logo

కేంద్రాలు దూరం.. సాయం అవసరం

పార్లమెంట్‌ ఎన్నికల తేదీ (ఈనెల 13) దగ్గరకొచ్చేస్తోంది.అయితే జిల్లాలో పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద సదుపాయాల కల్పన ఇంకా కొలిక్కి రాలేదు. అసలే ఎండలు మండుతున్నాయి.

Published : 07 May 2024 01:36 IST

న్యూస్‌టుడే, పరిగి, కుల్కచర్ల, మోమిన్‌పేట: పార్లమెంట్‌ ఎన్నికల తేదీ (ఈనెల 13) దగ్గరకొచ్చేస్తోంది.అయితే జిల్లాలో పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద సదుపాయాల కల్పన ఇంకా కొలిక్కి రాలేదు. అసలే ఎండలు మండుతున్నాయి. దీంతో నిమిషం బయట నిలబడలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓటింగ్‌ శాతం పెరగాలంటే సౌకర్యాల కల్పన తప్పనిసరి. తాగునీటి సదుపాయం, ఫ్యాన్లు, మూత్రశాలలు, మరుగుదొడ్ల సౌకర్యాలపై ఇంకా దృష్టి సారించాల్సి ఉంది. పరిగిలోని ఓ పోలింగ్‌ కేంద్రం ముందు ఉన్న ర్యాంపు పట్టుకునేందుకు వీలు లేకుండా ఉంది. కనీసం వీల్‌ఛైర్‌తో వెళ్లలేని విధంగా ఉంది. ఇరువైపులా పైపులు అమర్చాల్సి ఉంది.  

తండాల్లో కనిపించని పోలింగ్‌ కేంద్రాలు:మోమిన్‌పేట మండలంలో 38,638 మంది ఓటర్లు ఉండగా 48 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండల పరిధిలో నూతనంగా ఏర్పడిన మక్తతండా గ్రామ పంచాయతీ ఓటర్లు రెండు కి.మీ దూరంలో ఉన్న టేకులపల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లి ఓటు వేయాలి. లచ్చనాయక్‌ తండాకు అనుబంధ తండాలైన మిట్యానాయక్‌, సోమ్లానాయక్‌ తండాల ఓటర్లు కి.మీ పైగా దూరంలో ఉన్న రాళ్లగుడుపల్లి కేంద్రానికి వెళ్లాలి. టేకులపల్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన సుదోడ్కతండా ఓటర్లు కిలోన్నర మీటరుకు దూరంగా ఉన్న గ్రామ పంచాయతీలోని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాలి. వీరికి రవాణా సౌకర్యం కూడా పెద్దలేదు. దీంతో అవస్థలు పడుతూ ఓటేయక తప్పదని వాపోతున్నారు.  

ఈసారీ అంతే..

కుల్కచర్ల, చౌడాపూర్‌ మండలాల్లో మొత్తం 76 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. మొత్తం 61,276 మంది ఓటర్లున్నారు. గతంలో మాదిరిగానే ఈమారు కూడా దూర ప్రాంతాల్లో ఉన్న పోలింగ్‌ కేంద్రాలకు ఇబ్బందులు పడుతూ వెళ్లి ఓటేయక తప్పదని  గ్రామాలు, తండాల ఓటర్లు వాపోతున్నారు. పరిస్థితి ఇలా ఉన్నా కొత్త పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు ఊసే లేకుండా పోయింది.
ః విఠలాపూర్‌లో రెండు పోలింగ్‌ కేంద్రాలు ఉండగా ఒకటి ఈర్లవాగు తండాలో  ఏర్పాటు చేశారు. దీనివల్ల 720 మందికి సౌకర్యం కాగా, మరో 330 మంది మళ్లీ విఠలాపూర్‌ వచ్చి ఓటు వేయాలి. ః పచావ్‌కుంట తండా, గుబ్బడితండా, లక్ష్మణ్‌ తండా తదితర తండాల వారు సుమారు 3 కి.మీ. దూరం వెళ్లాలి. విఠలాపూర్‌ వెళ్లేందుకు దారి అధ్వానంగా ఉంది. కనీసం ఆటోలు కూడా ఆ రూటులో వెళ్లలేవు. ః ఎర్రగోవింద్‌ తండా గిరిజనులు రెండున్నర కిమీ. దూరంలోని రాంనగర్‌కు వెళ్లి ఓటేయాలి.ః టేకులతండా, ఎత్తుకాల్వ తండా, చెరువుముందలి తండా తదితర తండాల ప్రజలు కూడా సమీప గ్రామాలకే ఓటు వేసేందుకు వెళ్లాలి. ఎర్రటి ఎండా కాలంలో ఓటర్లు అవస్థలకు గురికావల్సిందేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు తగిన దృష్టి సారించాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని