logo

చెక్‌డ్యాం కోతలు.. సాగు భూముల్లో ఇసుక మేటలు

పచ్చని పంటలతో ఉండాల్సిన నేలతల్లి వరుణుడి ప్రకోపంతో గుంతలమయంగా మారింది. భూసారం అంతా కొట్టుకుపోయి రాళ్లను, ఇసుక మేటలను మిగిల్చింది.

Published : 24 Mar 2023 04:14 IST

న్యూస్‌టుడే, కాల్వశ్రీరాంపూర్‌

పోచంపల్లి చెక్‌డ్యాం వద్ద కోతకు గురైన పంట పొలాలు

పచ్చని పంటలతో ఉండాల్సిన నేలతల్లి వరుణుడి ప్రకోపంతో గుంతలమయంగా మారింది. భూసారం అంతా కొట్టుకుపోయి రాళ్లను, ఇసుక మేటలను మిగిల్చింది. పంటలతో పాటు మట్టి కొట్టుకుపోయింది. భారీ వర్షాల ధాటికి చెక్‌డ్యాములతో పాటు కరకట్టలు కొట్టుకుపోయాయి. ఫలితంగా సారవంతమైన భూములు కోతకు గురవడంతో పాటు వరి పంటలకు నష్టం వాటిల్లగా ప్రభుత్వ సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు.

మీర్జంపేట రైతులకు అందని పరిహారం

కాల్వశ్రీరాంపూర్‌ మండలం మీర్జంపేట పరిధిలోని పోచంపల్లిలోని మానేరుపై రూ.11 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యాం ఏడాది తిరగకముందే తెగిపోయింది. అధిక వర్షాలు, వరద ధాటికి చెక్‌డ్యాం కట్ట తెగిపోవడంతో మానేరు తీరాన పంట మునిగింది. గుత్తేదారు చెక్‌డ్యాంను నాణ్యతగా నిర్మించకపోవడంతోనే సుమారు 50 ఎకరాల వ్యవసాయ భూముల్లో ఇసుక మేటలు వేసి, కోతకు గురి కావడంతో భూములు సాగుకు పనికి రాకుండాపోయాయని రైతులు చెబుతున్నారు. చెక్‌ డ్యాం తెగి పంటలు కొట్టుకుపోయి ఇప్పటికి మూడేళ్లు గడిచినా పరిహారం అందలేదని వాపోతున్నారు.  

ఏడాది గడవకముందే  కూలిన చెక్‌డ్యాంలు

హుస్సేన్మియవాగుపై సుమారు రూ.17 కోట్లతో మడిపల్లి, పెగడపల్లి, కాల్వశ్రీరాంపూర్‌లో రెండు, పెద్దరాతుపల్లి చెక్‌డ్యాంలు మంజూరయ్యాయి. ఇందులో పెగడపల్లి, కాల్వశ్రీరాంపూర్‌ చెక్‌డ్యాంలు పూర్తయ్యాయి. ఏడాది తిరగకముందే గత వానాకాలం వర్షాలకు కొట్టుకుపోయాయి. దీంతో పంట భూములు కోతకు గురై, ఇసుక మేటలు వేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన వారికి పరిహారం ఇప్పించాలని ప్రభుత్వానికి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తెగిపోయిన చెక్‌డ్యాంలు నాణ్యతగా నిర్మించాలని, చెక్‌డ్యాంలకు ఇరువైపులా కరకట్టలు పోయాలని రైతులు కోరుతున్నారు.


గుత్తేదారులతో తిరిగి నిర్మింపజేస్తాం
- నళినీకాంత్‌, నీటిపారుదల శాఖ ఏఈ

కాల్వశ్రీరాంపూర్‌ మండలం మానేరు, హుస్సేన్మియవాగుల పరిధిలో తెగిపోయిన చెక్‌డ్యాంలను తిరిగి నిర్మించే బాధ్యత గుత్తేదారులదే. ఎక్కడా పనులు పూర్తికాలేదు. వరద ఉద్ధృతితో చెక్‌డ్యాంలు కూలిపోయాయి. కూలిన నిర్మాణాల స్థానంలో కొత్తగా పనులు చేపట్టేలా, నష్టపోయిన రైతుల భూములు చదును చేసేలా గుత్తేదారులకు ఆదేశాలు జారీ చేశాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని