logo

త్వరలో మరిన్ని వందే భారత్‌ రైళ్లు

త్వరలో బెంగళూరు- ముంబయి, బెంగళూరు-హైదరాబాద్‌ మధ్య వందే భారత్‌ రైళ్లు వస్తాయని గృహ నిర్మాణ శాఖ మంత్రి వి.సోమణ్ణ వెల్లడించారు.

Published : 30 Mar 2023 01:33 IST

తన సాధనల పుస్తకాన్ని ప్రదర్శిస్తున్న సోమణ్ణ

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: త్వరలో బెంగళూరు- ముంబయి, బెంగళూరు-హైదరాబాద్‌ మధ్య వందే భారత్‌ రైళ్లు వస్తాయని గృహ నిర్మాణ శాఖ మంత్రి వి.సోమణ్ణ వెల్లడించారు. మైసూరు- బెంగళూరు- చెన్నై మధ్య ప్రవేశపెట్టిన వందే భారత్‌ రైలుకు చక్కని స్పందన లభించిందని చెప్పారు. విధానసౌధలో బుధవారం ఉదయం నిర్వహించిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముంబయి, హైదరాబాద్‌లకు రైలు సేవలను ప్రారంభించాలని రైల్వే మంత్రి, రైల్వే శాఖ కార్యదర్శికి తాము రాసిన లేఖకు సకారాత్మకంగా స్పందించారని తెలిపారు. ధర్మస్థలలో మినీ విమానాశ్రయం నిర్మాణానికి అనుబంధంగా పలు పనులను ఇప్పటికే ప్రభుత్వ ప్రారంభించిందని చెప్పారు. ధర్మస్థలకు ఎనిమిది కి.మీ.ల దూరంలో ఈ విమానాశ్రయం వస్తుందన్నారు. బిజాపుర, హాసనలలో విమానాశ్రయం పనులు చురుకుగా సాగుతున్నాయని తెలిపారు. గత నెల ప్రారంభించిన శివమొగ్గ విమానాశ్రయం నుంచి విమానాలను నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకు వచ్చిందన్నారు. వచ్చే రెండు నెలలలో తమ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించేందుకు చర్యలు తీసుకుందని తెలిపారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించిందన్నారు. బొమ్మై నాయకత్వంలోనే తాము ఎన్నికలను వెళ్తున్నామని చెప్పారు. భాజపాను తాను విడిచిపెట్టనని పునరుద్ఘాటించారు. తన నియోజకవర్గంలో ఇప్పటి వరకు చేసిన సేవలు, చేసిన అభివృద్ధి పనులే తనను మళ్లీ గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని