logo

హరితంపై ఎండ దెబ్బ

కరీంనగర్‌ నగర పాలక సంస్థ పరిధిలో హరితనగరంలో భాగంగా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ మొక్కలు నాటారు. వాటి సంరక్షణలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది.

Published : 29 May 2023 04:40 IST

సప్తగిరికాలనీ పాఠశాలలో ఎండిపోతున్న మొక్కలు

న్యూస్‌టుడే, సుభాష్‌నగర్‌ (కరీంనగర్‌): కరీంనగర్‌ నగర పాలక సంస్థ పరిధిలో హరితనగరంలో భాగంగా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ మొక్కలు నాటారు. వాటి సంరక్షణలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది. విభాగినుల మధ్య మాత్రం ప్రైవేటు ఏజెన్సీ చూసుకుంటుండగా, కూడళ్ల మధ్య, అంతర్గత వీధులు, రోడ్లకు ఇరువైపులా నాటిన వాటికి మాత్రం బల్దియానే పర్యవేక్షిస్తోంది.  ఇంకేముంది ప్రతి రోజు మొక్కలను పరిశీలించాల్సి ఉండగా వదిలేశారు.

వాడిపోతున్న మొక్కలు

నగరంలోని ప్రధాన రహదారులతోపాటు డివిజన్లలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో నాటిన మొక్కలకు ఎండదెబ్బ తగిలి వాడిపోతున్నాయి. భానుడి ప్రతాపంతో ఎండిపోతుండగా కనీసం దృష్టి సారించడం లేదు. ప్రతి రోజు ట్యాంకర్ల ద్వారా నీటిని పట్టాల్సి ఉంటుంది. ట్యాంకర్లు రాకపోవడం, వచ్చినా మండుటెండల్లో నీరు పోస్తున్నారు. డివైడర్ల మధ్య రోజు విడిచి రోజు పోస్తుండగా డివిజన్లలో రెండు, మూడు రోజులకు ఒకసారి పోస్తుండటంతో కొన్ని మొక్కలు చనిపోయే దశకు చేరాయి. ఎండల దృష్ట్యా కనీసం రోజుకు ఒకసారైనా నీటిని పట్టాల్సి ఉంటుంది. ట్యాంకర్లను దారి మళ్లిస్తుండటంతోనే సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది.

లోపించిన పర్యవేక్షణ

హరితహారం నిర్వహణ, మొక్కల సంరక్షణకు ఇద్దరు విశ్రాంత అటవీశాఖ అధికారులు ఉన్నారు. వీరు ప్రతిరోజు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. డివిజన్లలో చెట్లు ఎండుతున్నా పట్టింపు లేకుండా ఉంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. నర్సరీలు, కార్యాలయాలకు మాత్రమే పరిమితమవుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని