logo

నేను ఈవీఎం.. 13న కలుద్దాం

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సమయం సమీపిస్తుండటంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మరోవైపు పోలింగ్‌ శాతం పెంపునకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Published : 04 May 2024 04:55 IST

న్యూస్‌టుడే, మార్కండేయకాలనీ (గోదావరిఖని): సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సమయం సమీపిస్తుండటంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మరోవైపు పోలింగ్‌ శాతం పెంపునకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గోదావరిఖని నగరపాలక సంస్థ కార్యాలయ సమీపంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈవీఎం, వీవీప్యాట్‌ నమూనాలు ఆకట్టుకుంటున్నాయి. అటు వైపు వెళ్లేవారు వీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు.


నేటి తరానికి మీరే స్ఫూర్తి

న్యూస్‌టుడే, కరీంనగర్‌ కలెక్టరేట్‌: దివ్యాంగులు, ఎనభై అయిదేళ్లు దాటిన వృద్ధుల కోసం ప్రభుత్వం ఇంటి వద్ద ఓటేసే అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా శుక్రవారం కరీంనగర్‌ మంకమ్మతోటలోని వి.జగన్నాథం ఇంటికి పోలింగ్‌ సిబ్బంది వెళ్లి ప్రక్రియ పూర్తి చేశారు. వృద్ధుడు ఓటు వేస్తుండగా కలెక్టర్‌ పమేలా సత్పతి, ఎన్నికల సాధారణ పరిశీలకులు అమిత్‌ కటారియా, అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌దేశాయ్‌  ఆసక్తిగా తిలకిస్తున్న దృశ్యమిది.


వారం రోజులు.. ప్రచార వ్యూహాలు

న్యూస్‌టుడే, జగిత్యాల ధరూర్‌క్యాంపు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఈ నెల 13న జరగనుండగా 11వ తేదీ సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. సమయం తక్కువగా ఉండటంతో నేతలు, ప్రజాప్రతినిధులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

ఓవైపు ఆయా పార్టీల ముఖ్య నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, భారాస అధినేత కేసీఆర్‌ జిల్లాకు రాగా ప్రధాని మోదీ సహా ప్రధాన పార్టీల నేతలు త్వరలో పర్యటించనున్నారు. మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓవైపు విస్తృతంగా ప్రచారం చేస్తూనే మధ్యమధ్యలో పార్టీకి చెందిన ముఖ్యులతో సమావేశమవుతూ సభలు, సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. అభ్యర్థులతో పాటు వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఊరూరా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

  • ప్రచార అంకం చివరి దశలో ఓటర్లు, సంఘాలు, వర్గాలకు తాయిలాలు అందించే వీలుండటంతో సంబంధిత గంపగుత్త సమాచారం సేకరించి సిద్ధం చేశారు. తాయిలాలతో ఆకట్టుకోవటం, అవతలి వారి ప్రలోభాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయా పార్టీ శ్రేణులు దృష్టి సారించాయి.
  • సామాజిక మాధ్యమాల్లో తమకు అనుకూలంగా ఫొటోలు, వీడియోలతో కూడిన సందేశాలను విరివిగా పోస్టు చేస్తుండగా ఎదుటివారి లోపాలు, బలహీనతలను కూడా ఎత్తిచూపేలా ఉన్న వీడియోలను వైరల్‌ చేస్తున్నారు. వాయిస్‌ మెయిల్‌ ద్వారా ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తున్నారు.
  • తమ పార్టీ మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలను ఓటర్లకు వివరిస్తూనే తమను గెలిపించకుంటే జరిగే నష్టాలంటూ మరికొన్ని అంశాలను ఓటర్లకు వివరిస్తున్నారు. ఎవరికి ఓటేయాలో తెలిపేలా లాభనష్టాలను బేరీజు వేస్తున్నారు. కార్మికులు, మహిళా, యువజన, రైతు సంఘాలు, ఇతరత్రా గ్రూపులను ప్రసన్నం చేసుకోవడానికి నజరానాలు, మందు విందులతోనూ ఆకట్టుకునే యత్నాలు జోరందుకున్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని