logo

యోగా దినోత్సవానికి సన్నద్ధం

ఈసారి యోగా దినోత్సవానికి మైసూరు నగరంలో ఓ విశిష్టత సంతరించుకోనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ యోగా ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు అంగీకరించారు. ఇటీవల స్థానిక లోక్‌సభ సభ్యుడు ప్రతాప్‌సింహ కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానిని కలుసుకుని

Published : 22 May 2022 01:55 IST

నరేంద్రమోదీని ఆహ్వానిస్తున్న మైసూరు లోక్‌సభ సభ్యుడు ప్రతాప్‌సింహ కుటుంబ సభ్యులు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి

మైసూరు, న్యూస్‌టుడే : ఈసారి యోగా దినోత్సవానికి మైసూరు నగరంలో ఓ విశిష్టత సంతరించుకోనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ యోగా ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు అంగీకరించారు. ఇటీవల స్థానిక లోక్‌సభ సభ్యుడు ప్రతాప్‌సింహ కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానిని కలుసుకుని ఈమేరకు ఆహ్వానించగా తప్పనిసరిగా వస్తానని ఆయన హామీ ఇచ్చారు. కేంద్ర ఆయుష్‌ కార్యాలయం నుంచి- ప్రధాని పర్యటనకు సంబంధించి రాష్ట్ర అధికారులకు ఆదేశాలు అందాయి. యోగాతో రాచనగరి మైసూరుకు విడదీయరాని అనుబంధముంది. మహారాజుల కాలం నుంచే ఈ కళకు రాజాశ్రయం లభించింది. యోగాలో నిష్ణాతులైన వారిలో అధిక శాతం మంది మైసూరుకు చెందినవారేనంటే ఈ కళకు రాచనగరిలో ఎంతటి ఆదరణ లభించేదో అర్థం చేసుకోవచ్ఛు మైసూరు యోగా పేరుతోనే అనేక కొత్త ఆసనాలున్నాయి కూడా. మైసూరు నగరంలో ఏకంగా నాలుగు వందలకు పైగా ఈ శిక్షణా కేంద్రాలున్నాయి. దసరా ఉత్సవాలకు మైసూరును సందర్శించే విదేశీ పర్యాటకులు యోగా శిక్షణా కేంద్రాల్లో చేరి ఏప్రిల్‌ వరకు శిక్షణను తీసుకుని తమ దేశాలకు తిరిగి వెళ్తుంటారు. ఇక్కడొక యోగా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని అనేక మంది డిమాండ్‌ చేస్తున్నారు. 2014 నుంచి యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తుండగా ఆ ఏడాదిలోనే గిన్నిస్‌ రికార్డు సృష్టించాలని చేసిన ప్రయత్నాలు చివరి నిముషంలో విఫలమయ్యాయి. ఈ ఏడాది జూన్‌ 21న నిర్వహించే వేడుకల్లో కనీసం రెండు లక్షల మందితో యోగాసనాల్ని చేసి రికార్డును నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నగర శివార్లలోని రేస్‌కోర్స్‌ మైదానంలో ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

గతంలో రేస్‌కోర్స్‌ మైదానంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో పాల్గొన్న ఔత్సాహికులు (పాతచిత్రం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని