logo

మొదటిరోజు ఆరు నామినేషన్లు

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్‌కుమార్‌, పోతూరి రాజేందర్‌లు

Published : 19 Apr 2024 04:56 IST

కరీంనగర్‌లో 2.. పెద్దపల్లిలో 4
నేడు దాఖలు చేయనున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు
ఈనాడు, కరీంనగర్‌, న్యూస్‌టుడే, రాంపూర్‌

భారాస అధినేత కేసీఆర్‌ నుంచి బీ ఫాం తీసుకుంటున్న కరీంనగర్‌ అభ్యర్థి వినోద్‌కుమార్‌, చిత్రంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, కేటీఆర్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ విజయ తదితరులు

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్‌కుమార్‌, పోతూరి రాజేందర్‌లు రిటర్నింగ్‌ అధికారి పమేలా సత్పతికి నామినేషన్‌ పత్రాలు అందించగా.. పెద్దపల్లి స్థానం నుంచి నలుగురు స్వతంత్రులు దూడ మహిపాల్‌, దుర్గం రాజ్‌కుమార్‌, నూకల నవీన్‌, అక్కపాక తిరుపతి రిటర్నింగ్‌ అధికారి ముజమ్మిల్‌ఖాన్‌కు నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. కలెక్టరేట్‌ల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మొదటి రోజు ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, భాజపా, భారాసల తరపున అభ్యర్థులెవరూ నామినేషన్‌ వేయలేదు. శుక్రవారం ఈ మూడు పార్టీల నుంచి కొందరు అభ్యర్థులు నామినేషన్‌ వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. భారాస అభ్యర్థులు బోయినపల్లి వినోద్‌కుమార్‌ (కరీంనగర్‌) కొప్పుల ఈశ్వర్‌ (పెద్దపల్లి) బాజిరెడ్డి గోవర్ధన్‌ (నిజామాబాద్‌)లు గురువారం హైదరాబాద్‌లో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ చేతుల మీదుగా బీ ఫాంలను అందుకున్నారు. ఆయా లోక్‌సభ నియోజకవర్గ పరిధి ముఖ్య నేతలతో కలిసి భారాస కార్యాలయానికి వెళ్లిన అభ్యర్థులు సమీక్షలో పాల్గొన్నారు. పార్టీ అధినేత చేసిన సూచనలు, సలహాల ఆధారంగా క్షేత్రస్థాయిలో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఆరు రోజుల సందడి..

ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల సందడి కనిపించనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ బల ప్రదర్శనకు ఈ ఘట్టాన్ని వేదికగా మలచుకోబోతున్నారు. మొదట నామమాత్రంగా ఒక సెట్‌ను వేసి మరో రోజు మాత్రం భారీ ర్యాలీతో నామినేషన్‌ దాఖలు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అభ్యర్థులు ఆయా పార్టీల ముఖ్య నేతల్ని ఈ కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో అభ్యర్థులు ముహూర్తాలు చూసుకుని మిగతా రోజుల్లో నామినేషన్లు దాఖలు చేసే అవకాశముంది. నామపత్రాల స్వీకరణ గడువు 25వ తేదీతో ముగియనుండటంతో ఆ మరుసటి రోజు నుంచి ఆయా లోక్‌సభ నియోజకవర్గ స్థానాల పరిధిలో భారీ సభలను నిర్వహించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. భాజపా, కాంగ్రెస్‌ అభ్యర్థులు జాతీయ స్థాయి నేతలను ఆహ్వానిస్తుండగా.. భారాస పార్టీ అధినేత కేసీఆర్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, ఎమ్మెల్యే హరీశ్‌రావులతో రోడ్‌షోలను నిర్వహించబోతోంది. కాంగ్రెస్‌ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా త్వరలోనే ఉమ్మడి జిల్లాలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరవనున్నారు. ముఖ్యనేతల ప్రచారం తీరుతో అసలైన ఎన్నికల కోలాహలం అన్ని అసెంబ్లీ సెగ్మెంట్‌లో మరింతగా కనపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని