logo

ఒక క్లిక్‌తో.. పోలింగ్‌ కేంద్రం ప్రత్యక్షం

‘పోల్‌ క్యూ రూట్‌’ యాప్‌ను ఈసారి మరింత మెరుగ్గా అందుబాటులోకి తెస్తామని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ యాప్‌ను దాదాపు 1.5 లక్షల మంది ఉపయోగించారు.

Updated : 07 May 2024 07:22 IST

అసెంబ్లీ పోరులో 1.5 లక్షల మంది ‘పోల్‌ క్యూ రూట్‌’ వినియోగం

ఈనాడు, హైదరాబాద్‌: ‘పోల్‌ క్యూ రూట్‌’ యాప్‌ను ఈసారి మరింత మెరుగ్గా అందుబాటులోకి తెస్తామని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ యాప్‌ను దాదాపు 1.5 లక్షల మంది ఉపయోగించారు. పోలింగ్‌ కేంద్రానికి దారి తెలుసుకోవడంతోపాటు అక్కడ ఓటర్లు ఎంతమంది బారులు తీరారనే వివరాలను పొందారు. దానికి తగ్గట్టుగా ఏ సమయంలో వెళ్తే త్వరగా ఓటు వేయొచ్చనే అంచనాతో ఓటుహక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఈసారి రాష్ట్రమంతా ఆ యాప్‌ను అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం యోచిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ ఐటీ విభాగం సంతోషం వ్యక్తం చేసింది.


సిద్ధమైన వివరాలు..

రాష్ట్ర ఎన్నికల సంఘం, బల్దియా ఐటీ విభాగం ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ‘పోల్‌ క్యూ రూట్‌’ యాప్‌ను అసెంబ్లీ ఎన్నికలు-2023లో ‘మైజీహెచ్‌ఎంసీ’ మొబైల్‌ యాప్‌లో ప్రవేశపెట్టారు. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లోనూ లింకు పెట్టారు. దాన్ని క్లిక్‌ చేయగానే.. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్‌ కేంద్రం పేరు ఎంచుకోవాలి. సదరు పోలింగ్‌ కేంద్రానికి గూగుల్‌ పటం దారి చూపుతుంది. అలాగే.. ఆ పోలింగ్‌ కేంద్రంలో ఎంతమంది వరుసలో నిల్చున్నారనే సమాచారం కూడా కనిపిస్తుంది. పోలింగ్‌ కేంద్రాల్లో ఉండే బూత్‌స్థాయి అధికారి 10-20 నిమిషాలకోసారి వరుసలో ఎంతమంది ఉన్నారనే వివరాలను పొందుపరిచేవారు. తాజాగా మే 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికలోనూ అదే మాదిరి సత్వర సేవలను అందిస్తామని బల్దియా ఐటీ విభాగం అధికారి ఒకరు ‘ఈనాడు’తో తెలిపారు. ఆమేరకు జిల్లా పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల వివరాలను సిద్ధంగా ఉంచామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని