logo

వ్యూహాలకు పదును!

లోక్‌సభ పోరు చివరి అంకానికి చేరుతోంది. ఓటరు తీర్పు వెల్లడించే సమయం ముంచుకొస్తుండటంతో అభ్యర్థులు ప్రచార వేగం పెంచుతున్నారు. ‘సమయం లేదు మిత్రమా’..అంటూ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు.

Published : 08 May 2024 05:18 IST

చివరి అస్త్రాలను సంధిస్తున్న అభ్యర్థులు
ప్రచారానికి మిగిలింది నాలుగు రోజులే

ఈనాడు, కరీంనగర్‌: లోక్‌సభ పోరు చివరి అంకానికి చేరుతోంది. ఓటరు తీర్పు వెల్లడించే సమయం ముంచుకొస్తుండటంతో అభ్యర్థులు ప్రచార వేగం పెంచుతున్నారు. ‘సమయం లేదు మిత్రమా’..అంటూ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. ఇన్నాళ్లు ఇంటింటి ప్రచారాలు, కరపత్రాల పంపిణీ, పోలింగ్‌ బూత్‌వారీగా సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాల పేరిట కొనసాగించిన ప్రచారాన్ని ఇంకాస్త ఉద్ధృతం చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు వారి తరపున వచ్చిన ముఖ్య నేతలు కూడా ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తున్నారు. అభివృద్ధి, హామీల విస్మరణలో పోటీదారుల వైఫల్యాలను ఎండగడుతున్నారు. మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ప్రచార పర్వాన్ని పదునెక్కిస్తున్నారు. ఓటర్ల మనసును గెలుచుకునేందుకు అవసరమైన చివరి అస్త్రాలను సంధిస్తున్నారు. ఏ వర్గాన్ని విస్మరించకుండా ప్రతి ఊరిలో.. వాడలోని ఓట్లు కీలకమని భావిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

చేరికలపై దృష్టి

కొన్నాళ్లుగా స్తబ్దుగా సాగిన ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. భారీ సభలు, ముఖ్యనేతల రాకతో ఒక్కసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్‌ తరఫున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, భారాస అభ్యర్థులకు మద్దతుగా భారాస అధినేత కేసీఆర్‌, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కేటీఆర్‌, భాజపా తరఫున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ సభలకు హాజరయ్యారు. ఓ వైపు ప్రచారాన్ని హోరెత్తిస్తూనే అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు చేరికల పర్వం గణనీయంగా పెరిగింది. ఏ చిన్న సమావేశం కార్యక్రమం ఉన్నా.. ఒక స్థాయి నాయకుడు, కార్యకర్తలను కండువా కప్పి పార్టీలోకి చేర్చుకునే సంప్రదాయాన్ని అన్ని పార్టీలు కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగానే కొందరు అభ్యర్థులు పట్టణాల్లో, గ్రామాల్లో ఓటర్లను ప్రభావితం చేయగలిగిన నాయకులను తమ వైపునకు తిప్పుకొంటున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల చేరికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడా వీరికి కొంత మొత్తాన్ని అందిస్తూ పార్టీలో చేర్చుకుంటున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక పార్టీ కార్యక్రమాల పరంగా ఖర్చు విషయంలోనూ ఎవరూ వెనకడుగు వేయడం లేదు. భారీగా జనం మద్దతు కనిపిస్తేనే ప్రచారంలో తమ జోరు ఉందనే సంకేతాలు ఓటర్లకు వెళ్తాయనే ఉద్దేశంతో జన సమీకరణపై దృష్టి పెడుతున్నారు.

తెరవెనుక చక్రం..

ఓటు బ్యాంకును పదిలపర్చుకునే విధంగా మూడు ప్రధాన పార్టీల తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు తెర వెనుక చక్రం తిప్పుతున్నారు. ప్రత్యర్థి పార్టీలకు దీటుగా వీలైనన్ని ఎక్కువ ఓట్లను కొల్లగొట్టే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఆయా సామాజిక వర్గాల ఓట్లకు గాలం వేయడంపై దృష్టి పెడుతున్నారు. గెలిచాక సాయం చేస్తామనే హామీలతో గంపగుత్తగా ఓట్లను పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాలు, వార్డుల్లో ప్రభావం చూపగల యువత సహా ఓ మోస్తరు నాయకుల్ని సంప్రదిస్తూ వారిని తమకు సహకరించమని కోరుతున్నారు. రోజూవారీగా అభ్యర్థులు ప్రచారం ముగిసిన తరువాత రాత్రి 10.30 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంటల వరకు ముఖ్యులతో సమీక్షల్ని ప్రతిరోజు నిర్వహిస్తూ చేయాల్సిన పనులపై దృష్టిసారిస్తున్నారు.

పంపిణీకి సిద్ధంగానే!

శాసనసభ ఎన్నికల తరహాలో కాకుండా ఒక స్థాయి నాయకుల ఖర్చులకైనా నగదును పంపిణీ చేసే పనిలో ప్రధాన పార్టీలున్నాయి. ముఖ్యంగా మండల, గ్రామ స్థాయిలో ప్రభావాన్ని చూపే నాయకులకు ఎంతో కొంత నగదును ముట్టజెప్పే ప్రయత్నాలు లోలోపల అనుసరిస్తున్నారు. మరోవైపు మద్యం పంపిణీకి తెర తీస్తున్నారు. గ్రామ స్థాయిలో విందులను అందించే విధంగా అవసరమైన ఏర్పాట్లలో నాయకులు నిమగ్నమవుతున్నారు. ఇక మహిళా ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనే ప్రయత్నాలు ఊళ్లల్లో జోరవుతున్నాయి. ఈ నెల 11వ తేదీ సాయంత్రం ప్రచారానికి తెరపడటంతో ఆ తరువాత రోజును సద్వినియోగం చేసుకునేలా పార్టీల నాయకులు ప్రత్యేకాసక్తిని చూపిస్తున్నారు. ప్రచారం జరగని ఆ ఒక్క రోజును ప్రలోభాలకు తెరతీసే విధంగా అసలైన మంత్రాంగాన్ని నడిపించనున్నారు. ఆయా పార్టీల మండల స్థాయి నాయకుల పాత్రలపైనే అన్ని పార్టీల అభ్యర్థులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. పోలింగ్‌ శాతాన్ని పెంచేలా చూడటంతోపాటు వీలైనన్ని ఎక్కువ ఓట్లు తమకు పడేలా చూడమని తగు ఆదేశాలిస్తున్నారు. కొత్త ఓటర్లతోపాటు యువత, మహిళ, రైతుల ఓట్లను సంపాదించేలా ఎవరికి వారుగా ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని