logo

ఒక్క వానకే.. వణికె

అకాలవర్షం నగరంపై విరుచుకుపడింది. ఉరుములు, మెరుపులకు తోడు ఈదురుగాలులతో అస్తవ్యస్తం చేసింది. నిప్పుల కుంపటిలా మారిన నగరానికి వరుణుడు ఉపశమనం కలిగించినా.. విద్యుత్తు తీగలు తెగటం, చెట్లకొమ్మలు విరిగిపడడం.. ట్రాఫిక్‌ స్తంభించి జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Published : 08 May 2024 04:14 IST

ఉరుములు, మెరుపులతో విరుచుకుపడిన వరుణుడు
ఈదురుగాలులతో కూలిన చెట్లు, విరిగిన స్తంభాలు
గంటల తరబడి విద్యుత్తుకు అంతరాయం.. నిలిచిన ట్రాఫిక్‌

ఎర్రగడ్డలో ప్రధాన రహదారిపై నిలిచిన వరద

ఈనాడు, హైదరాబాద్‌: అకాలవర్షం నగరంపై విరుచుకుపడింది. ఉరుములు, మెరుపులకు తోడు ఈదురుగాలులతో అస్తవ్యస్తం చేసింది. నిప్పుల కుంపటిలా మారిన నగరానికి వరుణుడు ఉపశమనం కలిగించినా.. విద్యుత్తు తీగలు తెగటం, చెట్లకొమ్మలు విరిగిపడడం.. ట్రాఫిక్‌ స్తంభించి జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మంగళవారం మధ్యాహ్నం నుంచే ఆకాశం మేఘావృతమైంది. సాయంత్రానికి రాజధాని వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన జల్లు మొదలైంది. పలుచోట్ల కుండపోతగా కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్తంభించింది.    మియాపూర్‌లో 13 సెం.మీ.లకు పైగా కురవగా.. చాలాప్రాంతాల్లో 6 సెం.మీల పైనే కుమ్మరించింది. భారీగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలి విద్యుత్తు తీగలు, స్తంభాలపై పడ్డాయి. తీగలు తెగిపడడంతో కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది.

ఐకియా నుంచి బయోడైవర్సిటీ వెళ్లేదారిలో కిలోమీటర్‌ మేర స్తంభించిన ట్రాఫిక్‌

తారానగర్‌లో కారుపై కూలిన చెట్టు 

శ్రీకృష్ణానగర్‌ డి-బ్లాక్‌ ప్రాంతంలో..

పాపిరెడ్డినగర్‌లో కూలిన ట్రాన్స్‌ఫార్మర్‌

ఖైరతాబాద్‌ పైవంతెన డివైడర్‌పై పడిపోయిన కుండీలు


వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి..

  • బహదూర్‌పుర చౌరస్తా రామ థియేటర్‌ రహదారి పక్కన విద్యుత్తు స్తంభానికి చేతులు తగిలి షార్ట్‌సర్క్యూట్‌తో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడు.
  • పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన  నాగబాల గంగాధరరావు(38), తూర్పు గోదావరి జిల్లా కడియంకు చెందిన చింతపల్లి సుబ్రమణ్యం(40) నగరానికి వచ్చి కొంపల్లిలోని దేవేందర్‌ కాలనీలో ఉంటూ తాపీమేస్త్రీలుగాచేస్తున్నారు.మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం రాయిలాపూర్‌లోని ఫాంహౌజ్‌లో పని చేస్తుండగా వర్షం కురవడంతో ఓ గోడ పక్కన నిల్చున్నారు. అది కూలి వారిపై పడటంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు.
  • బాచుపల్లి ఠాణా పరిధి రేణుకాఎల్లమ్మ కాలనీలో అర్జన్‌ నిర్మాణ సంస్థ భారీ గృహ సముదాయాలను నిర్మిస్తోంది. ప్రాజెక్టు ఆవరణలో 10 అడుగుల ఎత్తుతో నిర్మించిన రక్షణ గోడను ఆనుకుని కార్మికులు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. వర్షానికి గోడ కూలడంతో ఒకరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు.
  • మియాపూర్‌ మెట్రో స్టేషన్‌లో ప్రధాన ప్రవేశం వద్ద షట్టర్‌కు ఏర్పాటు చేసిన రేకు డోమ్‌ కూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

న్యూస్‌టుడే, మియాపూర్‌, చార్మినార్‌, నిజాంపేట


ఫిర్యాదులిలా..

కూలిన చెట్లు 32
నీరు నిలిచిన ప్రాంతాలు 17


 

వణికించిన వరుణుడు

లింగంపల్లి రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద నిలిచిన వరద 

ఈనాడు, హైదరాబాద్‌:  ఎటుచూసినా రోడ్లపై నీరు.. కిలోమీటర్ల కొద్దీ వాహనాల బారులు.. హారన్ల మోత.. మంగళవారం సాయంత్రం అకాల వర్షంతో ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారింది. కార్యాలయాల్లో పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకునే సమయంలో మొదలైన భారీ వర్షంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఐటీ కారిడార్‌లో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. పలుచోట్ల ప్రధాన రహదారులపై మోకాలు లోతు నీరు నిలిచింది. భారీగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయి విద్యుత్తు తీగలు, స్తంభాలపై పడ్డాయి. 

పోచమ్మ బస్తీలో ఇళ్లలోకి వచ్చిన వాన నీరు

కొట్టుకుపోయిన వాహనాలు.. కూలిన చెట్లు

  • యూసుఫ్‌గూడలో వరద ఉద్ధృతికి ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి.
  • మల్లాపూర్‌, నాచారం ప్రాంతాల్లో రోడ్డుపై వరద చేరి ట్రాఫిక్‌ స్తంభించింది.
  • పనామా వద్ద వరదతో జాతీయ రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్‌ స్తంభించింది. సిటీలో 7చోట్ల చెట్లు కూలినట్లు ఫిర్యాదులు వచ్చాయి. పలుచోట్ల విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి. 

నిజాంపేట శిల్పా లేఅవుట్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌పై కూలిన హోర్డింగ్‌

అధికారుల సమీక్ష.. డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు. పరిస్థితిని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సమీక్షించారు.  పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌, జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి అర్ధరాత్రి వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు.

ఖైరతాబాద్‌ గణేశ్‌ రోడ్డులో...

ట్రాఫిక్‌ నరకం.. సికింద్రాబాద్‌,  బోయిన్‌పల్లి, అల్వాల్‌, ప్యారడైజ్‌, ప్యాట్నీ, ఎల్బీనగర్‌, కాప్రా, సుచిత్ర, మలక్‌పేట, ఎర్రగడ్డ, అమీర్‌పేట, యూసుఫ్‌గూడ, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, కేపీహెచ్‌బీ, బాచుపల్లి, ఈసీఐఎల్‌, మల్కాపూర్‌, నాచారం ప్రాంతాల్లో రోడ్లపైకి వరద చేరింది. ఐటీ కారిడార్‌ నుంచి బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి ప్రాంతాలకు చేరుకోవడానికి గంటన్నర పట్టింది. రాయదుర్గం బయోడైవర్సిటీ నుంచి ఐకియా, ఖాజాగూడ చౌరస్తా ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. సనత్‌నగర్‌, ఎస్‌ఆర్‌నగర్‌, పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, నాంపల్లి ప్రధాన రహదారుల్లో 2 కి.మీ. దూరానికి గంట సమయం పట్టింది. శిల్పారామం దగ్గర చెట్టు విరిగి రోడ్డుమీద పడడంతో వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు అస్తవ్యస్తంగా రోడ్లమీదకు దూసుకురావడంతో పరిస్థితి చేయిదాటింది. గచ్చిబౌలిలో సాయంత్రం తర్వాత గందరగోళం నెలకొంది.

లక్డీకాపూల్‌లో వరద పరిస్థితిని సమీక్షిస్తున్న  పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌

వారాసిగూడలో విరిగి పడిన చెట్టు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు