logo

మధ్యంతర దరఖాస్తులను పరిష్కరించకుండా తుదితీర్పు చెల్లదు: హైకోర్టు

పైగా భూమి దస్తావేజుల రద్దుకు సంబంధించిన వివాదంలో ఇరుపక్షాలు సమర్పించిన ఆధారాలను, మధ్యంతర పిటిషన్‌లను పరిష్కరించకుండా కింది కోర్టు తుది తీర్పు వెలువరించడం చెల్లదంటూ హైకోర్టు పేర్కొంది.

Published : 07 May 2024 01:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: పైగా భూమి దస్తావేజుల రద్దుకు సంబంధించిన వివాదంలో ఇరుపక్షాలు సమర్పించిన ఆధారాలను, మధ్యంతర పిటిషన్‌లను పరిష్కరించకుండా కింది కోర్టు తుది తీర్పు వెలువరించడం చెల్లదంటూ హైకోర్టు పేర్కొంది. దస్తావేజును రద్దు చేస్తూ సివిల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. వివాదాన్ని తిరిగి ఆ కోర్టుకే పంపింది. ఇరుపక్షాలు సమర్పించిన ఆధారాలు, మధ్యంతర పిటిషన్‌లపై విచారించి నిర్ణయం వెలువరించాలని ఆదేశిస్తూ సైరస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రై.లి. దాఖలు చేసిన అప్పీలుపై విచారణను మూసేసింది. పైగా భూముల్లో కొంతభాగం నిజాం పేరుతో 1966 లో చేసిన విక్రయ దస్తావేజును రద్దు చేయాలంటూ ఖుర్షీద్‌ జాహి పైగా వారసురాలిగా హమీదున్నీసా బేగం 12వ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టును ఆశ్రయించగా 2017లో పిటిషన్‌ను కొట్టేసింది. దీన్ని సవాలు చేస్తూ ఆమె సివిల్‌ కోర్టులో అప్పీలు దాఖలు చేయగా, ఆమె మృతి చెందడంతో మొయిజుద్దీన్‌ ఖాన్‌ వారసుడిగా వివాదాన్ని కొనసాగించారు. హమీదున్నీసా బేగం నిజాంకు చేసిన దస్తావేజుతోపాటు, సైరస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు నిజాం చేసిన దస్తావేజులను రద్దు చేస్తూ గత డిసెంబరు 7న తీర్పు వెలువడింది. దీన్ని సవాలు చేస్తూ సైరస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ హైకోర్టులో దాఖలు చేసిన అప్పీలుపై  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం తాజా ఆదేశాలు ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని