logo

వారంలో విపక్ష నేత ఎంపిక

వచ్చే వారం విధానసభ విపక్ష నాయకుడిని ఎంపిక చేసుకుంటామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ తెలిపారు.

Published : 18 May 2023 02:36 IST

నళిన్‌కుమార్‌ కటీల్‌ 

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : వచ్చే వారం విధానసభ విపక్ష నాయకుడిని ఎంపిక చేసుకుంటామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పటి వరకు తమ ముఖ్యమంత్రి ఎవరో ప్రకటించడం సాధ్యం కాలేదని, దానికి కూడా భాజపానే కారణమని విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయం జగన్నాథ భవన్‌లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. భాజపా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ఒక వారం పాటు సంచరిస్తూ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి ఎంపికకు సంబంధించి జరుగుతున్న వివాదాలు కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత విషయాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ 200 యూనిట్ల విద్యుత్తు బిల్లు ఉచితం అని చెప్పడంతో ప్రజలు తాము బిల్లు చెల్లించమంటూ ఎదురు తిరుగుతున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చే వరకు బిల్లు చెల్లించవద్దని సిద్ధరామయ్య కూడా పలుసార్లు బహిరంగ వేదికపైనే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

ఏ బాధ్యతలైనా ఓకే

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : కాంగ్రెస్‌ పార్టీ లింగాయత నాయకులకు ఏ బాధ్యతలు అప్పగిస్తుందో వేచి చూస్తామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పేర్కొన్నారు. భాజపా లింగాయతలను అవమానించిందంటూ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నేతలు చేసిన ఆరోపణలను గుర్తు చేశారు. బుధవారం ఇక్కడ తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడుతూ ఈసారి ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి అధికారాన్ని అప్పగించారని, త్వరగా ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకుని, అభివృద్ధి పనులకు పెద్ద పీట వేయాలని హితవు పలికారు. పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ఎంపిక కష్టం కావడం, ఆ పార్టీలో నేతల మధ్య అవగాహన లేదన్న విషయాన్ని సూచిస్తుందని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు