logo

ఓటుతో దేశభక్తి చాటండి

ఓటు వేసి దేశభక్తిని చాటుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ నగరవాసులకు పిలుపునిచ్చారు.

Updated : 08 May 2024 05:49 IST

జిల్లా ఎన్నికల అధికారి  రోనాల్డ్‌రాస్‌ విజ్ఞప్తి

పోస్టర్లను ఆవిష్కరిస్తున్న అనుదీప్‌ దురిశెట్టి, రోనాల్డ్‌రాస్‌, శ్రీనివాస్‌రెడ్డి, హేమంత్‌పాటిల్‌

ఈనాడు, హైదరాబాద్‌ : ఓటు వేసి దేశభక్తిని చాటుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ నగరవాసులకు పిలుపునిచ్చారు. నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్‌ ఎంపీ స్థానం రిటర్నింగ్‌ అధికారి అనుదీప్‌ దురిశెట్టి, సికింద్రాబాద్‌ స్థానం ఆర్వో హేమంత్‌ పాటిల్‌తో కలిసి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఆంధ్రా ప్రాంతం వారైనా, ఇతర రాష్ట్రాలవాసులైనా..నగరంలో ఓటు ఉన్న వారు, ఇక్కడే ఓటు వేయాలని సూచించారు. రెండు ప్రాంతాల్లో ఓటు హక్కును కలిగి ఉండటం చట్ట విరుద్ధమని, అలాంటి వారిపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.హైదరాబాద్‌ పార్లమెంటు పరిధిలో 7,075, సికింద్రాబాద్‌లో 8,827, కంటోన్మెంట్‌ అసెంబ్లీ పరిధిలో 1,234 మంది ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది తపాలా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పించామని రోనాల్డ్‌రాస్‌ తెలిపారు. ఇప్పటి వరకు 60 శాతం మంది ఓటు వేయగా, మిగిలిన వారి కోసం బుధవారంతో ముగియనున్న గడువును 10వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.బురఖాలో వచ్చే వారిని తనిఖీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలను పెట్టిందని, ఇందుకోసం ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఓ మహిళా ఎన్నికల అధికారిని తప్పనిసరిగా నియమించినట్లు వివరించారు. గత ఎన్నికల సమయంలో తలెత్తిన బందోబస్తు సమస్యలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని 383 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామని, అక్కడ రెట్టింపు భద్రతను ఏర్పాటు చేస్తామన్నారు.

స్ట్రాంగ్‌ రూముల వద్ద మూడంచెల భద్రత..

హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్‌ రూముల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని తెలిపారు. ఆచూకీ లేని 18 వేల మంది ఓటర్లు 663 పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారని, ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.  . మే 11వ తేదీ సాయంత్రానికి స్థానికేతరులు నగరాన్ని విడిచి వెళ్లాలని స్పష్టం చేశారు. మే 13న ఓటు వేసే సమయం ముగిసే వరకు దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేయాలని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు