logo

శాసన సమరం.. దిల్లీలో గళం

ఉమ్మడి జిల్లా నుంచి కొందరు నేతలు ఇటు శాసనసభ, అటు లోక్‌సభ సభ్యులుగా ఎన్నికై ప్రత్యేకత చాటుకున్నారు. రాజకీయ అనుభవం, ప్రజాదరణతో రెండు స్థాయిల్లోని చట్టసభల్లో అడుగుపెట్టి గళం విప్పారు.

Published : 04 May 2024 05:09 IST

రెండు చట్టసభలకూ ఉమ్మడి జిల్లా నేతల ప్రాతినిధ్యం
న్యూస్‌టుడే, గోదావరిఖని

ఉమ్మడి జిల్లా నుంచి కొందరు నేతలు ఇటు శాసనసభ, అటు లోక్‌సభ సభ్యులుగా ఎన్నికై ప్రత్యేకత చాటుకున్నారు. రాజకీయ అనుభవం, ప్రజాదరణతో రెండు స్థాయిల్లోని చట్టసభల్లో అడుగుపెట్టి గళం విప్పారు. శాసనసభ్యులుగా ఉంటూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన వారు కొందరైతే ఎంపీగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు మరికొందరు. వారి నేపథ్యంపై కథనం.

బద్దం ఎల్లారెడ్డి

కమ్యూనిస్టు యోధుడు బద్దం ఎల్లారెడ్డి 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి పీడీఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1958లో బుగ్గారం అసెంబ్లీ సెగ్మెంట్‌ ఉప ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 1972లో ఇందుర్తి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.


‘కాకా’ వెంకటస్వామి

రాజకీయ కురువృద్ధుడు వెంకటస్వామి(కాకా) తొలిసారిగా 1954లో చెన్నూరు నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1967, 1971, 1977 ఎన్నికల్లో సిద్దిపేట లోక్‌సభ స్థానం నుంచి హ్యాట్రిక్‌ విజయాలు అందుకున్నారు. పెద్దపల్లి నుంచి 1989, 1991, 1996, 2004 ఎన్నికల్లో గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో పౌరసరఫరాల, కార్మిక శాఖ మంత్రిగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి, జౌళి, కార్మిక శాఖల మంత్రిగా పని చేశారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష ఉప నాయకుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.


ఎమ్మెస్సార్‌

ఎమ్మెస్సార్‌గా సుపరిచితులైన ఎం.సత్యనారాయణరావు ముందుగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1971, 1977, 1980లో కరీంనగర్‌ ఎంపీగా ఆయన హ్యాట్రిక్‌ విజయాలు అందుకున్నారు. 2004లో కరీంనగర్‌ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా, ఆర్టీసీ ఛైర్మన్‌గా సేవలందించారు.


పీవీ నరసింహారావు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తొలిసారి 1957లో మంథని నియోజకవర్గం నుంచి శాసనసభలోఅడుగుపెట్టిన ఆయన 1962, 1967, 1972 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాల్లో సేవలందించారు. 1971లో ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1977లో హన్మకొండ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1984, 1989లలో మహారాష్ట్రలోని రాంటెక్‌ నుంచి గెలుపొందారు. 1991లో ఆంధ్రప్రదేశ్‌లోని నంధ్యాల నుంచి ఎన్నికైన పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1996లో ఒడిశాలోని బరంపుర నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.


కేసీఆర్‌

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేటలో 1983 నుంచి వరుసగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెరాస ఏర్పాటు చేసిన తర్వాత  కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి 2004, 2006, 2008 ఎన్నికల్లో విజయం సాధించారు. 2009లో మహబూబ్‌నగర్‌, 2014లో మెదక్‌ ఎంపీగా గెలిచారు. 2014, 2018, 2023లలో గజ్వేల్‌ నుంచి శాసనసభలో అడుగుపెట్టారు.


విద్యాసాగర్‌రావు

భాజపా సీనియర్‌ నేత చెన్నమనేని విద్యాసాగర్‌రావు మెట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి 1985, 1989, 1994 ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయాలు సాధించారు. ఆ తర్వాత 1998, 1999లలో కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. కేంద్రంలోని వాజ్‌పేయీ ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రిగా వ్యవహరించారు.


పొన్నం ప్రభాకర్‌

ఎన్‌ఎస్‌యూఐ నుంచి ఒక్కో మెట్టు ఎదిగిన పొన్నం ప్రభాకర్‌ 2009లో కరీంనగర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో హుస్నాబాద్‌ శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.


ఎల్‌.రమణ

జగిత్యాలకు చెందిన ఎల్‌.రమణ కూడా రెండు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించారు. జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి 1994, 2009లలో విజయం సాధించిన ఆయన 1996లో కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి అనూహ్య విజయం సొంతం చేసుకున్నారు.


బాల్క సుమన్‌

తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించిన బాల్క సుమన్‌ 2014లో పెద్దపల్లి లోక్‌సభ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో చెన్నూరు శాసనసభ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు.


వివేక్‌ వెంకటస్వామి

‘కాకా’ కుమారుడు గడ్డం వివేక్‌ వెంకటస్వామి 2009లో పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంటులో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై గళం వినిపించారు. 2023 ఎన్నికల్లో చెన్నూరులో పోటీ చేసి శాసనసభలో అడుగుపెట్టారు.


జువ్వాడి చొక్కారావు

జువ్వాడి చొక్కారావు కరీంనగర్‌ శాసనసభ స్థానం నుంచి 1957, 1967, 1972 ఎన్నికల్లో ఎన్నికయ్యారు. జలగం వెంగళరావు మంత్రివర్గంలో పని చేశారు. కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి 1984, 1989, 1991 ఎన్నికల్లో లోక్‌సభలో అడుగు పెట్టారు. రెండు సభల్లోనూ హ్యాట్రిక్‌ విజయాలు సొంతం చేసుకున్నారు.


గొట్టె భూపతి

సీనియర్‌ నేత గొట్టె భూపతి రెండు చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించారు. నేరెళ్ల నుంచి 1967, 1972 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.  పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి 1983 ఉప ఎన్నిక, 1984 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు.


కోదాటి రాజమల్లు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోదాటి రాజమల్లు మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా 1962, 1967, 1972లలో విజయం సాధించారు. 1980లో పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్‌(ఐ) పార్టీ నుంచి గెలుపొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని