logo

Siddaramaiah - DK Shivakumar: శివరామయ్య రాజ్యం!

ఎన్నికల తరువాత.. కాంగ్రెస్‌లో అంతర్గత పొత్తులు కుదరడంతో కన్నడనాట సర్కారు ఏర్పాటుకు మార్గం సుగమమైన వేళ.. సగటు పౌరుడు చక్కని పాలన ఆశించడం సహజం.

Updated : 19 May 2023 09:55 IST

సంక్షేమ పథకాలకు పచ్చజెండా

ఇక.. సిద్ధరామయ్య, శివకుమార్‌ జోడెద్దుల సర్కారు

ఈనాడు, బెంగళూరు : ఎన్నికల తరువాత.. కాంగ్రెస్‌లో అంతర్గత పొత్తులు కుదరడంతో కన్నడనాట సర్కారు ఏర్పాటుకు మార్గం సుగమమైన వేళ.. సగటు పౌరుడు చక్కని పాలన ఆశించడం సహజం. పదవుల కోసం ఎత్తులు.. పైఎత్తులతో కాలహరణమైందన్న మాటేగానీ చివరికి నేతలంతా స్నేహగీతం పాడిన వేళ కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం అందివస్తోంది. నిన్నటిదాకా కీలక పదవి కోసం ఎడమొహం..పెడమొహంగా కనిపించి సిద్ధు- డీకే ఇకపై కలసికట్టుగా జోడెద్దుల పాలనా బండిని పరుగులు పెట్టించడం తక్షణ కర్తవ్యమే.

* ఎంత కాదన్నా కన్నడనాట సంక్షేమ పథకాలకు బ్రహ్మరథం పట్టించింది 2013-18 కాలం నాటి ప్రభుత్వమే. అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేదల పాలిట ఓ ఆశాకిరణంగా, అహింద (బడుగువర్గాల) సముదాయానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. భాగ్య పథకాలతో బీపీఎల్‌ కుటుంబాలకు భరోసా అందించిన అదే కాంగ్రెస్‌ సర్కారు సరికొత్త హంగులతో మళ్లీ పాలన పగ్గాలు అందుకుంది. 2018 తర్వాత 13 నెలల సంకీర్ణ ప్రభుత్వం, ఆపై వచ్చిన భాజపా పాలనకు భిన్నమైనదేదో ఆశించిన ఓటర్లు.. ఈసారి ఎన్నికల్లో తమ అభిమతం ఏమిటో గట్టిగానే వ్యక్తం చేశారు. కనీవినీ ఎరుగని స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించిన రాష్ట్ర ప్రజలు కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. అప్పటి భాగ్య పథకాల సృష్టికర్త సిద్ధరామయ్య మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోగా, శక్తిమంతమైన నాయక దిగ్గజం డీకే శివకుమార్‌ ఉపనాయకుడిగా పాలన పగ్గాలు అందుకున్నారు. వీరిద్దరి కలయికలో రాష్ట్రం సంక్షేమ రాజ్యం కాగలదని ప్రజలు భావిస్తున్నారు.

సామాన్యుడికి ఊరట

అన్నభాగ్య, క్షీరభాగ్య, షూ భాగ్య, ఇందిరా క్యాంటిన్‌, సైకిల్‌ భాగ్య, షాదీ భాగ్య, అనిల భాగ్య.. ఇలా చెబుతూ పోతే ఐదేళ్ల పాటు సిద్ధరామయ్య ప్రభుత్వం భాగ్య పథకాలతో రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా మార్చింది. ఒకే పార్టీకి మళ్లీ మళ్లీ అవకాశం ఇచ్చే సంప్రదాయం రాష్ట్రంలో లేకపోవటంతో కాంగ్రెస్‌ ఓడింది కానీ.. లేదంటే సిద్ధరామయ్య సర్కారు అందించిన పథకాలు రాష్ట్ర చరిత్రలో అనితర సాధ్యం. గడచిన ఐదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో బెంబేలెత్తిన కన్నడిగులు వాటి నుంచి ఉపశమనం కోసం కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. సరిగ్గా మధ్యతరగతి ప్రజల నిత్య జీవన సమస్యలపై ఎక్కుపెట్టి ప్రచారం చేసిన కాంగ్రెస్‌ ఆ దిశగా సంపూర్ణ విజయం సాధించినట్లే. ఇక చేయాల్సిందల్లా..2013నాటి సంక్షేమ పథకాలకు 2.0 పథకాలుగా భావించే ఐదు గ్యారెంటీ పథకాలు సక్రమంగా ప్రజలకు అందించటం.

తలపండిన దండు

భాజపా, జేడీఎస్‌లతో పోలిస్తే కాంగ్రెస్‌ పార్టీకి ప్రభుత్వాన్ని నడపటం అత్యంత సులువైన ప్రక్రియ. ప్రస్తుతం పార్టీలో తలపండిన నేతలు అడుగడుగునా కనిపిస్తారు. మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఉపముఖ్యమంత్రులుగా అంతులేని పాలన అనుభవాన్ని గడించిన ఆర్‌.వి.దేశ్‌పాండే, హెచ్‌.కె.పాటిల్‌, రామలింగారెడ్డి, డాక్టర్‌ జి.పరమేశ్వర్‌, కృష్ణభైరేగౌడ, ఎం.బి.పాటిల్‌, కేజే జార్జ్‌, సతీశ్‌ జార్ఖిహొళి, కేంద్రం నుంచి రాష్ట్ర రాజకీయాల వైపు దృష్టి సారించిన కేహెచ్‌.మునియప్ప వంటి సీనియర్లు, యువ నాయకత్వం తొణికిసలాడే ప్రియాంక్‌ ఖర్గే, అజయ్‌ ధరమ్‌సింగ్‌, యు.టి.ఖాదర్‌, లక్ష్మీ హెబ్బాళ్కర్‌లతో కాంగ్రెస్‌ పాలన రథం సజావుగా సాగగలదు. చేయాల్సిందల్లా వీరికి ఎలాంటి అడ్డంకులు లేకుండా మంత్రివర్గంలో చోటు కల్పించటమే. అసలే సముదాయాల వారీగా భారీగా ఓట్లు దండుకున్న కాంగ్రెస్‌కు సామాజిక న్యాయం ఓ పెద్ద సవాలుగా మారింది. రెండో శ్రేణి నేతలతో పాటు కొత్త సభ్యుల రాకతో సభ కళకళలాడుతోంది. వీరి సేవలు సక్రమంగా వినియోగించుకుంటే సిద్ధరామయ్య, శివకుమార్‌ల నాయకత్వానికి అడ్డులేనట్లే.

భాయి భాయి.. రాహుల్‌తో సిద్ధు, డీకే (పాతచిత్రం)

సిద్ధుకు అవకాశం

గట్టి పోటీ నడుమ సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేయటం వెనుక అధిష్ఠానం ఆశయం కూడా అదే. ఇప్పటికే సంక్షేమ, సుస్థిర పాలనానుభవం ఉన్న సిద్ధరామయ్య..రానున్న రెండేళ్లలో ప్రకటించిన 5గ్యారెంటీ పథకాలను మరింత నిబద్ధతతో అమలు చేస్తారని అధిష్ఠానంతో పాటు ప్రజలు కూడా ఆశతో ఎదురుచూస్తున్నారు. సిద్ధరామయ్యతో ఓ పెద్ద యుద్ధమే చేసిన డీకే శివకుమార్‌ ఉన్నపళంగా మెట్టు దిగేందుకు కూడా ఈ హామీ పథకాలే కారణం. ఆధిపత్యం కంటే ప్రజలకు ఇచ్చిన మాటే ముఖ్యమని భావించిన డీకే శివకుమార్‌ సహకారం అందించే సిద్ధరామయ్య పాలన నల్లేరుపై నడకే.

తీపి కబురే : సీఎల్పీ నేతగా ఎన్నికైన సిద్ధరామయ్యకు రాజ్‌భవన్‌లో మిఠాయి తినిపించి అభినందనలు చెబుతున్న గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌

అంతా మన మంచికే..

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : జరిగేదంతా మన మంచికే.. ముందు కూడా మంచే జరుగుతుందని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి స్థానాలకు అధికారికంగా పేర్లను ఏఐసీసీ గురువారం ప్రకటించిన తరువాత ఆయన దిల్లీలో కాసేపు విలేకర్లతో మాట్లాడారు. తెల్లవారు జాము ఒంటి గంటకు అధికారికంగా గవర్నరుకు లేఖ రాశానని, శనివారం 12.30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అవకాశం ఇవ్వాలని విన్నవించుకున్నట్లు తెలిపారు. ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం కట్టపెట్టారని, వారి రుణం తీర్చుకోవాలని, శాసనసభ పక్షం సమావేశంలో అధిష్ఠానం తీర్మానానికి కట్టుబడే ఉంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని