logo

గిరిజనుల విద్యాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబాటుకు గురైన గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, గిరిజనుల విద్యాభివృద్ధి, వికాసమే

Published : 25 May 2022 01:44 IST

మంత్రి సత్యవతి

రఘునాథపాలెంలో స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ గురుకుల పాఠశాల, కళాశాల భవన నిర్మాణానికి

శంకుస్థాపన చేస్తున్న మంత్రులు సత్యవతి, అజయ్‌కుమార్‌, ఎంపీ నామా, కలెక్టర్‌, పీవో తదితరులు

రఘునాథపాలెం, న్యూస్‌టుడే: గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబాటుకు గురైన గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, గిరిజనుల విద్యాభివృద్ధి, వికాసమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మండల కేంద్రం రఘునాథపాలెంలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల భవన నిర్మాణానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు, జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజులతో కలిసి మంగళవారం మంత్రి సత్యవతి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి అజయ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన సభలో ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలోనే స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ పాఠశాలలు కేవలం రెండు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రయివేటు కార్పొరేటు పాఠశాలలకు ధీటుగా వీటిలో చదివిన విద్యార్థులు ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు సాధిస్తున్నారన్నారు. వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌లోనూ సీట్లు పొందేలా విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. ఇందుకోసం 6ఎకరాల విస్తీర్ణంలో రూ.20కోట్లతో పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. ప్రధాన రహదారి చెంత విలువైన స్థలాన్ని పాఠశాల భవన నిర్మాణానికి కేటాయించేందుకు కృషి చేసిన మంత్రి అజయ్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. నేడు జిల్లా కేంద్రంలో రూ.1.10కోట్లతో చేపట్టిన గిరిజన భవనం ప్రారంభించుకున్నామని, రఘునాథపాలెంలో రూ.20కోట్లతో పాఠశాల, రేలకాయలపల్లిలో రూ.21.01కోట్లతో ఏకలవ్య పాఠశాల మొత్తంగా రూ.42కోట్లతో గిరిజన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గతంలో రాష్ట్రంలో 273 గురుకులాలు ఉండేవని, ప్రస్తుతం కేజీ టూ పీజీ నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం వీటి సంఖ్యను 976కు పెంచిందన్నారు. ఒక్కొక్క విద్యార్థిపై ఏడాదికి రూ.1.2లక్షలు వెచ్చిస్తున్నామన్నారు. విదేశీ విద్య కోసం అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ ద్వారా రూ.20లక్షలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో చిన్నచిన్న గిరిజన తండాలను పంచాయతీలుగా చేశామని, పంచాయతీల అభివృద్ధికి రూ.600కోట్లు కేటాయించామన్నారు. రఘునాథపాలెం మండలంలోని 19 గిరిజన గ్రామ పంచాయతీలతోపాటు, జిల్లాలోని అన్ని గిరిజన పంచాయతీల భవనాల నిర్మాణానికి రూ.25లక్షల చొప్పున కేటాయిస్తామని మంత్రి సత్యవతి హామీ ఇచ్చారు.

* అంతకుముందు మంత్రి అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ వెనుకబాటుకు గురైన గిరిజనులు చదువుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుందని విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల కూడా ఇచ్చారని, త్వరలోనే ఇది ప్రారంభమవుతుందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో కాలిపోయిన మోటార్లు, విత్తనాల కోసం పడిగాపులు పడే అవస్థలు ఇప్పుడు తొలగిపోయాయన్నారు. తెలంగాణ నేడు ద్విగుణీకృతంగా వెలుగుతోందన్నారు. దావోస్‌లో యువనేత కేటీఆర్‌ పర్యటన తొలిరోజే రూ.వెయ్యి కోట్ల ప్రాజెక్టులు పెట్టుబడులు రావడమే ఇందుకు ఉదాహరణ అన్నారు. కార్యక్రమంలో ఎంపీ నామా, జడ్పీ ఛైర్మన్‌ కమల్‌రాజు, కలెక్టరు గౌతమ్‌, ఐటీడీఏ పీవో గౌతమ్‌ పోట్రు ప్రసంగించారు. డీసీసీబీ ఛైర్మన్‌ కూరాకుల నాగభూషయ్య, సుడా ఛైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, ఏఎంసీ చైర్మన్‌ లక్ష్మీప్రసన్న, మేయర్‌ పునుకొల్లు నీరజ, ఉప మేయర్‌ ఫాతిమాజోహ్రా, ఆర్జేసీ కృష్ణ, జడ్పీటీసీ సభ్యురాలు మాలోతు ప్రియాంక, సర్పంచి గుడిపూడి రామారావు, ఎంపీటీసీ సభ్యురాలు మద్దినేని రజని, ఆర్డీవో రవీంద్రనాథ్‌, తహసీల్దారు నరసింహారావు, ఎంపీడీవో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


గిరిజన భవన్‌ను ప్రారంభించిన మంత్రులు

ఖమ్మం సంక్షేమవిభాగం, న్యూస్‌టుడే: ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ క్యాంపులో రూ.1.10 కోట్లతో నిర్మించిన గిరిజన భవన్‌ను మంత్రులు సత్యవతి రాథోడ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి గిరివికాస పథకంలో జిల్లా వ్యాప్తంగా 243 మంది గిరిజనులకు మంజూరైన బోర్‌వెల్స్‌, ట్యూబ్‌వెల్స్‌ను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, ఐటీడీఏ పీవో గౌతమ్‌ పొట్రు, నగర మేయర్‌ పి.నీరజ, డీసీసీబీ ఛైర్మన్‌ కూరాకుల నాగభూషయ్య, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని