logo

మూఢ నమ్మకాలు.. మృత్యుశాసనాలు

మూఢ నమ్మకాలపు విషపు జాడ్యానికి ముగ్గురు బలయ్యారు. ఎప్పటిలాగే అందరితో ఉన్న వారు ఊహించని దాడిలో విగతులయ్యారు. వాడలో ఎవరికి ఏ జబ్బు చేసినా.. ఎవరు అస్వస్థతకు గురైనా వారే కారణమనేలా

Published : 21 Jan 2022 03:18 IST

ముగ్గురి హత్యతో ఉలిక్కిపడిన ఉమ్మడి జిల్లా

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌ న్యూస్‌టుడే- జగిత్యాల గ్రామీణం

రోదిస్తున్న మృతుల బంధువులు

మూఢ నమ్మకాలపు విషపు జాడ్యానికి ముగ్గురు బలయ్యారు. ఎప్పటిలాగే అందరితో ఉన్న వారు ఊహించని దాడిలో విగతులయ్యారు. వాడలో ఎవరికి ఏ జబ్బు చేసినా.. ఎవరు అస్వస్థతకు గురైనా వారే కారణమనేలా కక్షను పెంచుకున్న కిరాతకులు ఈ దారుణానికి ఒడిగట్టారు. పదుల సంఖ్యలో జనాలు గుమిగూడి ఉన్నచోట మంత్రాల నెపంతో అతికిరాతకంగా అంతమొందించారు. జగిత్యాలలో జరిగిన ఈ మృత్యుశాసనం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సంచలనాన్ని సృష్టించింది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో ఇప్పటికీ నేలపై రాజ్యమేలుతున్నా మూఢ విశ్వాసాన్ని ఈ సంఘటన ఎత్తిచూపుతోంది.  

వారానికి రెండు కేసులు

జగిత్యాల పట్టణంలోని టీఆర్‌నగర్‌లో దాదాపు 10 వేల మంది ఉండగా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఇక్కడ ఉండి కూలీ పని చేయటం, ట్రాక్టర్ల డ్రైవర్లు, గుమాస్తాలుగా పనిచేసే వారు ఎక్కువగా ఉంటున్నారు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతి వారం ఒకటి రెండు కేసులు జగిత్యాల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు రావటం పరిపాటిగా మారింది. మద్యం తాగి ఘర్షణకు దిగటం, భూ వివాదాలు, కుటుంబ గొడవలు నిత్యం ఏదో వాడకు జరుగుతూనే ఉంటాయి. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండటం, అంతా కూలీ పనులు చేసే వారు మద్యం తాగిన సందర్భాల్లో ఘర్షణలు, గొడవలు జరుగుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి చెందిన జగన్నాథం నాగేశ్వర్‌రావు, అతని కుమారులు రాంబాబు, రమేశ్‌ను గురువారం ప్రత్యర్థులు హత్య చేయగా మంత్రాల అనుమానంతో హత్యకు పాల్పడ్డట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఇదే గ్రామంలో గత 6 నెలల కిందట ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా చెతబడితోనే మృతి చెందాడని గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. అతను బతికిస్తానని క్షుద్రపూజలు చేయటంతో రెండు రోజుల పాటు మృతదేహాన్ని అలాగే ఉంచారు. ఈ ఘటన గ్రామంలో అప్పుడు సంచలనం కలిగించింది. పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి మృతదేహాన్ని ఖననం చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ 6 నెలల తర్వాత అలాంటి ఘటన వెలుగు చూడగా మూడు ప్రాణాలను మంత్రాల అనుమానంతోనే బలి తీసుకున్నారు.

50 మంది వడ్డీ వ్యాపారులు

గ్రామంలో దాదాపు 50 కుటుంబాల వరకు వడ్డీ వ్యాపారులు ఉన్నట్లు సమాచారం. ఇది కూడా 10 నుంచి 20 శాతానికి వడ్డీ వ్యాపారం సాగుతుందని గ్రామంలో ప్రచారం సాగుతోంది. పోలీసులు వడ్డీ వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో గ్రామంలో జరిగే వడ్డీ వ్యాపారంతోపాటు, మద్యం అమ్మకాల నియంత్రణకు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు. 10 నుంచి 12 రాష్ట్రాలకు చెందిన వారు వివిధ పనుల కోసం వచ్చి దాదాపు 10 నుంచి 15 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. ఆధార్‌ కార్డు పొంది ఇళ్లు నిర్మించుకోగా, కొందరు అద్దెకు ఉంటున్నారు. చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి బంధువుల ఇంటికి వచ్చి ఇక్కడే తల దాచుకుంటున్నారు. ఈ హత్యకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

సంఘటన స్థలం వద్ద ఎస్పీ సింధుశర్మ, అదనపు ఎస్పీ రూపేష్‌, డీఎస్పీ ప్రకాష్‌

గతంలోనూ ఘటనలు..

* 2017 జులై 10న హుజూరాబాద్‌ మండలం కందుగులలో మంత్రాల నిందారోపణలతో ఓ కుటుంబం బలి అయింది. ఎవరికి అనారోగ్య సమస్య తలెత్తినా.. వీరి వైపే వేలెత్తి చూపించే తీరుని తట్టుకోలేక ఇంటి యజమాని కొమురయ్యతోపాటు అతని భార్య ముగ్గురు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు.

* జగిత్యాల జిల్లా మేడిపల్లిలో నాలుగేళ్ల కిందట మంత్రాల నెపంతో ఓ వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. ఇదే తరహాలో పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలోనూ మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో కొందరిపై దాడి చేసిన సంఘటనలున్నాయి. ఈ తరహా ఘటనల్లో పలువురిపై కేసులు నమోదయ్యాయి.

* క్షుద్రపూజలు చేస్తున్నారనే విషయంలోనూ ఇంకా పలు గ్రామీణ ప్రాంతాల్లో అడపాదడపా అలజడులు రేగుతున్నాయి. ఈ విషయమై తరచూ గొడవలు జరుగుతున్న సందర్భాలు పోలీసుల దృష్టికి వస్తున్నాయి. వీటిపై అవగాహన కల్పించే చర్యలు ఇటీవల కనిపించకపోవడంతో ఈ జాడ్యపు మూలాలు వీడటంలేదు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని