logo

ఆయకట్టు రైతులకు మళ్లీ నిరాశే

రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు పూర్తి కాకపోవడంతో ఈ ఏడాది కూడా పూర్తి స్థాయిలో ఆయకట్టు రైతులకు నీరందడం ప్రశ్నార్థకంగా మారింది. బీర్‌పూర్‌, ధర్మపురి మండలాల రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరందించాలన్న ఉద్దేశంతో రోళ్లవాగు

Published : 27 Jun 2022 04:28 IST

నిలిచిన రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు
సారంగాపూర్‌, న్యూస్‌టుడే

బుగ్గప్రాంతంలో నిలిచిన నీరు

రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు పూర్తి కాకపోవడంతో ఈ ఏడాది కూడా పూర్తి స్థాయిలో ఆయకట్టు రైతులకు నీరందడం ప్రశ్నార్థకంగా మారింది. బీర్‌పూర్‌, ధర్మపురి మండలాల రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరందించాలన్న ఉద్దేశంతో రోళ్లవాగు ప్రాజెక్టు అధునికీకరణ పనులు ఆరేళ్ల క్రితం ప్రారంభించారు. ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో మళ్లీ పాత పద్ధతిన నీరందించే పరిస్థితి ఏర్పడింది. 2016లో రూ.60కోట్లతో టెండర్‌ ప్రక్రియ ప్రారంభమవ్వగా, 2017లో ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. ఈ ఏడాది జూన్‌ వరకు పూర్తి చేసి ఆయకట్టు రైతులకు పూర్తి స్థాయిలో నీరందిస్తామని, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటించి పనులు వేగవంతం చేసినప్పటికీ ప్రాజెక్టు నిర్మాణ అంచనా విలువ పెరగడం.. మట్టి సేకరణ పూర్తి కాకపోవడంతో పనుల్లో మరింత జాప్యం జరుగుతుంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో పనులు నిలిచిపోయి.. ఆక్టోబరు వరకు పనులు ప్రారంభించే పరిస్థితి లేకుండా పోయింది.

పెరిగిన అంచనా విలువ
ప్రాజెక్టు ఆధునికీకరణ చేపట్టే సమయంలో 0.25 టీఎంసీ సామర్థ్యం నుంచి టీఎంసీ నిలువ చేసేందుకు రూ.60 కోట్లు మాత్రమే అంచనా ఉండగా, పనుల జాప్యం, పెరిగిన భూ నిర్వాసితుల విలువతో ప్రస్తుతం రూ.136 కోట్లకు చేరుకుంది. దీనివల్ల అదనపు నిధుల కోసం అధికారులు ప్రభుత్వానికి నివేదించడంతో నిధుల మంజూరు జాప్యం కారణంగా గుత్తేదారు పనుల్లో వేగం తగ్గించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా కట్ట నిర్మాణానికి అవసరమైన మట్టిని తరలించడం సమస్యగా మారింది. ప్రస్తుతం వర్షాలు కురవడంతో మట్టి సేకరణతోపాటు, కట్ట నిర్మాణం చేపట్టడం నిలిచిపోయింది.

పెండింగ్‌లో బిల్లులు
ప్రస్తుతం మొదటి కట్ట పొడవు 450 మీటర్ల పనులు పూర్తి కాగా రెండో కట్ట పొడవు 300 మీటర్లకు గానూ అటవీ ప్రాంతంలో ఉండడంతో అనుమతి రాకపోవడంతో ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు. బుగ్గ నీటిని అరికట్టేందుకు నిర్మించే కట్ట ప్రాంతంలో దాదాపు 75 మీటర్ల పొడవు, 15 మీటర్ల ఎత్తుతో కట్టను నిర్మించాల్సి ఉంది. అంతే కాకుండా ప్రాజెక్టు ఉన్న మూడు తూములకు షట్టర్లు బిగించాల్సి ఉంది. ప్రస్తుతం వర్షాలు కురవడం.. నిధులు మంజూరు లేకపోవడంతోపాటు గతంలో చేసిన పనులకు కూడా బిల్లులు రాక పనులు నిలిచిపోయాయి.


పాతపద్ధతిలోనే..
- చక్రునాయక్‌, డీఈఈ, రోళ్లవాగు ప్రాజెక్టు

జూన్‌ మొదటి వారం నుంచే వర్షాలు కురవడంతో పనులు నిలిచిపోయాయి. వర్షాలు పూర్తి కాగానే పనులు ప్రారంభించేలా చర్యలు చేపడతాం. రైతులకు ఇబ్బంది లేకుండా పాత పద్ధతిలో ఆయకట్టు రైతులకు నీరందించేలా చూస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని