logo

మరచిపోలేని సుమధురవాణి

భావెంబ హూవు అరళి.. గానవెంబ గంధచల్లి..’ అనే పాటతో కన్నడ ప్రజల హృదయాలలో తన సంగీత సుమధుర భావ సుగంధాలను వెదజల్లిన ప్రముఖ నేపథ్య గాయని వాణీజయరాం గొంతు మూగబోయిందన్న చేదు వార్తను సంగీత ప్రియులు జీర్ణించుకోలేక పోతున్నారు.

Updated : 05 Feb 2023 06:58 IST

అపూర్వ గాయని..  వాణీ జయరాం

బెంగళూరు సాంస్కృతికం: ‘భావెంబ హూవు అరళి.. గానవెంబ గంధచల్లి..’ అనే పాటతో కన్నడ ప్రజల హృదయాలలో తన సంగీత సుమధుర భావ సుగంధాలను వెదజల్లిన ప్రముఖ నేపథ్య గాయని వాణీజయరాం గొంతు మూగబోయిందన్న చేదు వార్తను సంగీత ప్రియులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమె శనివారం చెన్నైలో కన్ను మూశారన్న సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, ఇతర ప్రముఖులు తీవ్ర సంతాపం ప్రకటించారు. కన్నడ సినీ నేపథ్యరంగంలో ప్రవేశించిన ఆమె ఐదుదశాబ్దాలు అభిమానులను అలరించారు. ఆమె పాటల జాబితా పుస్తకం తెరిస్తే.. అన్నీ హిట్‌ కొట్టినవే. కన్నడనాడుకు చేరువలోని వెల్లూరులో జన్మించిన ఆమె కర్నాటిక్‌, హిందుస్తానీ సంగీతాలను నేర్చుకున్నారు. సంగీతంలోని అన్ని ప్రక్రియలకూ సినీ స్పర్శనిచ్చి వాటి వైశిష్ట్యాన్ని ఉన్నతీకరించారు. 1973లో కన్నడ సినీ రంగంలో ప్రవేశించారు. ఇప్పటికే ఆరువందలకు పైగా పాటలు పాడారు. ‘కెసరిన కమల..’ ఈమె మొదటి పాట. ఇదేరాగదల్లి.. ఇదే తాళదల్లి.. (శ్రావణబంతు), కనసలూ నీనె.. మనసలూ నీనె( బయలుదారి), నిన్నెగింత ఇందుచెంద (అపూర్వ సంగమ), ఆడువ మురళి (ఆనందభైరవి), ఓ ప్రియతమా (కవిరత్న కాళిదాస) పాటలతో విఖ్యాతినొందారు. రణరంగ, ప్రేమలోక, యుగపురుష తదితర సినిమాల్లో పేరు తెచ్చుకున్నారు. ‘మళెనాడిన మూలెయాగి ఇత్తోందు సణ్ణ హళ్లి’ అనే జానపద స్పర్శగల పాట కన్నడ మహిళల నోట బాగా వినవస్తుంది. తిరువనంతపురంలో మూడుగంటలపాటు ధాటిగా సుదీర్ఘ సంగీత కచేరీ చేసినపుడు ఆమె వయసు కేవలం పది సంవత్సరాలు. గానంతోపాటు చిత్రరచనలోనూ ప్రతిభ అద్భుతం. అర్ధశాస్త్రంలో స్నాతకోత్తర విద్య పూరి చేసిన ఆమెకు లభించిన అవార్డులు, రివార్డులు, బిరుదులు అనేకానేకం. 1971లో సినీ అరంగేట్రం చేసిన వాణి.. కన్నడనాడుకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. అనేక ప్రైవేటు, భక్తి, జానపద, లలిత సంగీత పాటలు పాడారు. సీని వినీలాకాశం ఓ సంగీత సితార నేడు నేలకు ఒరిగిపోవటమే అభిమానులను వేదనకు గురిచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని