logo

ఉపాధి.. బతుకులు సమాధి

నాలుగు రోజుల క్రితమే నగరానికి ఉపాధి కోసం వచ్చిన కుటుంబం.. ఎన్నికల్లో ఓటు వేసేందుకు త్వరలోనే సొంతూళ్లకు వెళ్దామనుకుని సిద్ధం చేసుకున్న దంపతులు.. తాము కష్టపడి పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని కలలుగన్న తల్లిదండ్రులు.

Updated : 09 May 2024 05:39 IST

పొట్టకూటికి వచ్చి..బలవుతున్న కూలీలు

గోడ కూలిన ఘటనతో వలస కుటుంబాల్లో విషాదం

బాచుపల్లిలో ఏడుగురు మృతిచెందిన ఘటనా స్థలం

ఈనాడు- హైదరాబాద్‌, నిజాంపేట, గాంధీనగర్‌, న్యూస్‌టుడే: నాలుగు రోజుల క్రితమే నగరానికి ఉపాధి కోసం వచ్చిన కుటుంబం.. ఎన్నికల్లో ఓటు వేసేందుకు త్వరలోనే సొంతూళ్లకు వెళ్దామనుకుని సిద్ధం చేసుకున్న దంపతులు.. తాము కష్టపడి పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని కలలుగన్న తల్లిదండ్రులు.. కళ్లు మూసి తెరిచేలోపు అందరి బతుకులు కుప్పకూలిపోయాయి. బాచుపల్లిలోని కౌసల్య కాలనీలో గోడకూలిన ఘటనలో మృతుల నేపథ్యం కంటతడి పెట్టించింది. ప్రమాదం అనంతరం గాంధీ ఆసుపత్రి మార్చురీ వద్ద మృతుల గురించి చెబుతూ తోటి కార్మికులు కన్నీరుమున్నీరుగా విలపించారు.వేదన వారి మాటల్లో..

 మూడ్రోజుల క్రితమే వచ్చి..: ఘటనలో మరణించిన ఛŸత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన రాము యాదవ్‌ కుటుంబం మూడు రోజుల క్రితం నగరానికి వచ్చినట్లు తోటి కార్మికులు చెప్పారు. అక్కడ పని లేకపోవడంతో  రాము యాదవ్‌(44) తన భార్య గీతాబాయి(40) కుమారుడు హిమాన్షు(4)ను తీసుకుని ఆదివారమే నగరానికి వచ్చాడు. బాచుపల్లిలోని రైజ్‌ డెవలపర్స్‌ కన్‌స్ట్రక్షన్‌లో కూలీగా చేరి రేకుల షెడ్డులో ఉంటున్నాడు.  మంగళవారం మధ్యాహ్నం రాముయాదవ్‌ షెడ్డులో పడుకున్నాడు. సాయంత్రం తర్వాత గోడ కూలడంతో అతనితోపాటు భార్య, కుమారుడు దుర్మరణం చెందారని స్నేహితులు విలపించారు.
ఎన్నికలకు వెళ్దామని.. ఘటనలో మరణించిన వారిలో బింద్రేష్‌ భవాని చౌహాన్‌(30), ఆయన భార్య కుషి(20) సొంతూళ్లకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తాముండే ప్రాంతంలో ఎన్నికల నేపథ్యంలో వెళ్లాలనుకున్నారు. ఇంతలోనే వారు మరణించడం విషాదం నింపింది.
కార్మికశాఖ ఆర్ధిక సాయం: మృతుల కుటుంబాలకు రూ. 80 వేల చొప్పున ఆర్థికసాయం అందజేసినట్లు కార్మికశాఖ రంగారెడ్డి జోన్‌ సంయుక్త కమిషనర్‌ చతుర్వేది బుధవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వేర్వేరు ఘటనల్లో ఐదుగురు.. అబ్దుల్లాపూర్‌మెట్‌, చందానగర్‌, పెద్ద అంబర్‌పేట్‌ మున్సిపాలిటీ కుంట్లూర్‌లో విద్యుదాఘాతంతో ముగ్గురు చనిపోయారు. మొయినాబాద్‌ మండలం చిన్న మంగళారానికి చెందిన ఓ మహిళ స్వాగత తోరణం పడి, మూసారాంబాగ్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో మద్యం మత్తులో వర్షానికి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.

శిథిల భవనాలను గుర్తించండి

ఈనాడు, హైదరాబాద్‌: రాబోయే రోజుల్లో ఈదురు గాలులు, కుండపోత వానలు ఉంటాయన్న వాతావరణశాఖ హెచ్చరికతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. నగరవ్యాప్తంగా సర్వే చేపట్టి శిథిల భవనాలను గుర్తించాలని, ఇళ్ల స్థితిగతుల ఆధారంగా నోటీసులివ్వడం లేదా ఖాళీ చేయించాలని బుధవారం  నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో బల్దియా కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ స్పష్టం చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు