logo

ఆహ్లాద వేదిక... విజ్ఞాన వీచిక

జిల్లా సిగలో మరో మణిహారం చేరనుంది. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌ వద్ద చేపట్టిన అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కు నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తవగా అన్ని రకాల

Published : 20 Jan 2022 02:27 IST

అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కు నిర్మాణం వేగవంతం

న్యూస్‌టుడే, ఎల్లారెడ్డిపేట

ఆకట్టుకునేలా ఏర్పాటు చేసిన ప్రవేశద్వారం

జిల్లా సిగలో మరో మణిహారం చేరనుంది. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌ వద్ద చేపట్టిన అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కు నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తవగా అన్ని రకాల హంగులతో ముస్తాబవుతోంది. సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే వేదికే కాకుండా దట్టమైన అడవులపై సంపూర్ణ అవగాహన పెంపొందించే విజ్ఞాన వీచికగా ఇది రూపుదిద్దుకుంటోంది. పట్టణాల్లోని పార్కులకు దీటుగా మౌలిక సదుపాయాలతో త్వరలోనే జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అటవీశాఖ అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. తొమ్మిదెకరాల విస్తీర్ణంలో మొక్కల పెంపకం లక్ష్యంగా పెట్టుకొని అందుకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. వివిధ రకాల మొక్కల పెంపకం కోసం పార్కులో గుంతలు తీసే ప్రక్రియను ప్రారంభించారు.

గజీబో

50 హెక్టార్లు... రూ. 6 కోట్లు

జిల్లాలోని పోతురెడ్డిపల్లి రిజర్వు ఫారెస్ట్‌ బ్లాకులో 415 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉండగా, అందులోని 50 హెక్టార్లను అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కు నిర్మాణానికి కేటాయించారు. హైదరాబాద్‌ వంటి పట్టణాలకు తీసిపోని విధంగా రూ. 6 కోట్ల అంచనా వ్యయంతో పూర్తిస్థాయి సౌకర్యాలతో పార్కును తీర్చిదిద్దాలని నిర్ణయించి 2020 జూన్‌ 26న పార్కు నిర్మాణానికి భూమిపూజ చేశారు. గడిచిన రెండేళ్లలో వివిధ నిర్మాణాలకు రూ. 2.42 కోట్లను ఖర్చు చేశారు. చెయిన్‌లింక్‌ (దారి), ఫెన్సింగ్‌ పనులు కొనసాగుతుండగా వాచ్‌మెన్‌ క్యాబిన్‌ గదితోపాటు వ్యూ టవర్‌, సోలార్‌ పంపుసెట్‌ను ఏర్పాటు చేశారు. రెండు టికెట్‌ కౌంటర్లతో కూడిన ప్రవేశద్వారం, లోటస్‌పాండ్‌, యోగా షెడ్డు, గజీబో (సందర్శకులు కూర్చోవడానికి షెడ్డు)లను ప్రజలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలోనే అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కు అందుబాటులోకి రానుంది. జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతితోపాటు ఇతర జిల్లా స్థాయి అధికారులు పార్కు నిర్మాణ పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారు.

మొక్కల పెంపకానికి ప్రాధాన్యం

అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులో దట్టమైన అడవిని తీర్చిదిద్దేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈ సంవత్సరం పెద్ద మొత్తంలో అటవీజాతి మొక్కలను పెంచేందుకు చర్యలు చేపట్టారు. నల్లమద్ది, తెల్లమద్ది, విప్ప, ఠాని, బుడ్డ ధరణి, బట్టగుణం, రావి, మర్రి, వెదురు, జిట్రేగి వంటి అటవీజాతి మొక్కలకు ప్రాధాన్యతనివ్వనున్నారు. పార్కులోని 9 ఎకరాల్లో 36 వేల మొక్కలు నాటనుండగా ఇప్పటికే గుంతలు తీసే పనులు ఊపందుకున్నాయి. లక్ష మొక్కల సామర్థ్యంతో నర్సరీని ఏర్పాటు చేయనున్నారు. ధూలపల్లిలోని అటవీ పరిశోధన సంస్థ నుంచి అడవి ఆముదం, తిప్పతీగ, నేలవాము తదితర 25 నుంచి 30 రకాల ఔషధ మొక్కలను తీసుకొచ్చి, మరో ఎకరం విస్తీర్ణంలో నాటనున్నారు. దీంతోపాటు నక్షత్రవనం, రాశివనం, నవగ్రహ వనాలను ఏర్పాటు చేయనున్నారు. మూత్రశాలలు నిర్మించి, తాగునీరు, క్యాంటీన్‌ వసతులు కల్పించనున్నారు. సందర్శకులు కూర్చోవడానికి ప్రత్యేకమైన బల్లలను సమకూర్చనున్నారు.

పార్కులో అబ్బురపరుస్తున్న లోటస్‌పాండ్‌

త్వరలోనే పూర్తి చేస్తాం

- శ్రీనివాసరావు, అటవీక్షేత్రాధికారి, సిరిసిల్ల

అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కును అన్ని హంగులతో నిర్మించి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ సంవత్సరం పార్కులో మొక్కలు పెంచే పనులు నిర్వహించనున్నాం. సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. మానసిక ఆహ్లాదం కలగడమే కాకుండా అడవి ఎలా ఉంటుంది? అనే అంశంపై ప్రజలకు అవగాహన కలుగుతుంది. అడవుల ప్రాముఖ్యత, ఉపయోగాలపై ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ పార్కు ఉపయోగపడుతుంది. ప్రభుత్వం నుంచి విడుదలయ్యే బడ్జెట్‌కు అనుగుణంగా పార్కులో మరిన్ని నిర్మాణాలు చేపడతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని