logo

శత శాతం ఓటు.. ప్రజాస్వామ్యానికి చోటు

లోక్‌సభ ఎన్నికలకు గడువు దగ్గర పడుతోంది. అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటుహక్కు వినియోగించుకోవాలనేది ఎన్నికల సంఘం లక్ష్యం. దీంతో ‘శత శాతం’ పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు అధికారులు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ ఓటర్లను కార్యోన్ముఖులను చేస్తున్నారు.  

Published : 08 May 2024 03:49 IST

అవగాహన కల్పిస్తున్న అధికారులు
న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌

వికారాబాద్‌ పట్టణంలో ప్రధాన రోడ్డుపై భారీ ఫ్లెక్సీ

లోక్‌సభ ఎన్నికలకు గడువు దగ్గర పడుతోంది. అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటుహక్కు వినియోగించుకోవాలనేది ఎన్నికల సంఘం లక్ష్యం. దీంతో ‘శత శాతం’ పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు అధికారులు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ ఓటర్లను కార్యోన్ముఖులను చేస్తున్నారు. 

మొత్తం 9,83,740 మంది ఓటర్లు

జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ అసెంబ్లీ నియోజక వర్గాల్లో మొత్తం 9,83,740 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 4,85,748, మహిళలు 4,97,957, ఇతరులు 35 మంది ఉన్నారు. ఎంపీ ఎన్నికల దృష్ట్యా 1148 బూత్‌లు ఏర్పాటుచేశారు. సుమారు 1400 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ బూత్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనికి బూత్‌ స్థాయి అధికారి, పర్యవేక్షకులను నియమించారు. ప్రస్తుతం వీరు పోలింగ్‌ శాతం నమోదుపైనే దృష్టి సారించారు. అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మహిళా సంఘాలతో సమావేశాలను నిర్వహిస్తూ ఓటు హక్కు గురించి వివరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచిస్తున్నారు.

హోర్డింగ్‌లు, బోర్డులు: పట్టణంలోని ప్రధాన కూడళ్లలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. వీటిపై ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని వివరించారు. సీ-విజల్‌, 1950 టోల్‌ఫ్రీ గురించి తెలిపారు. మద్యం, డబ్బు పంపిణీ ఎక్కడైనా జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని ఈ బోర్డులపై సూచించారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిన్నబోర్డులపై ఓటును వినియోగించుకోవాలని సూచిస్తున్న ప్రముఖ క్రీడాకారుల ఫొటోలతో బోర్డులను ఏర్పాటుచేశారు. 

కళాశాలల్లో లిటరసీ క్లబ్‌ల ఏర్పాటు

జిల్లాలో ఓటు హక్కు నమోదుపై గత శాసన సభా ఎన్నికలకు ముందే డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో లిటరసీ క్లబ్‌లను ఏర్పాటు చేశారు. దీంతో 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ముందుకు వచ్చారు. జిల్లా వ్యాప్తంగా గత శాసన సభా ఎన్నికలతో పోలిస్తే సుమారుగా 50 వేల మంది కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.  ఓటేయడంతో పాటు కుటుంబ సభ్యులను కూడా ఈనెల 13న పోలింగ్‌ కేంద్రానికి తీసుకెళ్లి స్వేచ్ఛగా వారితో ఓటు వేయించాలని సూచిస్తున్నారు.

గత సంవత్సరం 79 శాతం మాత్రమే

గత నవంబర్‌లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల్లో సరాసరి 79 శాతం మాత్రమే పోలింగ్‌ జరిగింది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 77శాతం పోలింగ్‌ నమోదైంది. ఈసారి మాత్రం నూటికి నూరు శాతం పోలింగ్‌ జరిగేలా చూడాలని సకలా యత్నిస్తున్నారు. పోలింగ్‌ రోజున ఇంట్లో కూర్చోకుండా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని సూచిస్తున్నారు. పోస్టల్‌ ఓటింగ్‌ కూడా సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకున్నారు. దివ్యాంగులు, వృద్ధులు, పోలింగ్‌ కేంద్రానికి రాలేని 85 ఏళ్ల వయసు వారు ఇంటివద్దే ఓటువేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని కుల్కచర్ల, వికారాబాద్‌, కొడంగల్‌ తదితర ప్రాంతాల్లోని వృద్ధులు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలా అన్ని విధాలా శతశాతం ఓటింగ్‌ సాధనకు కృషి చేస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. ఇందుకు ప్రజలనుంచి పూర్తి సహకారం కోరుతున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు