logo

ఈసారి ఏకాంతమా.. వైభోగమా !

ఆంధ్రుల భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట రామయ్య క్షేత్రంలో ఈసారి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహిస్తారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నవమి వేడుకల ప్రణాళిక అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్ల పరిశీలనకు తిరుమల తిరుపతి దేవస్థానం

Published : 23 Jan 2022 02:32 IST

ఖరారు కాని బ్రహ్మోత్సవాల ప్రణాళిక

నవమి వేడుకల ఏర్పాట్లపై కదలని తితిదే

కొవిడ్‌ వ్యాప్తితో అధికార యంత్రాంగం తర్జన భర్జన

ఒంటిమిట్ట కోదండరామాలయం

ఆంధ్రుల భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట రామయ్య క్షేత్రంలో ఈసారి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహిస్తారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నవమి వేడుకల ప్రణాళిక అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్ల పరిశీలనకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు ఒంటిమిట్టలో ముందస్తుగా ఎలాంటి పర్యటన చేయలేదు. గత రెండు వారాలుగా అదిగో వస్తున్నారు...ఇదిగో ఉత్సవాల నిర్వహణపై చర్చించి కార్యాచరణను ప్రకటిస్తామని స్థానిక అధికారులు చెబుతూ వస్తున్నారు. ఇంతవరకు ఎవరూ ఇక్కడికి రాలేదు. సన్నాహక సమీక్ష చేపట్టలేదు. - న్యూస్‌టుడే, రాజంపేట పట్టణం

ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వేడుకలను గత కొన్నేళ్లుగా అంగరంగ వైభవోపేతంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 2015లో తితిదేలోకి విలీనమైన అనంతరం 2016, 2017, 2018, 2019లో కనులపండువగా వేడుకలు జరిగాయి. ఏటా నిర్వహణకు రూ.3 కోట్లు నుంచి రూ.5 కోట్లు వెచ్చించేవారు. కరోనా మొదటి దశలో విజృంభణతో 2020లో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించారు. గతేడాది రెండో దశలో కొవిడ్‌ పంజా విసరడంతో ప్రాచీన కట్టడాలను మూసివేయాలని కేంద్ర పురావస్తుశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో భక్తుల్లేకుండానే నిరాడంబరంగా నిర్వహించారు. ప్రస్తుతం కొవిడ్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి శ్రీరామనవమి వేడుకలను ఎలా నిర్వహించాలన్నదానిపై తితిదే, జిల్లా ఉన్నతాధికారులు తర్జనభర్జనలు పడుతున్నట్లు సమాచారం. ఏకాంతంగా చేయాలా? వైభవంగా నిర్వహించాలా అనే అంశంపై స్పష్టత రాలేదు. ఏప్రిల్‌ 15న సీతారాముల కల్యాణం, 16న రథోత్సవం, 19న పుష్పయాగం నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం కొవిడ్‌ వ్యాపిస్తుండడంతో ఎలా నిర్వహిస్తే బాగుంటుందని ఉన్నతస్థాయిలో చర్చించడానికి గత రెండు వారాలుగా తితిదే ఉన్నతాధికారులు ఒంటిమిట్టకు వస్తారని సిబ్బంది చెబుతూ వస్తున్నారు. గతంలో ఉత్సవాలపై ముందస్తుగానే ఈవో, జేఈవో, సీవీఎస్‌వో, సీఈ స్థాయి అధికారుల బృందం డిసెంబరు, జనవరి తొలి, రెండో వారంలో వచ్చేవారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సన్నద్ధతపై ఒంటిమిట్టలో అటు తితిదే, ఇటు జిల్లా యంత్రాంగం గానీ సమీక్ష నిర్వహించలేదు. పైగా ఇంతవరకు ఉత్సవాల ముహూర్తం పత్రికను ఖరారు చేస్తూ అర్చకులు, ఆగమ సలహాలదారుల నుంచి ధ్రువీకరించి ఇవ్వలేదని తెలిసింది. వరుసగా 2020, 2021లలో రెండేళ్లపాటు ఏకాంతంగా నిర్వహించారు. ఈసారైనా కొవిడ్‌ నిబంధనలను అనుసరించి భక్తుల సమక్షంలో నిర్వహిస్తే బాగుటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం

ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఈసారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల నిర్వహణపై దృష్టి సారించాం. త్వరలో ఉన్నతాధికారులతో చర్చించి ఎలా చేయాలనేది నిర్ణయం తీసుకుంటాం. గతంలో కంటే ఈసారి మరింత వైభవంగా వేడుకలను నిర్వహించాలని భావిస్తున్నాం. కాకపోతే కరోనా మూడో దశ శరవేగంగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుటుందని ఉన్నత స్థాయిలో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరించి నిర్వహిస్తాం. - ఆర్‌.రమణప్రసాద్‌, డిప్యూటీ ఈవో, తితిదే

 


సీతారామలక్ష్మణ మూర్తులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని