logo

అస్త్రం సంధించి.. ఆదర్శంగా నిలిచి..

ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత శక్తిమంతమైన ఓటు అస్త్రాన్ని సంధించడంలో పల్లెలు ముందు వరుసలో నిలుస్తున్నాయి.

Published : 06 May 2024 06:27 IST

ఓటు హక్కు వినియోగంలో గ్రామీణుల చైతన్యం
గత ఎన్నికల్లో పెద్దపల్లిలో ఓటింగ్‌ సరళి

మంథని నియోజకవర్గంలో ఎండలో బారులు తీరిన ఓటర్లు (పాతచిత్రం)

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత శక్తిమంతమైన ఓటు అస్త్రాన్ని సంధించడంలో పల్లెలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. ఓటుహక్కు వినియోగించుకోవడానికి విద్యావంతులైన పట్నం వాసులు బద్దకిస్తుంటే గ్రామీణ ప్రాంత ప్రజలు బారులు తీరుతున్నారు. బతుకుదెరువు కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన వారు కూడా బాధ్యతను మరచిపోకుండా సొంతూరి బాట పడుతున్నారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ సరళిని పరిశీలిస్తే పెద్దపల్లి నియోజకవర్గంలో గ్రామీణ ఓటర్లే ఆదర్శంగా నిలిచారు. గరిష్ఠంగా రామగుండం సెగ్మెంటులోని రాయదండిలో అత్యధికంగా 92.63 శాతం నమోదు కాగా పెద్దపల్లి పట్టణ సమీపంలోని బంధంపల్లిలో అత్యల్పంగా 2.47 శాతం పోలింగ్‌ నమోదైంది.

పల్లె జనం.. సంకల్ప బలం

రాయదండి పోలింగ్‌ కేంద్రంలో 188 మంది పురుషులు, 192 మంది మహిళలు కలిపి మొత్తం 380 మంది ఓటర్లుండగా 352 మంది ఓటేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెజ్జల్‌లో 91.19 శాతం, సోనాపూర్‌లో 90.95 శాతంతో రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. ఈ మూడు గ్రామాల్లో జనాభా తక్కువగా ఉన్నా ఐకమత్యం, ఓటు వేయాలనే సంకల్పం బలంగా ఉండటంతో అధిక పోలింగ్‌ శాతం నమోదైంది. చెన్నూర్‌లో 48.31 శాతం, మంచిర్యాల నియోజకవర్గంలోని నస్పూర్‌లో 29.64 శాతం, రామగుండంలోని శాంతినికేతన్‌ పోలింగ్‌ కేంద్రంలో 27.48 శాతం నమోదైంది. పట్టణ, నగర ప్రాంత ఓటర్లు నిర్లిప్తంగా వ్యవహరిస్తుండటం పోలింగ్‌ శాతం పడిపోవడానికి కారణమవుతోంది.

115 చోట్ల 80 శాతానికి పైగా..

అయిదేళ్ల కిందట పెద్దపల్లి లోక్‌సభ స్థానం పరిధిలో 14,78,062 మంది ఓటర్లుండగా 9,67,801 (65 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 4,83,726 మంది, మహిళలు 4,84,059 మంది, 16 మంది ఇతరులున్నారు. ఏడు సెగ్మెంట్ల పరిధిలోని 115 పోలింగ్‌ కేంద్రాల్లో 80 శాతం కంటే అధికంగా పోలింగ్‌ నమోదైంది. బెల్లంపల్లిలో 28 చోట్ల, చెన్నూర్‌లో 32, మంచిర్యాలలో 7, ధర్మపురిలో 8, రామగుండంలో 1, మంథనిలో 25, పెద్దపల్లిలో 14 పోలింగ్‌ కేంద్రాల్లో నమోదు ఉంది. రామగుండం, మంచిర్యాల నియోజకవర్గాల్లోని ఎక్కువ చోట్ల 70 శాతం కంటే తక్కువ పోలింగ్‌ నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని