logo

ఎత్తిపోతున్నాయ్‌!

ఉమ్మడి కడప జిల్లాలో ఎత్తిపోతల పథకాలు మరుగున పడుతున్నాయి. నిర్వహణలో నిర్లక్ష్యం, నిధుల లేమి, అన్నదాతల్లో కొరవడిన ఐక్యత, ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో అధికార యంత్రాంగం వెరసి పథకాలు కనుమరుగవుతున్నాయి.  జిల్లాలో రూ.వందల కోట్లు

Published : 27 May 2022 06:07 IST

ఉమ్మడి కడప జిల్లాలో సగానికి పైగా మూలకు

23,800 ఎకరాల ఆయకట్టుకు అందని సాగునీరు

పిచ్చి మొక్కల మధ్య చెన్నమరాజుపల్లె ఎత్తిపోతల పథకం

ఉమ్మడి కడప జిల్లాలో ఎత్తిపోతల పథకాలు మరుగున పడుతున్నాయి. నిర్వహణలో నిర్లక్ష్యం, నిధుల లేమి, అన్నదాతల్లో కొరవడిన ఐక్యత, ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో అధికార యంత్రాంగం వెరసి పథకాలు కనుమరుగవుతున్నాయి.  జిల్లాలో రూ.వందల కోట్లు పెట్టి నిర్మించి ఇప్పటికి నీరివ్వని వెలిగల్లు ప్రాజెక్టుకు మించిన ఆయకట్టు వీటి కింద ఉండడం గమనార్హం. పథకాలు, వాటి కింద ఆయకట్టు, పాడైన పథకాలు, వాటికింద ఉన్న ఆయకట్టు, కారణాలు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. మొత్తం ఆయకట్టులో రెండొంతులకు నీరందడంలేదంటే ఎత్తిపోతల పథకాల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

- న్యూస్‌టుడే, కడప గ్రామీణ

ఉమ్మడి కడప జిల్లాలో ప్రభుత్వ నిధులతో నిర్మించి రైతులకు అప్పగించినవి 35 ఎత్తిపోతల పథకాలున్నాయి. వీటి కింద అధికారిక లెక్కల ప్రకారం 23,800 ఎకరాల ఆయకట్టుంది. ఉన్నవాటిల్లో తాజాగా 28 పథకాలు పనిచేయడంలేదు. వీటిల్లో కొన్ని నీరు లేక మరుగున పడగా, మరికొన్ని 2020, 2021ల్లో వచ్చిన తుపాన్లకు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటి కింద ఉన్న ఆయకట్టు సుమారు 13,710 ఎకరాలు. నీరులేక, రైతుల మధ్య వివాదాల కారణంగా ఆగిన ఆరు పథకాల కింద మరో 2,825 ఎకరాల ఆయకట్టుంది. పథకాలు పనిచేయకపోవడంతో నీరందని ఆయకట్టు పోనూ మిగిలింది కేవలం 7,265 ఎకరాలు మాత్రమే. ఇందులోనూ కొన్ని పథకాలు చురుగ్గా పనిచేస్తుంటే, మరిన్ని అరకొరగా పనిచేస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

నిర్వహణపై అలక్ష్యం...

రూ.176 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతల పథకాలపై ఇటు ప్రభుత్వం, అటు రైతులు అలక్ష్యం వహిస్తున్నారు. పొరుగు జిల్లాల్లో పథకాల కింద మూడు కార్లు పంటలు తీస్తున్నారు. అదే ఉమ్మడి కడప జిల్లాలో పథకాలు ఆ పరిస్థితి కనిపించడంలేదు. జిల్లాలో చాపాడు మండలం నక్కలదిన్నె ఎత్తిపోతల పథకం ఒక్కటే ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ రైతులందరూ ఎమ్మెల్యే సహకారంతో ప్రభుత్వ నిధులతో చక్కగా నిర్వహించుకుంటున్నారు. రూ.వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు నిర్మించడం ఎంత అవసరమో నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి లభ్యత ఉన్న చోట ఎత్తిపోతల పథకాలు నిర్మించడం అంతే అవసరం. ప్రభుత్వం చొరవ చూపి సరిపడా నిధులు సమకూర్చి పథకాలు బాగు చేయించాల్సిన అవసరముందని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

పథకాలు దెబ్బతినడం వాస్తవమే...

ఉమ్మడి కడప జిల్లాలో ఎత్తిపోతల పథకాలు దెబ్బతినడం వాస్తవమే. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే మరమ్మతులు చేపడతాం. పథకాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇందుకు ఆయకట్టు రైతుల సహకారం కూడా చాలా అవసరం. - సుధీర్‌కుమార్‌, ఈఈ, ఏపీఎస్‌ఐడీసీ, కడప

వృథాగా చెన్నమరాజుపల్లె ఎత్తిపోతల పథకం పరికరాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని