logo

విస్తరిస్తేనే శాశ్వత పరిష్కారం

తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయానికి వెళ్లే ఘాట్‌రోడ్డును రూ.62 కోట్లతో విస్తరించడానికి ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 2018 సెప్టెంబరు 11న ఘాట్‌రోడ్డుపై నుంచి ఆర్టీసీ బస్సు దిగుతుండగా

Published : 07 Jul 2022 03:03 IST

కొండగట్టు ఘాట్‌రోడ్డు

న్యూస్‌టుడే, మల్యాల

ప్రమాదకరమైన

తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయానికి వెళ్లే ఘాట్‌రోడ్డును రూ.62 కోట్లతో విస్తరించడానికి ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 2018 సెప్టెంబరు 11న ఘాట్‌రోడ్డుపై నుంచి ఆర్టీసీ బస్సు దిగుతుండగా చివరి మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 65 మంది దుర్మరణం చెందిన సంఘటన తర్వాత ప్రభుత్వం ఘాట్‌రోడ్డుపై నుంచి వాహనాల ప్రయాణాన్ని నిషేధించారు. మూడు సంవత్సరాల తొమ్మిది నెలలపాటు ఘాట్‌రోడ్డుపై నుంచి వాహనాలు దిగకుండా ఆంక్షలు విధించడంతో దిగువ కొండగట్టు ప్రాంతంలోని వ్యాపారులు ఘాట్‌రోడ్డును పునఃప్రారంభించాలని ఆందోళనలు చేపట్టారు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధుల విన్నపం మేరకు ఎమ్మెల్యే రవిశంకర్‌, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ స్పందించి చివరికి గత నెల 30న ఘాట్‌రోడ్డును పునఃప్రారంభించారు. దీంతో స్థానిక వ్యాపారులు, భక్తులు సంతోషం వ్యక్తం చేసినప్పటికీ దాదాపు 1.5 కి.మీ పొడవుగల ఘాట్‌రోడ్డును విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

మలుపు ఘాట్‌రోడ్డుపై 2018లో ప్రమాదం జరిగిన ప్రదేశం ఇదే

రక్షణ చర్యలు అవసరం
ఘాట్‌రోడ్డును పునఃప్రారంభించిన తర్వాత వాహనాల వేగాన్ని నియంత్రించడానికి మూడు చోట్ల స్పీడ్‌బ్రేకర్ల వద్ద డ్రమ్ములు ఏర్పాటు చేసిన అధికారులు రాత్రి వేళల్లో అవి వాహనచోదకులకు కనిపించడానికి రేడియం స్టిక్కర్లు వేయాలని సూచిస్తున్నారు. ఘాట్‌రోడ్డుపై బస్సు ప్రమాదం జరిగిన తర్వాత ఆర్‌అండ్‌బీ అధికారులు దాదాపు రూ.1.40 కోట్లు వెచ్చించి పలు చోట్ల రక్షణ గోడలు, వేగనియంత్రికలు నిర్మించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే ప్రమాదాల నివారణకు ఘాట్‌రోడ్డును వెడల్పు చేసి మధ్యలో డివైడర్లు నిర్మించి ప్రమాదకరమైన మలుపులను సరిచేయాలని, అవసరమైతే రెండో ఘాట్‌రోడ్డు నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. అంజన్న దర్శనం కోసం ప్రతి శని, మంగళవారాలు అధిక సంఖ్యలో భక్తులు కొండగట్టుకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో కొండపైన ‘వై’ జంక్షను వద్ద వాహనాలను నియంత్రించడానికి, అధికలోడుతో ఘాట్‌రోడ్డుపై నుంచి వాహనాలు దిగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మైకులో భక్తులకు సూచనలు చేయడానికి ఆలయ అధికారులు కూడా ఏర్పాటు చేయాలి. రవాణాశాఖ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని