logo

నందిమేడారంలో కోర్టు ఏర్పాటు చరిత్రాత్మకం

నందిమేడారంలో కోర్టు ఏర్పాటు చేయడం చరిత్రాత్మకమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అన్నారు.

Published : 06 Feb 2023 02:36 IST

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

వేదికపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ నవీన్‌రావు, జస్టిస్‌ శ్రవణ్‌కుమార్‌, జిల్లా న్యాయమూర్తి నాగరాజు, కలెక్టర్‌ సంగీత, సీపీ రెమా రాజేశ్వరి తదితరులు


ధర్మారం, న్యూస్‌టుడే: నందిమేడారంలో కోర్టు ఏర్పాటు చేయడం చరిత్రాత్మకమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అన్నారు. ఆదివారం ధర్మారం మండలం నందిమేడారంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టును ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన జిల్లా పెద్దపల్లి అన్నారు. ధూళికట్ట బౌద్ధ స్తూపాలు, ఓదెల మల్లికార్జునస్వామి, కమాన్‌పూర్‌లో ఆదివరాహస్వామి ఆలయాలు, రామగిరి ఖిల్లా తదితర ప్రాంతాలను ప్రస్తావించారు. జిల్లాలో 16,465 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా నెల రోజుల్లోనే భవన నిర్మాణం పూర్తి చేసిన యజమాని గట్టయ్యను సీజే అభినందించారు. గట్టయ్యను న్యాయమూర్తి జస్టిస్‌ పొనుగోటి నవీన్‌రావు సన్మానించారు.

కోర్టును ప్రారంభిస్తున్న సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ నవీన్‌రావు, జస్టిస్‌ శ్రవణ్‌కుమార్‌


ఘన స్వాగతం

నందిమేడారానికి చేరుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌కు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం అనంతరం సీజే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సర్వ మత ప్రార్థనల అనంతరం కోర్టు హాలును ప్రారంభించారు. సభా వేదిక వద్ద ప్రధాన న్యాయమూర్తితో పాటు న్యాయమూర్తులు జస్టిస్‌ పొనుగోటి నవీన్‌రావు, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డి, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌, జస్టిస్‌కె.సురేందర్‌, జస్టిస్‌ ఎం.సుధీర్‌కుమార్‌, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డి, జస్టిస్‌ ఈవీ.వేణుగోపాల్‌, జస్టిస్‌ నగేశ్‌ భీమపాక, జస్టిస్‌ పుల్ల కార్తీక్‌, జస్టిస్‌ కె.శరత్‌, జస్టిస్‌ జె.శ్రీనివాసరావులను పెద్దపల్లి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సన్మానించారు. ప్రధాన న్యాయమూర్తి జ్యోతిని వెలిగించి సమావేశాన్ని ప్రారంభించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు ప్రారంభోపన్యాసం చేశారు. నందిమేడారం కోర్టు పరిధిలో 281 సివిల్‌, 731 క్రిమినల్‌ కేసులున్నాయన్నాయన్నారు. మంథని, గోదావరిఖని, సుల్తానాబాద్‌, కరీంనగర్‌, ధర్మారం, ధర్మపురి బార్‌ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులను ఘనంగా సన్మానించారు. తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు కాసుగంటి లక్ష్మణ్‌కుమార్‌, కలెక్టర్‌ డా.సర్వే సంగీత సత్యనారాయణ, సీపీ రెమా రాజేశ్వరి పాల్గొన్నారు. పెద్దపల్లి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌.సురేష్‌బాబు వందన సమర్పణ చేశారు.


నందిపంపుహౌస్‌ సందర్శన

కాళేశ్వరం పథకం ఆరో ప్యాకేజీలోని నంది పంపుహౌస్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు సందర్శించారు. స్థానిక పల్లె ప్రకృతివనంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్‌ నవీన్‌రావు, జిల్లా ప్రధానన్యాయమూర్తి నాగరాజు, కలెక్టర్‌ సంగీత, జిల్లాలోని ఇతర కోర్టుల న్యాయమూర్తులు మొక్కలు నాటారు. తహసీల్దారు శ్రీనివాస్‌, ఎంపీడీవో జయశీల తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని