logo

మలివిడత మెట్రో ఆలస్యమే

భారతీయుల సిలికాన్‌సిటీ.. బెంగళూరు నగర నాజూకు ప్రజా రవాణా వ్యవస్థ మలివిడత పనులు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఇక్కట్లు తొలగిపోలేదు.

Published : 03 Dec 2022 00:37 IST

బయ్యప్పనహళ్లి- వైట్‌ఫీల్డ్‌ మార్గంలో ప్రయోగాత్మకంగా మెట్రో పరుగు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : భారతీయుల సిలికాన్‌సిటీ.. బెంగళూరు నగర నాజూకు ప్రజా రవాణా వ్యవస్థ మలివిడత పనులు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఇక్కట్లు తొలగిపోలేదు. నగరంలోని శాస్త్ర- జీవ సాంకేతిక (ఐటీ, బీటీ) ఉద్యోగుల కార్యాలయాలు విస్తరించిన ఎలక్ట్రానిక్‌సిటీ, ఇతర ప్రాంతాలకు నమ్మ మెట్రోరైల్లో సంచరించేందుకు మరో నాలుగు నెలల పాటు ఎదురు చూడాల్సిందే. బయ్యప్పనహళ్లి- వైట్‌ఫీల్డ్‌ మధ్య 15.50 కిలోమీటర్ల మెట్రో రైలు సంచారం ముందుగా నిర్ణయించిన దానికన్నా మరో నెల జాప్యమవుతుందని బీఎంఆర్‌సీఎల్‌ అధికారులు అంగీకరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆ మార్గంలో నాజూకు వాహనాలు తిరిగేలా ముందుగా పథకాలను సిద్ధం చేశారు. అందుకు అనువుగానే ప్రయోగాత్మకంగా అక్టోబరు 21 నుంచి పట్టాలపై ప్రయోగాలు మొదలయ్యాయి. మెట్రో రైళ్లు తొలుత నిదానంగా.. ప్రస్తుతం వేగంగా పరుగులు తీస్తూ సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నాయి. ఈ పరిధిలో నిర్మిస్తున్న 13 ప్రయాణ ప్రాంగణాల నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. పలు చోట్ల అంతర్గత నిర్మాణాలు మొదలుపెట్టాలి. మార్చి రెండో వారంలోనే కొత్త రవాణా సేవలు మొదలవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వైట్‌ఫీల్డ్‌, ఐటీపీఎల్‌, హుడి తదితర ప్రాంతాల్లో ఐటీ, బీటీ సంస్థల కార్యాలయాలు ఎక్కువ. వాటిల్లో పని చేసే ఉద్యోగులు బయ్యప్పనహళ్లి వరకు మెట్రో రైల్లో వచ్చి అక్కడి నుంచి నేరుగా బీఎంటీసీ బస్సుల్లో తమ కార్యాలయాలకు వెళ్తున్నారు. నేరుగా మెట్రో రైలు వైట్‌ఫీల్డ్‌కు సంచరిస్తే ఐటీ, బీటీ ఉద్యోగులకు మరింత అనుకూలమవుతుంది. రహదారిపై వాహన సంచార రద్దీ (ట్రాఫిక్‌) నియంత్రణలోకి ఇదెంతో ఉపకరిస్తుందని పోలీసు అధికారులు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని