logo

దాతలు అండగా.. సాధన మెండుగా

ప్రభుత్వం నుంచి వరుస ఉద్యోగ ప్రకటనలు వెలువడుతున్న నేపథ్యంలో కొలువులు సాధించాలనే పట్టుదల నిరుద్యోగుల్లో పెరుగుతోంది. ఎవరికి వారు ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు.

Updated : 05 Feb 2023 06:15 IST

గ్రామాల్లో నిరుద్యోగులకు పలువురి చేయూత

కోనరావుపేటలో పోలీసుశాఖ ఏర్పాటుచేసిన గ్రంథాలయంలో యువత

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: ప్రభుత్వం నుంచి వరుస ఉద్యోగ ప్రకటనలు వెలువడుతున్న నేపథ్యంలో కొలువులు సాధించాలనే పట్టుదల నిరుద్యోగుల్లో పెరుగుతోంది. ఎవరికి వారు ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు. ఇందులో కొందరు హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ లాంటి నగరాల్లో శిక్షణకు వెళుతున్నారు. మరికొందరు జిల్లానిలోని స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో ఏర్పాటు చేసిన గ్రంథాలయాలు, రీడింగ్‌ రూంలో సన్నద్ధమవుతున్నారు.

ఉపాధ్యాయుల సేవాభావం

గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటలో రెండేళ్ల క్రితం ఊరిలోని ఉపాధ్యాయులంతా కలిసి పాత పంచాయతీ భవనాన్ని గ్రంథాలయంగా మార్చారు. అందులో పుస్తకాలు ఏర్పాటు చేసే సామగ్రి, కుర్చీలను ఉంచారు. దిన పత్రికలు, దేశచరిత్ర, వివిధ రకాల కథల పుస్తకాలను ఉంచారు. ప్రస్తుతం పోటీ పరీక్షలు ఉండటంతో జనరల్‌ స్టడీస్‌, కరెంట్ అఫైర్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. పోటీ పరీక్షలకు ఉపయోగపడే కొత్త పుస్తకాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆ గ్రామ యువత కోరుతున్నారు.

విజ్ఞానాన్ని పంచాలని..

ఎల్లారెడ్డిపేట మండలం సింగారంలో పనస హనుమద్దాసు సేవాసంస్థ ఆధ్వర్యంలో 2015లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. గ్రామస్థులందరికీ విజ్ఞానాన్ని పంచాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌, కరీంనగర్‌ లాంటి ప్రాంతాల్లో శిక్షణ పూర్తిచేసుకున్న ఉద్యోగార్థులు నిత్యం ఇక్కడికి వచ్చి చదువుతున్నారు. ఇదే మండలం హరిదాస్‌నగర్‌లో జడ్పీటీసీ సభ్యుడు చీటి లక్ష్మణ్‌రావు చిన్నారుల కోసం రీడింగ్‌ గదిని ఏర్పాటు చేశారు. పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రస్తుతం ఉద్యోగార్థులకు ఉపయోగపడుతోంది.

యువత చైతన్యానికి

సిరిసిల్లకు చెందిన నాగుల పూర్ణచందర్‌ హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. తాను చదువుకునే రోజుల్లో ఎదురైన ఇబ్బందులు మరెవరూ పడకూడదనే ఉద్దేశంతో పట్టణంలో గదిని అద్దెకు తీసుకొని గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. అక్షర చైతన్య ఎడ్యుకేషనల్‌ ట్రస్టు 1200 పుస్తకాలతో ప్రారంభం కాగా అయిదేళ్లలో నాలుగు వేలకు చేరాయి. పోటీ పరీక్షల కోసం ఇటీవల మరిన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ఉద్యోగార్థులకు ఈ గ్రంథాలయం 24 గంటలు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశారు. ఇందులో చదువుకున్న చాలా మంది ఉపాధ్యాయులుగా, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించారు. యువతలో అక్షర చైతన్యం నింపేలా అయిదేళ్లుగా కృషి చేస్తున్నారు.

రీడింగ్‌ రూం

ఇంట్లో ఏకాంతంగా చదువుకునేందుకు ఇబ్బందులు పడేవారికి వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచారి ఆధ్వర్యంలో సత్యం రెడ్డి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సహకారంతో ఉచిత స్డడీహాల్‌ ఏర్పాటు చేశారు. మహాలక్ష్మి ఆలయం సమీపంలోని ఈ కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఇందులో వంద మంది వరకు చదువుకునేలా కుర్చీలు, తాగునీరు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం యువ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్‌ శరీరధారుడ్య పరీక్షల్లో అర్హత సాధించిన వారు పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

అందుబాటులో అన్ని పుస్తకాలు

కోనరావుపేట మండలం కేంద్రంలో 2019లో మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, జిల్లా పోలీసుశాఖ సంయుక్తంగా రూ.20 లక్షలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో యువత, విద్యార్థులకు అవసరమయ్యే అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచారు. నిత్యం 15-20 మంది పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు ఇక్కడికి వస్తున్నారు. చరిత్ర ఇతర పాఠ్యాంశాలకు సబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కొత్త పుస్తకాలు అందజేయాలని యువకులు కోరుతున్నారు.


ఇళ్లే గ్రంథాలయం

అంజయ్య ఇంట్లోని గ్రంథాలయంలో యువత

వేములవాడకు చెందిన వీరగోని ఆంజనేయులు తన ఇంటినే గ్రంథాలయంగా మార్చారు. ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఇంట్లోని మూడు గదులు మొత్తం పుస్తకాలతో నిండిపోయాయి. తనకు వచ్చే పింఛనులో నెలకు కొంత మొత్తాన్ని కూడబెట్టి ఇటీవల రూ.5లక్షలతో ప్రత్యేకంగా రీడింగ్‌ రూం ఏర్పాటు చేశారు. అందులో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువకులు నిత్యం వచ్చి చదువుకుంటారు. గ్రంథాలయంలోని పుస్తకాలతో నోట్్స తయారు చేసుకుంటారు. ఇటీవల ఒక ప్రైవేటు పబ్లిషర్స్‌ సంస్థ రూ.20వేల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలను గ్రంథాలయానికి వితరణ చేసింది. వీరితోపాటు తెలంగాణ గ్రంథాలయ సంస్థ అసోసియేషన్‌ రూ.50వేల విలువైన పుస్తకాలను అందజేసింది.


ఏకాగ్రతతో చదువుకోవచ్చు
-బండి సాయికుమార్‌, వేములవాడ

నేను డిగ్రీ పూర్తి చేశాను. 2018లో ఎస్సై ఉద్యోగానికి సిద్ధమయ్యా. శరీరధారుడ్య పరీక్షల్లో స్వల్ప పాయింట్ల తేడాతో ఎంపిక కాలేదు. అప్పటి నుంచి గ్రూప్స్‌ కోసం హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నా. అక్కడ తీసుకున్న స్టడీ మెటీరియల్‌తో ఇంటివద్దే సన్నద్ధమవుతున్నా. ఇంట్లో ఏకాగ్రత కుదరదు. గ్రంథాలయంలో చదువు కోవడానికి అనుకూలంగా ఉంది.


మరిన్ని పుస్తకాలు అవసరం
-గొట్టె ఉదయ్‌, కోనరావుపేట

పోలీసు కొలువు కోసం ఏడాది శిక్షణ తీసుకున్నా.. ఇంటి దగ్గర చదువుకునేందుకు అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో పోలీసుశాఖ ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి వచ్చా. ఇందులో పాత పుస్తకాలు ఉన్నాయి. గ్రూప్స్‌కు అవసరమైన అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటే మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని