logo

పెద్దపల్లి-నిజామాబాద్‌ మార్గానికి మహర్దశ

పెద్దపల్లి-నిజామాబాద్‌ 177 కిలోమీటర్ల రైలు మార్గానికి మంచి రోజులు రానున్నాయి. ఈ మార్గంలో వేగ పరిమితిని గంటకు 110 కిలోమీటర్లకు పెంచడంతో అనేక కొత్త రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Updated : 12 Mar 2024 05:58 IST

వేగ పరిమితిని పెంచడంతో సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు నడిచే అవకాశం

పెద్దపల్లి రైల్వే స్టేషన్‌

న్యూస్‌టుడే, పెద్దపల్లి: పెద్దపల్లి-నిజామాబాద్‌ 177 కిలోమీటర్ల రైలు మార్గానికి మంచి రోజులు రానున్నాయి. ఈ మార్గంలో వేగ పరిమితిని గంటకు 110 కిలోమీటర్లకు పెంచడంతో అనేక కొత్త రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

గడిచిన పదేళ్లలో ఉమ్మడి జిల్లావాసులకు రైల్వేపరంగా చెప్పుకోదగ్గ ప్రయోజనం చేకూరలేదు. కరీంనగర్‌ నుంచి తిరుపతికి వారానికి రెండు సార్లు నడిచే తిరుపతి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మినహా కొత్తగా మరో రైలు రాలేదు. కాచిగూడ నుంచి కరీంనగర్‌ వరకు ప్రస్తుతం నడుపుతున్న ప్యాసింజర్‌ రైలు వల్ల ఉమ్మడి జిల్లా వాసులకు పెద్దగా ప్రయోజనం లేదు. రైల్వే ట్రాక్‌ సామర్థ్యానికి అనుగుణంగా వివిధ స్టేషన్‌ల మధ్య గతంలో ఉన్న వేగ పరిమితిని ఏకీకృతం చేయడంతో ఈ మార్గంలో కొత్తగా రైళ్లు  ప్రవేశపెట్టేందుకు అవకాశం ఏర్పడింది.

పలు జిల్లాలకు ప్రయోజనం

పెద్దపల్లి-నిజామాబాద్‌ మార్గంలో రైళ్ల వేగ పరిమితి గంటకు 110 కిలోమీటర్లకు పెంచడం ద్వారా సూపర్‌ఫాస్ట్‌లతో పాటు అమృత్‌భారత్‌ రైళ్లను నడిపించేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఆదిలాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్లే కృష్ణ ఎక్స్‌ప్రెస్‌ను నిజామాబాద్‌ నుంచి పెద్దపల్లి మీదుగా మళ్లించడం ద్వారా 41 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి తిరుపతికి వెళ్లేందుకు మరో రైలు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. ఆదిలాబాద్‌ నుంచి బయలుదేరే ప్రతి రైలు తిరిగి మన రాష్ట్రంలో ప్రవేశించేందుకు మహారాష్ట్రలో 300 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే కాజీపేట నుంచి పెద్దపల్లి, నిజామాబాద్‌ల మీదుగా ముంబాయికి వెళ్లే రెండు రైళ్లు కొవిడ్‌ అనంతరం రద్దయ్యాయి. వీటిని పునరుద్ధరించడంతో పాటు పెద్దపల్లి మీదుగా గుజరాత్‌, రాజస్థాన్‌ వైపు వెళ్లే పలు రైళ్లను ఇటువైపు మళ్లించే అవకాశముంది. హైదరాబాద్‌-దిల్లీ, హైదరాబాద్‌-పట్నా, జమ్ముతావి-చెన్నై మార్గంలో అమృత్‌భారత్‌ రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు రూపొందించింది. పెద్దపల్లి-నిజామాబాద్‌ మార్గంలోనూ నడిపితే ఆయా జిల్లాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది.

ఏ మార్గంలో ఎంత వేగం?

పెద్దపల్లి నుంచి కరీంనగర్‌ వరకు ప్రస్తుతం వేగపరిమితి గంటకు 100 కిలోమీటర్లుగా ఉంది. కరీంనగర్‌ నుంచి లింగంపేట, జగిత్యాల వరకు 75 కిలోమీటర్లు, జగిత్యాల నుంచి నిజామాబాద్‌ వరకు గరిష్ఠ వేగపరిమితి 90 కిలోమీటర్ల వరకుంది. తాజాగా ఈ మార్గంలో వేగ పరిమితిని రైల్వేశాఖ 110కి పెంచింది. అలాగే బల్హార్షా, కాజీపేట సెక్షన్ల మధ్య గంటలకు 120 నుంచి 130 కిలోమీటర్లకు పెంచారు.

పునరుద్ధరణకు నోచుకోని రెండు రైళ్లు

కరోనా కంటే ముందు కాజీపేట నుంచి ముంబాయికి దాదర్‌, ఆనంద్‌వన్‌ ఎక్స్‌ప్రెస్‌లను, పుణేకు మరో రైలును నడిపేవారు. వీటిలో దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌ పెద్దపల్లి, నిజామాబాద్‌ మీదుగా వెళ్తే మిగిలినవి బల్హార్షా మీదుగా నడిపించే వారు. అప్పటి చంద్రాపూర్‌ ఎంపీ హన్స్‌రాజ్‌ గంగారాం ఈ రైళ్లను నడిపేందుకు కృషి చేశారు. అప్పట్లో బల్హార్షాలో పిట్‌మెంట్‌(రైళ్ల ప్రాథమిక నిర్వహణ కేంద్రం) లేకపోవడంతో సదరు రైళ్లను కాజీపేట నుంచి నడిపించారు. కరోనా సమయంలో రద్దయిన ఈ రైళ్లలో రెండింటిని పునరుద్ధరించారు. వాటిలో ఆనంద్‌వన్‌ కాజీపేటకు బదులు ముంబాయి నుంచి బల్హార్షా వరకే నడుపుతున్నారు. ప్రస్తుతం కాజీపేట నుంచి నడుస్తున్న పుణే ఎక్స్‌ప్రెస్‌ను కూడా బల్హార్షా వరకే కుదించే అవకాశముంది. ఈ నెల 12న ప్రధాని చంద్రాపూర్‌లో బల్హార్షాలోని పిట్‌మెంట్‌ కేంద్రంతో పాటు పలు అమృత్‌భారత్‌ రైళ్లను ప్రారంభించే అవకాశముంది. ఇక దాదార్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఇప్పటికీ పునరుద్ధరించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని