరింగ్‌ చేస్తున్న సంస్థలు ఐవీఆర్‌ఎస్‌ ద్వారా సర్వే చేస్తున్నాయి. మీ లోక్‌సభ పరిధిలో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారని ఫోన్‌ ద్వారా అడుగుతున్నారు. ఇక పార్టీ అభ్యర్థులు ఫోన్‌లో ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ ద్వారా ఓటర్లను పరిచయం చేసుకుంటున్నారు. ఓటేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. కొద్దిరోజులుగా నిత్యం నగరంలో ఓటర్లకు రెండుమూడు ఫోన్‌కాల్స్‌ ఈతరహావే వస్తున్నాయి.

సిటీ పరిధిలో 4 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరితో పాటూ చేవెళ్ల స్థానాలకు మే 13న పోలింగ్‌ జరగనుంది. సమయం దగ్గరపడుతున్నా మూడు స్థానాల్లో ఓటరు నాడి తెలుసుకోవడం అభ్యర్థులకు క్లిష్టంగానే ఉంది. సిటీ ‘మూడు’ను తెలుసుకునేందుకు ప్రధాన పార్టీలు..సర్వే ఏజెన్సీలను నియమించుకుని ఎప్పటికప్పుడు వారితో ఓటర్ల మొగ్గు ఎటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ చేస్తున్నారు.

గత ఎన్నికల్లో అనూహ్యంగా...

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు లోక్‌సభ స్థానాలను ఒక్కో పార్టీ చొప్పున ఓటర్లు పట్టం కట్టారు. అంతకు ఐదు నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఫలితాలకు భిన్నంగా తీర్పు ఇచ్చారు. భారాస, భాజపా, కాంగ్రెస్‌, ఎంఐఎంను ఒక్కో స్థానంలో గెలిపించారు. ఈ సారి సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ స్థానాల్లో త్రిముఖ పోరు నెలకొంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సిటీలో అత్యధిక స్థానాలను భారాస గెల్చుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌, కేంద్రంలో భాజపా అధికారంలో ఉన్నాయి. ఓటరు మొగ్గు ఎటో క్షేత్రస్థాయిలో స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే అని రాజకీయ వర్గాలంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని