logo

మీనం సాగు.. రాబడి బహుబాగు

కొవిడ్‌ ప్రభావంతో నగర, పట్టణాల నుంచి సొంత గ్రామాలకు చేరుకున్న యువతీ, యువకులు చేపలు, కోళ్లు పెంపకం, పాడి ఉత్పత్తి, పండ్ల తోటల సాగుపై దృష్టి  సారించి అద్భుతాలు సాధిస్తున్నారు.

Updated : 07 Feb 2023 05:54 IST

ఉద్యోగం వదిలి సేద్యంవైపు అడుగులు
రాణిస్తున్న సాప్ట్‌వేర్‌ ఇంజినీరు

తండ్రి బుజ్జిరాజుతో కలిసి చేపలు పడుతున్న రఘురామరాజు

బళ్లారి, న్యూస్‌టుడే: కొవిడ్‌ ప్రభావంతో నగర, పట్టణాల నుంచి సొంత గ్రామాలకు చేరుకున్న యువతీ, యువకులు చేపలు, కోళ్లు పెంపకం, పాడి ఉత్పత్తి, పండ్ల తోటల సాగుపై దృష్టి  సారించి అద్భుతాలు సాధిస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కురుగోడు తాలూకా క్యాదిగాళు గ్రామానికి చెందిన బుజ్జిరాజు(సత్యనారాయణరాజు) కుమారుడు రఘురామరాజు డిప్లొమా, కోడలు బిందు మాధవి కూడా ఇంజినీరింగ్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేశారు. కొవిడ్‌ ప్రభావంతో సొంత గ్రామం క్యాదిగాళు చేరుకుని 35 ఎకరాల్లో చేపలు, రొయ్యలు సాగు చేస్తూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం తాలూకా రామాయణపురం గ్రామానికి చెందిన బుజ్జిరాజు బళ్లారి సమీపంలోని కప్పగల్లు గ్రామంలో స్థిరపడి పండ్ల తోటలు సాగు చేసేవారు. అనుకున్న స్థాయిలో దిగుబడి రాకపోవడంతో కురుగోడు తాలూకాలోని క్యాదిగాళు గ్రామం సమీపంలో వ్యవసాయానికి పనికిరాని చౌడు భూమిని కొనుగోలు చేసి చేపల పెంపకం ప్రారంభించారు. బుజ్జిరాజు ఒక్కరే పొలం వద్దే ఇంటిని నిర్మించుకుని మొదట 12 ఎకరాల్లో మత్స్యసాగు చేపట్టారు. కొవిడ్‌ ప్రభావంతో కుమారుడు రఘురామరాజు ఉద్యోగం వదిలి సొంత గ్రామానికి చేరుకున్నాడు. ఆయన భార్య బిందుమాధవి కూడా సొంత ఊరికి చేరుకున్నారు. రఘురామరాజు ఉద్యోగం వదిలి 12 ఎకరాల నుంచి 35 ఎకరాలకు విస్తరించి చేపల పెంపకం చేపట్టాడు. మిగిలిన చెరువులో రొయ్యలు సాగు చేస్తున్నాడు.

చేపలను చూపుతున్న రైతు బుజ్జిరాజు, మత్య్సుశాఖాధికారి శివప్ప

దిగుబడి ఘనం

ఉద్యోగం వదిలివచ్చిన రఘురామరాజు తండ్రికి పనిభారం తగ్గించాడు. మొత్తం సాగును అతనే చూసుకుంటున్నాడు. ప్రస్తుతం 12 ఎకరాల్లో రూపచంద్‌ అనే రకం చేపలు పెంచుతున్నాడు. ఎకరాకు 3 నుంచి 4 టన్నుల దిగుబడి సాధిస్తూ ఖర్చులుపోను ఎకరాకు రూ.లక్షకుపైగా ఆదాయం పొందుతున్నాడు. రొయ్యలను 23 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎకరాకు 2 నుంచి 4 టన్నుల వరకు ఉత్పత్తి సాధిస్తున్నారు. మూడు నుంచి నాలుగు నెలల్లోపు దిగుబడి వస్తుండటంతో ఏడాదికి రెండుసార్లు పెంచుతున్నారు. రొయ్యల సాగుకు ఎకరాపై రూ.3 లక్షల నుంచి రూ.4లక్షలు ఖర్చులుపోను ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.50లక్షల వరకు రాబడి పొందుతున్నాడు. 35 ఎకరాల్లో చేపలు, రొయ్యలు సాగు కూలీలు లేకుండా సొంతంగా చేసుకుంటున్నారు. పొలంలోనే ఇంటిని నిర్మించుకుని 24 గంటల పాటు సేద్యంపైనే దృష్టి సారించడంతో మంచి దిగుబడితో పాటు మార్కెట్‌పై మంచి అవగాహన పెంచుకుని లాభాలు గడిస్తున్నాడు.

చౌడు భూమిలో జలసంపద

2003లో వ్యవసాయానికి పనికి రాని చౌడు భూమిని తక్కువ ధరకు కొనుగోలు చేశాం. మత్య్సుశాఖాధికారి శివప్ప సహకరించడంతో ప్రభుత్వం నుంచి వివిధ పథకాలు కింద నిధులు విడుదల చేశారు. 25 ఎకరాల సొంత భూమి, సమీపంలోని మరో 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని రొయ్యలు, చేపలు సాగు చేస్తున్నాం. కూలీలపై ఆధారపడకుండా ఇంటివారే చేయడంతో ఖర్చులు తగ్గడంతో పాటు ప్రణాళికాబద్ధంగా చేయడంతో మంచి దిగుబడి సాధిస్తున్నాం. దాణా వేయడం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మందులు వాడకం, కృత్రిమంగా గాలిమరల నుంచి గాలిని అందించడం, రాత్రి పూట కాపలా ఉంటున్నాం. చేపలు, రొయ్యలను పట్టడానికి కూలీలను ఉపయోగిస్తున్నాం. పెట్టుబడి పోను ఏటా ఎకరాపై రూ.లక్ష వరకు ఆదాయం పొందుతున్నాం. ఉద్యోగంలో ఒత్తిడి ఉండేది. ఇంటి వద్ద ఉంటూ పనిచేయడం సంతోషంగా ఉంది.

రఘురామరాజు, యువ రైతు


పుచ్చకాయల పండుగ!

ఓ వీధులో పుచ్చకాయలు పేర్చుతున్న వ్యాపారి

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : మునుపెన్నడూ లేనంతగా ఈసారి పుచ్చకాయల పంట విరగకాసినట్లే! బెంగళూరు గ్రామీణ, చిక్కబళ్లాపుర, రామనగర, కోలారు, తుమకూరు జిల్లాల్లో పంట అప్పుడే కోతకు రావడంతో బెంగళూరు నగరానికి రైతులు సరకు తరలించడం ప్రారంభించారు. ఈసారి చీడ, పీడల సమస్య ఎదురుకాలేదని, మేలురకం సరకు అందుబాటులోకి వచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నా- ప్రస్తుత చలి వాతావరణంలో వ్యాపారం మాత్రం మందకొడిగా సాగుతోంది. బెంగళూరు కేఆర్‌ మార్కెట్‌, మల్లేశ్వరం, గాంధీబజార్‌ విపణులలో పుచ్చకాయల రాసులు దర్శనమిస్తున్నాయి. కిలో రూ.80 నుంచి రూ.100 వరకు గరిష్ఠ ధర పలుకుతోంది. పండ్ల రసాలను తయారు చేసే దుకాణాలలోనూ వీటికి ఒకింత డిమాండు క్రమంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. వేసవి తాపం పెరిగే కొద్దీ గిట్టుధరలు బాగా పెరగుతాయని వ్యాపారులు, రైతులు ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని