logo

రెండు సభలతో కాంగ్రెస్‌ జోరు

కరీంనగర్‌, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఒకే రోజు రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించడం.. సీఎం రేవంత్‌రెడ్డి హాజరవడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.. నిర్ణీత సమయానికి దాదాపు మూడు నుంచి నాలుగు గంటలపాటు సభలు ఆలస్యమైనా ప్రజలు సీఎం ప్రసంగానికి ఉత్సాహంతో స్పందించారు.

Published : 04 May 2024 05:49 IST

ఉమ్మడి జిల్లాభివృద్ధికి తోడ్పాటునిస్తానని సీఎం హామీ

కరీంనగర్‌, పెద్దపల్లి (ఈనాడు), సిరిసిల్ల (ఈనాడు డిజిటల్‌), వెల్గటూర్‌, ధర్మారం (న్యూస్‌టుడే) : కరీంనగర్‌, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఒకే రోజు రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించడం.. సీఎం రేవంత్‌రెడ్డి హాజరవడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.. నిర్ణీత సమయానికి దాదాపు మూడు నుంచి నాలుగు గంటలపాటు సభలు ఆలస్యమైనా ప్రజలు సీఎం ప్రసంగానికి ఉత్సాహంతో స్పందించారు.. సాయంత్రం 3 గంటలకు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లికి సీఎం రావాల్సి ఉండగా సాయంత్రం 6.30 గంటలకు వేదికపైకి వచ్చారు. ఇక్కడి సభ పూర్తయిన తరువాత రోడ్డు మార్గం ద్వారా సిరిసిల్లలోని జనజాతర సభకు హాజరయ్యారు. అక్కడ సాయంత్రం 5 గంటలకు జరగాల్సిన సభ రాత్రి 9 గంటలకు ప్రారంభమైంది. రాత్రి లోపు రెండుచోట్ల సభలు పూర్తవుతాయనే ఉద్దేశంతో లైట్లు అమర్చలేదు. సీఎం పర్యటన ఆలస్యమవడంతో అప్పటికప్పుడు రెండు చోట్ల లైట్లు అమర్చారు. రేవంత్‌రెడ్డి వేదికపైకి వచ్చిన సమయంలో ప్రజలు, కార్యకర్తలు ఈలలు, కేరింతలతో అభిమానం చాటుకున్నారు. కరీంనగర్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు, పెద్దపల్లి అభ్యర్థి గడ్డం వంశీలను ఆశీర్వదించాలని సీఎం ఓటర్లను కోరారు. వీరిద్దరిని మంచి మెజారిటీతో గెలిపిస్తే అడిగిన అభివృద్ధి ఫలాలు అందిస్తానని హామీ ఇచ్చారు. తనకోసం నిరీక్షించిన ప్రజలకు రెండుచోట్ల సీఎం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ గడ్డ కాంగ్రెస్‌కు అడ్డా..

పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు, కరీంనగర్‌ పరిధిలో నాలుగు స్థానాలను కాంగ్రెస్‌కు అందించి ఈ గడ్డను కాంగ్రెస్‌కు అడ్డాగా మార్చారని సీఎం తన ప్రసంగంలో గుర్తు చేశారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. మంథని ప్రాంతం నుంచి పీవీ, శ్రీపాదరావులతోపాటు పెద్దపల్లి ప్రాంతంలో వెంకటస్వామి చేసిన సేవల్ని కొనియాడారు. ధర్మపురి లక్ష్మీనర్సింహాస్వామి పుణ్యక్షేత్రానికి ఎన్నికల తరువాత వస్తానని సీఎం చెప్పారు. భారాస అభ్యర్థులు కొప్పుల ఈశ్వర్‌, వినోద్‌కుమార్‌లు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. వినోద్‌కుమార్‌ అపర మేధావని.. బడి సంజయ్‌ అరగుండు మేధావని విమర్శించారు. కరీంనగర్‌లో అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావును గెలిపించాలని సీఎం కోరారు. అభ్యర్థికి లక్ష ఓట్ల ఆధిక్యత ఇస్తామని ప్రజలచేత సీఎం అనిపించారు. విప్‌లు  అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్యే వివేక్‌ స్థానిక సమస్యలను వివరించారు. పెద్దపల్లి అభ్యర్థి వంశీని రెండు లక్షల ఓట్లతో గెలిపించి తనవద్దకు తీసుకొస్తే మీరు కోరిన హామీలన్నింటిని నెరవేర్చి ఉమ్మడి జిల్లాకు కావాల్సిన నిధుల్ని అందిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సీఎంతోపాటు మంత్రి శ్రీధర్‌బాబు హెలికాప్టర్‌లో సబాస్థలికి వచ్చారు.

భారాస కార్పొరేటర్ల చేరిక

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పాలకవర్గంలోని 11 మంది భారాస కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, అర్బన్‌ బ్యాంకు మాజీ అధ్యక్షుడితోపాటు మాజీ డైరెక్టర్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శుక్రవారం రాత్రి సిరిసిల్లలో జరిగిన జనజాతర ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ వారికి పార్టీ కండువాలు కప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని