logo

ఏ అవకాశం వదిలేది లే..!

చేవెళ్ల, మహబూబ్‌నగర్‌ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్‌, భాజపా, భారాస అభ్యర్థులు విజయం కోసం అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

Updated : 08 May 2024 05:48 IST

న్యూస్‌టుడే, తాండూరు

చేవెళ్ల, మహబూబ్‌నగర్‌ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్‌, భాజపా, భారాస అభ్యర్థులు విజయం కోసం అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఉదయం వేళ ఉపాధి హామీ కూలీలను ప్రసన్నం చేసుకోవడానికి యత్నిస్తుంటే, మధ్యాహ్నం, సాయంత్రం వేళ కిందిస్థాయి నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాయిలాల ఆశ చూపిస్తున్నారు. 

వేసవి కావడంతో ఉదయం 6 గంటలనుంచే..

  • జిల్లాలోని తాండూరు, వికారాబాద్‌, పరిగి శాసన సభ నియోజకవర్గాలు చేవెళ్ల లోక్‌సభ పరిధిలోకి వస్తాయి. కొడంగల్‌ నియోజక వర్గం మహబూబ్‌నగర్‌ లోక్‌ సభ పరిధిలోకి వస్తోంది. నాలుగు నియోజక వర్గాల్లోని 566 గ్రామ పంచాయతీల్లో మొత్తం 2,39,654 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. వీరిలో 1.20 లక్షల మంది కూలీలు సరాసరి పనులకు హాజరౌతున్నారు.
  • ప్రస్తుత వేసవి కాలంలో ఉదయం 6 గంటల నుంచే ఉపాధి పనులు మొదలవుతున్నాయి. కూలీలు ఉన్న పని ప్రదేశాలకు నేరుగా అభ్యర్థులు వెళ్లకున్నా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, భాజపా, భారాస మండల స్థాయి నేతలు కలిసి పార్టీ విధానాలపై ప్రచారం చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్యలోనే కూలీల వద్దకు చేరుకుంటున్నారు. అందరినీ ఒకేసారి కలిసి తమ అభ్యర్థికి ఓటేయాలని కోరుతున్నారు. నమూనా ఈవీఎంలు చూపించి ఓటు వేసే ప్రాధాన్యతా క్రమాన్ని వివరిస్తున్నారు. ప్రజలకు తాము చేయబోయే పనులకు సంబంధించి మ్యానిఫెస్టో కరపత్రాలను అందజేస్తున్నారు.

ఎవరి బలం ఎంతో తేల్చుకునే పని..

చేవెళ్ల లోక్‌ సభ ఎన్నికల్లో ఓవైపు ఎడతెగని ప్రచారం నిర్వహిస్తూనే బూత్‌ల వారీగా ఓట్ల రూపంలో ఎవరి బలం ఎంత అనే విషయాన్ని తేల్చుకునే పనిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు నిమగ్నమయ్యారు. 2023లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన బూత్‌లకు సంబంధించిన నాయకుల పనితీరును ఆయా పార్టీలకు చెందిన ముఖ్యమైన నాయకులు అభినందించారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కూడా అదే రీతిలో కృషిచేయాలని ప్రోత్సహిస్తున్నారు.

పార్టీ కండువాలు కప్పేస్తున్నారు 

బరిలో ఉన్న అభ్యర్థులు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను, మండల స్థాయి నాయకులను తమ పార్టీలో చేర్చుకుని గెలిచిన తరువాత మేలు చేస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. ఈ తతంగంలో మూడు ప్రధాన పార్టీలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. ప్రధానంగా తాండూరు, పరిగి, వికారాబాద్‌, దోమ, మర్పల్లి తదితర మండలాల్లో పార్టీల్లో చేరికలు ఎక్కువగా ఉంటున్నాయి.
ః చేవెళ్ల లోక్‌ సభ పరిధిలోకి వచ్చే తాండూరు శాసన సభ నియోజక వర్గంలో 277 పోలింగ్‌ బూత్‌లు ఉంటే 2,43,244 మంది (పరిగిలో..305 - 2,66,819, వికారాబాద్‌లో..284- 2,31,717) ఓటర్లున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు