logo

ఆన్‌లైన్‌లో అనుమతి.. ఆమ్యామ్యాలతోనే పని

‘పట్టణంలోని ఆర్‌ఎన్‌టీనగర్‌కు చెందిన ప్రయివేటు ఉద్యోగి సుభాష్‌ గత నవంబరు 7న భవన నిర్మాణ అనుమతి రెన్యూవల్‌ కోసం టీఎస్‌బీపాస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు.

Published : 21 Jan 2023 05:23 IST

న్యూస్‌టుడే, జగిత్యాల పట్టణం

‘పట్టణంలోని ఆర్‌ఎన్‌టీనగర్‌కు చెందిన ప్రయివేటు ఉద్యోగి సుభాష్‌ గత నవంబరు 7న భవన నిర్మాణ అనుమతి రెన్యూవల్‌ కోసం టీఎస్‌బీపాస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. రెవెన్యూ ఉద్యోగి నిర్మిత భవనాన్ని పరిశీలించి ధ్రువీకరించారు. బల్దియా ప్రణాళిక విభాగం ఉద్యోగి క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా దరఖాస్తు తిరస్కరించడంతో అనుమతి నిలిపివేశారు. ఇదేంటని బల్దియా అధికారులను నిలదీస్తే మరోమారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రెండోసారి దరఖాస్తు చేస్తే రెవెన్యూ ఉద్యోగి తిరస్కరించారు. తాజాగా మూడోసారి దరఖాస్తు చేసినప్పటికీ అనుమతి కోసం నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడిందని దరఖాస్తుదారుడు వాపోయారు.’

స్పెషల్‌గ్రేడ్‌ పురపాలిక జగిత్యాలలో భవన నిర్మాణ అనుమతి దొరకాలంటే చేతినిండా డబ్బులన్నా ఉండాలి లేదా పలుకుబడి కలిగిన నేతల ప్రమేయమైనా ఉండి తీరాల్సిందే. పైన ఉదహరించినట్లు సుభాష్‌లాంటి సగటు దరఖాస్తుదారులు ఈ రెండూ లేనట్లయితే కాళ్లరిగేలా కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. అనుమతి రాకపోవడంతో నిర్మాణం ముందుకుసాగక.. బ్యాంకు రుణం అవసరమైనవారు ఆర్థిక అవసరాలు తీరక నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వం అనుమతుల్ని పారదర్శకంగా అందించేందుకు టీఎస్‌బీపాస్‌ ఆన్‌లైన్‌ విధానాన్ని అమలులోకి తెచ్చింది. దరఖాస్తు చేసిన 21 రోజుల్లో నిబంధనల మేరకు అధికారులు అనుమతి జారీ చేయాల్సి ఉంటుంది. కానీ బల్దియా ప్రణాళిక విభాగం అంతులేని అక్రమాలకు పాల్పడుతోంది. ఏడాదిక్రితం ఏసీబీ దాడి చేసి ముగ్గుర్ని అరెస్టు చేసినా మార్పు కనిపించడంలేదు. పట్టణంలో గత జులై 1 నుంచి గత డిసెంబరు 31 వరకు మొత్తం 280 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 174 దరఖాస్తులకు అనుమతి లభించింది. మిగిలిన 126 దరఖాస్తులను వివిధ కారణాలతో అధికారులు తిస్కరించారు. అనుమతుల విషయంలో బల్దియా, రెవెన్యూ ఉద్యోగుల మధ్య సమన్వయం కొరవడింది. ఈ కారణంగా దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు.

నిబంధనల బూచి.. నిలువెల్లా దోచి...

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసిన వారికి నిబంధనల సాకుతో అధికారులు ఇబ్బందులపాలు చేస్తున్నారు. పాత ఇల్లు, స్థలం ఉన్నవారు నూతన నిర్మాణాకి వెళ్తే.. 1983 నుంచి ఇంటి పన్ను చెల్లించినవారికి కొత్త పురపాలక చట్టం ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తించదు. ఈ పన్ను చెల్లించనివారికి మార్కెట్‌ విలువలో 14 శాతం ఎల్‌ఆఎర్‌ఎస్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చాలా మందికి ఈ విషయంపై అవగాహన లేకపోవడం, అసెస్‌మెంట్‌ కాపీలు దగ్గర లేకపోవడంతో అధికారులు వారికి ఎల్‌ఆర్‌ఎస్‌ తప్పనిసరని చెబుతూ అనుమతులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. చేసేదేంలేక అధికారులను ఆశ్రయించిన దరఖాస్తుదారులతో ఎల్‌ఆర్‌ఎస్‌ పేరిట కొంత, అనుమతి కోసం ఓ ధర నిర్ణయించి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే అసెస్‌మెంట్‌ కాపీలను ప్రభుత్వం కొన్నాళ్లుగా జారీ చేయడంలేదు. కానీ అధికారులు రికార్డుల్లో పాత ఇంటికి సంబంధించిన పన్ను వసూళ్లు చూసి ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తిస్తుందా లేదా అనే విషయం తెలిపే అవకాశం ఉన్నప్పటికీ అవినీతే ప్రధానంగా ప్రణాళికా విభాగం వ్యవహరిస్తోంది. మరోవైపు దరఖాస్తుదారుడి ఇంటి నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే బల్దియా ఉద్యోగులు దరఖాస్తును ఆన్‌లైన్‌లో తిరస్కరిస్తున్నారు. సదరు దరఖాస్తుదారుడు అనుమతి కోసం నిరీక్షించి కార్యాలయానికి వెళ్లి వాకబు చేస్తే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. అయితే డబ్బులిచ్చినవారికి మాత్రం సజావుగా అనుమతి చేతికందిస్తున్నారు. ఈ తరహా అక్రమ వ్యవహారాల కోసం అధికారులు కొందరు దళారులను ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.


మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తాం
- నరేష్‌, ఇన్‌ఛార్జి కమిషనర్‌

దరఖాస్తుదారులు అనుమతిలో ఇబ్బందులుంటే మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాం. ఇటీవల రెండు దరఖాస్తులకు అనుమతి జారీ చేశాం. ప్రజావాణిలోనూ రెండు దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం ఉంది. నిబంధనల మేరకు ఉన్నవాటికి వెంటనే అనుమతి జారీ చేస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని