logo

ఊరూవాడ.. గ్యారెంటీ గోల

‘ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచే కర్ణాటకలో ఎవరూ విద్యుత్తు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. నేను కూడా కట్టాల్సిన అవసరం లేదు.

Published : 26 May 2023 03:42 IST

విద్యుత్తు బిల్లులు చెల్లించేదిలేదని మొండికేస్తున్న గ్రామీణులు
 బస్సుల్లో టికెట్‌ తీసుకోకుండా మహిళల వాదనలు

ఈనాడు, బెంగళూరు : ‘ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచే కర్ణాటకలో ఎవరూ విద్యుత్తు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. నేను కూడా కట్టాల్సిన అవసరం లేదు. మాజీ మంత్రి గారూ మీరు కూడా కట్టక్కరలేదు. మహిళలు రాష్ట్రమంతా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. సొంత ఊరికే వెళ్తారో? ధర్మస్థలకు వెళ్తారో మీ ఇష్టం..’
* మార్చి 6న ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన ఈ ప్రకటన రాష్ట్ర ప్రజలు బాగానే గుర్తుకు పెట్టుకున్నట్లున్నారు. ఈనెల 13న ఎన్నికల ఫలితాలు వెల్లడై.. కాంగ్రెస్‌ పార్టీ గెలిచిందని తెలిసిన రోజు నుంచే రాష్ట్రంలోని గ్రామాల్లో విద్యుత్తు బిల్లులు చెల్లించం, బస్సుల్లో టికెట్‌ తీసుకోమని మహిళలు తెగేసి చెబుతూ సిద్ధరామయ్య సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

సిబ్బందికి చెప్పుదెబ్బలు

బుధవారం కొప్పళ్లలోని ఓ గ్రామంలో విద్యుత్తు బిల్లు చెల్లించాలని చెప్పిన విద్యుత్తు శాఖ ఉద్యోగితో గొడవకు దిగిన ఓ వ్యక్తి ఆ ఉద్యోగిపై చేయి చేసుకుని, చెప్పు దెబ్బలు కొట్టి నానా గొడవ చేశారు. ఈ వీడియో వైరల్‌ అవటంతో పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

మీటర్‌పై నోటీసులు

మస్కిలో బస్సు టికెట్‌ తీసుకోనని కండక్టర్‌తో గొడవకు దిగిన వృద్ధురాలు

మా జిల్లాలో ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను గెలిపించాం. మా ఎమ్మెల్యే చెప్పినట్లే మేమిక 200 యూనిట్ల వరకు విద్యుత్తు బిల్లు చెల్లించం. దయచేసి మా ఇంటికి ఎవరూ రావద్దంటూ చిత్రదుర్గలోని గ్రామస్థులు కొందరు తమ ఇంటి మీటర్‌ వద్ద నోటీసులు అంటించారు.

బస్సు ఎమ్మెల్యే ఇంటికే..

మస్కి నుంచి సింధనూరుకు వెళ్తున్న కేఎస్‌ఆర్‌టీసీ బస్సులో కూర్చున్న ఓ వృద్ధురాలు ‘ఇకపై బస్సు టికెట్‌ తీసుకోవద్దని మా ఎమ్మెల్యే బసవనగౌడ తురివిహాళ్‌ చెప్పారు. నేను టికెట్‌ తీసుకోను. అవసరమైతే మా ఎమ్మెల్యే ఇంటికి బస్సు పోనివ్వు నేనే మాట్లాడతా’నంటూ కండక్టర్‌తో గొడవకు దిగడం గురువారం వైరల్‌గా మారింది.

సిబ్బందితో గొడవకు దిగిన గ్రామస్థులు

నేనే చాటింపు వేస్తా

ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే విద్యుత్తు బిల్లు చెల్లించొద్దని సిద్ధరామయ్యే స్వయంగా చెప్పారు. మేము బిల్లు కట్టకుంటే ప్రభుత్వమే చూసుకుంటుంది. నీకెందుకు. బిల్లు చెల్లించొద్దని నేనే చాటింపు వేస్తానని కలబురగి జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీ సభ్యుడు విద్యుత్తు సిబ్బందితో తెగేసి చెప్పడం పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతోంది.
* ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై 5రోజులు గడచినా ఇంత వరకు ప్రకటించిన 5గ్యారెంటీ పథకాలపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవటంతో అసహనం పెరిగిపోతోంది. ఈ గ్యారెంటీ పథకాల కోసమే మేము కాంగ్రెస్‌ను గెలిపించామంటూ విద్యుత్తు సంస్థల సిబ్బంది, కేఎస్‌ఆర్‌టీసీ సిబ్బందితో నిత్యం గొడవలకు దిగుతున్నారు. మాకు అలాంటి ఉత్తర్వులు ఏవీ రాలేదు. అంత వరకు బిల్లులు చెల్లించాల్సిందేని ప్రాధేయపడుతున్నా గ్రామస్తులు ససేమిరా అంటున్నారు. నిబంధనలు, అర్హులని కాంగ్రెస్‌ ప్రకటించలేదు. అందరికీ ఉచిత విద్యుత్తు,మహిళలందరికీ ఉచిత ప్రయాణమనే ప్రకటించారని సిద్ధరామయ్య చేసిన ప్రకటనను చదివి వినిపిస్తున్నారు.


బిల్లులు చెల్లించొద్దు: జేడీఎస్‌

కొప్పళలో జెస్కాం సిబ్బందిపై గ్రామస్థుడి దాడి

ఎన్నికల ప్రచారంలో ముందూ వెనకా లేకుండా హామీలిచ్చిన కాంగ్రెస్‌ నేడు మాట మారుస్తోందని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు. పట్టభద్రులందరికీ నిరుద్యోగ భృతి, అన్ని బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పిన కాంగ్రెస్‌.. అధికారంలోనికి వచ్చాక నిబంధనలంటోంది. ప్రతి జిల్లాలో మా కార్యకర్తలతో సహాయవాణిని ఏర్పాటు చేస్తాం. ఈ పథకాలు అమలు చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.


ప్రభుత్వం ఏం చెబుతోంది?

ఈనెల 20న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సిద్ధరామయ్య వెంటనే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఐదు గ్యారెంటీలపై తీర్మానం చేసి తాత్కాలికంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకాల అమలు కోసం లబ్ధిదారుల వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశించాం. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ పథకాలకు సంబంధించిన విధి విధానాలను వెల్లడిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. బిడ్డ పుట్టిన వెంటనే పరిగెత్తాలంటే ఎలా? చట్టాలన్నాక వాటికంటూ కొన్ని నిబంధనలు ఉంటాయి. కేవలం విపక్షాలే ప్రజలను రెచ్చగొడుతున్నట్లు మంత్రి ప్రియాంక్‌ ఖర్గే వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని