logo

ఆగని అక్రమ తవ్వకాలు..

రాజకీయ నాయకుల అండదండలు.. అధికారుల నిర్లక్ష్యం వెరసి అక్రమ మట్టి తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

Updated : 29 Apr 2024 06:13 IST

యథేచ్ఛగా మట్టి తరలింపు
ప్రశ్నార్థకంగా పాండవుల గుట్ట ఉనికి
న్యూస్‌టుడే, కాల్వశ్రీరాంపూర్‌

కాల్వశ్రీరాంపూర్‌లోని పాండవుల గుట్టను తవ్విన దృశ్యం

రాజకీయ నాయకుల అండదండలు.. అధికారుల నిర్లక్ష్యం వెరసి అక్రమ మట్టి తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కాల్వశ్రీరాంపూర్‌ మండల కేంద్రంలోని పాండవుల గుట్ట అక్రమార్కులు తోడేస్తున్నారు. అడ్డుకునే వారే లేకపోవడంతో మట్టి దందా రాత్రి, పగలు తేడా లేకుండా నడుస్తుంది. రోజుకు రూ.లక్షల్లో అర్జిస్తూ ప్రభుత్వాదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ప్రజాప్రతినిధులు, యంత్రాంగం పోత్రాహంతో అక్రమ దందా సాఫీగా సాగుతోంది. గుట్టను గుల్ల చేస్తూ పచ్చదనానికి చోటు లేకుండా ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు.

ఆక్రమణలు కూడా..

కాల్వశ్రీరాంపూర్‌లో సర్వే నంబరు 597లోని ప్రభుత్వ స్థలంలో సుమారు 200 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పాండవుల గుట్ట విస్తరించి ఉంది. గుట్ట ప్రాంతంలోనే పోలీస్‌స్టేషన్‌, మార్కెట్‌ యార్డు, జూనియర్‌ కళాశాల, కేజీబీవీ, రెండు పడక గదుల నిర్మాణం, రైతువేదిక, పల్లెప్రకృతి వనం, విద్యుత్తు ఉపకేంద్రం, శ్రీ జగత్‌ మహామునీశ్వర స్వామి ఆలయానికి కొంత భూమిని కేటాయించారు. గతంలో ఇక్కడ పని చేసిన తహసీల్దార్లు ఎలాంటి అసైన్‌మెంట్‌ కమిటీ లేకుండా భూస్వాములకు, వ్యాపారులకు కొంత భూమిని పట్టా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పాండవుల గుట్ట ప్రాంతంలో అక్రమ పట్టాలతో కొందరూ, ఎలాంటి పట్టా లేకుండా ఇంకొందరూ కబ్జా చేసి సాగు చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

ఇవీ నిబంధనలు..

మట్టి తవ్వకాలు చేపట్టాలంటే మొదట గనుల శాఖకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలు సవ్యంగా ఉంటే ఎన్‌ఓసి(నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌) సంబంధిత తహసీల్దార్‌కు పంపుతారు. అనంతరం గనులశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు కలిసి ఒకేసారి నిర్ణీత మట్టి తవ్వకాల ప్రదేశాన్ని సర్వే చేయాలి. సదరు యజమాని సీఎఫ్‌ఈ, సీఎఫ్‌వో వంటి అనుమతులు తీసుకోవాలి. అనంతరం డెడ్‌రెంట్‌తో పాటు తవ్వే మట్టికి అదనంగా రాయల్టీ రూపంలో నిర్ణీత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండా మండల కేంద్రంలో మట్టి తవ్వకాలు ఆగడం లేదు.

ప్రభుత్వ ఆదాయానికి గండి..

మట్టి అక్రమ తవ్వకాలతో ప్రభుత్వం రూ.లక్షల్లో ఆదాయం కోల్పోతోంది. క్యూబిక్‌ మీటరుకు రూ.30 చొప్పున రాయల్టీ చెల్లించాలనే నిబంధన ఉంది. ఒక్కో ట్రాక్టరులో 2.85 క్యూబిక్‌ మీటర్ల మట్టి తరలిస్తుండగా.. ఈ లెక్కన ట్రాక్టర్‌కు 85.5 ఆదాయం ప్రభుత్వానికి రావాలి. లారీల్లో మట్టిని గృహాలు, వేడుక వేదికలు, వెంచర్లకు చేరవేస్తున్నారు. కానీ అక్రమార్కులు సర్కారు ఖజానాకు గండి కొడుతూ లాభం పొందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఉన్నతాధికారులకు నివేదిక అందించాం

పాండవుల గుట్టనుంచి అక్రమ మట్టి తరలింపు, భూకబ్జా తమ దృష్టికి వచ్చింది. ఈ విషయమై సంబంధిత ఆర్‌ఐకి మెమో జారీ చేశాం. పాండవుల గుట్టకు సంబంధించి 597 సర్వేనంబర్‌పై సర్వే చేయించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం.

జాహేద్‌ పాషా, తహసీల్దార్‌, కాల్వశ్రీరాంపూర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని