logo

అభివృద్ధికి అన్ని విధాలా తోడ్పాటు

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా హుజూరాబాద్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి కేటీఆర్‌ ధీమాను వ్యక్తం చేశారు. మంగళవారం జమ్మికుంటలో నిర్వహించిన భారాస బహిరంగ సభ శ్రేణుల్లో కొత్త జోష్‌ను నింపింది.

Published : 01 Feb 2023 05:02 IST

హుజూరాబాద్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయం!
జమ్మికుంట సభలో మంత్రి కేటీఆర్‌
ఈనాడు, కరీంనగర్‌, న్యూస్‌టుడే- జమ్మికుంట

జమ్మికుంట సభలో  పాల్గొన్న జనం.. కేటీఆర్‌ అభివాదం

ప్పుడు ఎన్నికలు వచ్చినా హుజూరాబాద్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి కేటీఆర్‌ ధీమాను వ్యక్తం చేశారు. మంగళవారం జమ్మికుంటలో నిర్వహించిన భారాస బహిరంగ సభ శ్రేణుల్లో కొత్త జోష్‌ను నింపింది. ఆకట్టుకునే జెండాలు, ఫ్లెక్సీలు తోరణాలు, కటౌట్లతో పట్టణం గులాబీమయమైంది. నియోజకవర్గ పరిధిలోని పురపాలికలు, ఆయా గ్రామాల నుంచి తరలి వచ్చిన జనాలను ఉద్దేశించి కేటీఆర్‌ మాట్లాడుతూ కచ్చితంగా ఇక్కడి ప్రజల ఆశీర్వాదం భారాసకు ఉంటుందని అన్నారు. ఎన్నికలు వస్తే మళ్లీ భాజపా వారు హుజూరాబాద్‌లో చంపుకొంటారో.. సాదుకుంటారో అంటూ బీద ముఖం పెట్టుకుని వస్తారని.. పరోక్షంగా ఈటల రాజేందర్‌ను విమర్శించిన కేటీఆర్‌ వారి గులుగుడు, అలుగుడు చూసి ఆగం కావద్దని.. గందరగోళంలో పడొద్దని చెప్పారు. ఉప ఎన్నికలో జరిగిన పొరపాటు మళ్లీ జరగొద్దని.. హుజూరాబాద్‌ గడ్డ మీద రాబోయే ఏడెనిమిది నెలల్లో గులాబీ జెండా ఎగుర వేద్దామన్నారు. గుజరాతోళ్ల గులాంగిరీ చేసే షోకు, చెప్పులు మోయడం.. రేషం గల కరీంనగర్‌ బిడ్డలుగా మనకు అవసరం లేదని అన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గానికి అవసరమైన నిధుల్ని అందిస్తూ అభివృద్ధికి తోడ్పాటునిస్తామని ప్రకటించారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అడిగిన విధంగానే జమ్మికుంట, హుజూరాబాద్‌ మైదానాల ప్రగతికి రూ.కోట్ల నిధుల్ని అందిస్తామని.. ప్రజల మధ్యనే ఉంటూ వారి బాగోగుల్ని చూడాలని.. జనాల ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయని కౌశిక్‌రెడ్డికి సూచించారు.

* మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ మాట్లాడుతూ.. సాగునీటికి పోరాటం చేసిన గడ్డకు కాళేశ్వరం జలాలను అందించిన ఘనత కేసీఆర్‌దన్నారు. భాజపా నాయకులు ఇక్కడి ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. మహిళా సంఘాలకు అవసరమైన రుణం రూ.100 కోట్లను సీఎంతో మాట్లాడి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.

* మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి పాటుపడే సర్కారు తమదన్నారు. కేంద్రానికి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే ఈ బడ్జెట్‌లో బీసీ మంత్రిని ప్రకటించాలని సవాలు విసిరారు. అప్పుడు తన చేతికి ఉన్న బంగారు తొడుగు ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌కు తొడుగుతా అన్నారు. భవిష్యత్తులో కౌశిక్‌రెడ్డి శాసనసభ్యుడు అవుతారని అన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. మోదీ మేలు చేసింది అదానీ అంబానీలకు అని ఎద్దేవా చేశారు. సభలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ విజయ, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి శ్రీనివాస్‌ యాదవ్‌లు మాట్లాడారు. ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యేలు రవిశంకర్‌, సతీశ్‌బాబు, రసమయి బాలకిషన్‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, భారాస జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

వేదికపై ఎమ్మెల్యేలు రవిశంకర్‌, సతీశ్‌బాబు, రసమయి, ఎమ్మెల్సీలు రమణ, కౌశిక్‌రెడ్డి,  మంత్రులు గంగుల, ఎర్రబెల్లి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, జడ్పీఛైర్‌పర్సన్‌ విజయ

ఆకట్టుకున్న ర్యాలీలు.. : సభాస్థలికి ఆటాపాటలతో ఉత్సాహభరిత వాతావరణంలో భారాస శ్రేణులు ర్యాలీగా తరలివచ్చాయి. డోలు వాయిద్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ మైదానానికి చేరుకున్నారు. వేదికపైకి చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు కౌశిక్‌రెడ్డి కూతురు త్రినిక పుష్పగుచ్ఛాన్ని అందించి స్వాగతం పలికింది. పలువురు వినతి పత్రాలను అందించారు. సాయంత్రం 4.20 గంటలకు సభాస్థలికి వచ్చిన కేటీఆర్‌ సుమారు 20 నిమిషాల పాటు ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. సాయంత్రం 5.30 గంటలకు సభ ముగిసింది. హుజూరాబాద్‌ వరకు కాన్వాయ్‌లో వెళ్లిన మంత్రి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. అంతకుముందు వేదికపై వేర్‌హౌస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సాయిచంద్‌ బృందం పాటలతో ఆకట్టుకున్నారు. సభాస్థలి చుట్టూ ఏర్పాటు చేసిన భారీ కటౌట్‌లు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. మంత్రి కేటీఆర్‌.. ఎమ్మెల్సీ కౌశిక్‌ పేరును పలికినప్పుడు ప్రజల నుంచి స్పందన వచ్చింది. కౌశిక్‌కు మంత్రి కేటీఆర్‌ కితాబునిచ్చిన తీరుతో పార్టీ శ్రేణుల్లో ఆయనకే టికెట్‌ వస్తుందేమో అన్న చర్చ చేశారు. ఇల్లందకుంట సమీపంలో మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని