logo

సరఫరా కావట్లేదు.. బియ్యం ఇయ్యట్లేదు..!

రేషన్‌ పంపిణీ ప్రక్రియలో జిల్లాలో ఆలస్యమనే తంతు కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 487 చౌకధరల దుకాణాలున్నాయి. వీటి పరిధిలో 2,79,918 మంది కార్డుదారులున్నారు. ప్రతి ఒక్కరికి పది కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని అందిస్తున్నారు.

Published : 10 Aug 2022 04:55 IST

ఈనాడు, కరీంనగర్‌

* కరీంనగర్‌ పట్టణంలో మొత్తం 58 దుకాణాలు ఉండగా.. మంగళవారం కేవలం 31 దుకాణాల ద్వారానే రేషన్‌ బియ్యం పంపిణీ జరిగింది. ఈ ఒక్క రోజు కేవలం 1956 మందికి మాత్రమే డీలర్లు సరకును అందించగలిగారు. చాలా దుకాణాల్లో గత నెలకు సంబంధించిన స్టాక్‌ను తమ వద్దకు వచ్చిన కార్డుదారులకు అందించే ప్రయత్నాల్ని చేస్తున్నారు. అరకొరగా ఉన్న సరకును కొందరికే అందిస్తే కష్టమనే భావనతో.. పూర్తిస్థాయిలో కోటా వచ్చాకే ప్రక్రియను ప్రారంభించాలనే ఆలోచనలో పలువురున్నారు.

* గడిచిన కొన్ని నెలలుగా బియ్యం సరఫరా విషయంలో జిల్లాలో గందరగోళమనే పరిస్థితి నెలకొంటోంది. దీంతో డీలర్లు  ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. కార్డుదారులకు సమాధానం చెప్పుకోలేక.. ఉన్న కాసిన్ని బియ్యాన్ని పక్కాగా ఇవ్వలేక సతమతమవుతున్నారు. రోజువారీగా తమకు ఎదురవుతున్న సమస్యను సంబంధిత పర్యవేక్షణ అధికారులకు విన్నవించినప్పటికీ ఇబ్బంది తీరేలా పరిష్కారం దొరకడంలేదనే భావన కొందరు డీలర్ల నుంచి వ్యక్తమవుతోంది.

* గత నెలలోనూ ఆలస్యంగానే దుకాణాలు తెరచుకున్నాయి. వరసగా వర్షాలు కురియడంతోపాటు లారీల ద్వారా సరఫరా అయ్యే విషయంలో చిక్కులు అధికారుల్ని ఇబ్బందులకు గురిచేశాయి. 5వ తేదీన ప్రారంభమైన ప్రక్రియను 25వ తేదీ వరకు కొనసాగించారు. అయినా పూర్తిస్థాయిలో కార్డుదారులు బియ్యాన్ని పొందలేకపోయారు.జూలై మాసంలో 2,48,535 మంది 78.70లక్షల కిలోల బియ్యాన్ని అందుకున్నారు.

బియ్యం పోస్తున్న దృశ్యం

రేషన్‌ పంపిణీ ప్రక్రియలో జిల్లాలో ఆలస్యమనే తంతు కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 487 చౌకధరల దుకాణాలున్నాయి. వీటి పరిధిలో 2,79,918 మంది కార్డుదారులున్నారు. ప్రతి ఒక్కరికి పది కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని అందిస్తున్నారు. వాస్తవానికి ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఠంచనుగా లబ్ధిదారులకు దుకాణాలకు వచ్చిన సరకును అందించే ప్రక్రియను ప్రారంభించాలి. 20వ తేదీ చివరి గడవు తేదీ అవడంతో దాదాపుగా మొదటి పది రోజుల్లోనే చాలామంది డీలర్లు తమకు వచ్చిన కోటాను పూర్తిచేస్తారు. ఈ నెలలో ఇప్పటికే 9 రోజులు పూర్తయినా..అనుకున్న స్థాయిలో కార్డుదారులకు అవసరమై సరకు దరి చేరలేదు. దుకాణాలను 4వ తేదీ నుంచి తెరవడం గమనార్హం.!

పలురకాల సాకులతో..
లారీలు అందుబాటులో లేవనే సాకుతోపాటు వరసగా కురిసిన వర్షాల వల్ల ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద నుంచి బస్తాలను పంపించడం ఇబ్బందిగా మారుతుందనేది డీలర్లకు వినిపిస్తున్న మాట. పైగా గత కొన్నాళ్లుగా మాత్రం ఎప్పటికప్పుడు సరకును లోడ్‌ చేసి వాహనాల్లో పంపించే విషయంలో పర్యవేక్షణ లోపిస్తునట్లు స్పష్టంగా అర్థమవుతోంది. బియ్యం తడుస్తాయనే ఉద్దేశంతో లారీలు అనుకున్న విధంగా దుకాణాల చెంతకు చేరడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోకి రేషన్‌ చేరకపోవడంతో పాత స్టాక్‌ను ఉన్న వరకు పంచుతూ డీలర్లు నెట్టుకొస్తున్నారు. తమకు వచ్చే లోడ్‌ కోసం రోజులో ఐదారుసార్లు  ఉన్నతాధికారులకు ఫోన్‌లు చేయాల్సి వస్తుందని డీలర్లు వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని