logo

Kids Lunch Box: మీ పిల్లల లంచ్‌ బాక్స్‌లో ఏముంది!

‘తల్లిదండ్రులకు విజ్ఞప్తి! మీ చిన్నారులకు రోజూ పంపించే అల్పాహారంలో బిస్కెట్లు, తీపి కేకులు, జంక్‌ఫుడ్‌, ఇన్‌స్టంట్‌ ఫుడ్‌, నూనె పదార్థాలతో కూడిన ఆహార పదార్థాలు పంపకండి.

Updated : 07 Aug 2023 09:42 IST

  • ‘తల్లిదండ్రులకు విజ్ఞప్తి! మీ చిన్నారులకు రోజూ పంపించే అల్పాహారంలో బిస్కెట్లు, తీపి కేకులు, జంక్‌ఫుడ్‌, ఇన్‌స్టంట్‌ ఫుడ్‌, నూనె పదార్థాలతో కూడిన ఆహార పదార్థాలు పంపకండి. తాజా పండ్లు, తేలిగ్గా జీర్ణమయ్యే తాజా ఆహార పదార్థాలను పంపించండి.’
  • సుమారు 2500 మందికి పైగా విద్యార్థులున్న ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రుల వాట్సాప్‌ గ్రూప్‌లకు పంపిన సందేశమిది.
  • ‘ ప్రైవేటు స్కూల్‌లో చదువుకునే మా మనుమరాలు (8) కొద్ది నెలలుగా అన్నం సరిగా తినడం లేదు. చాక్లెట్లు, బయట లభించే చిప్స్‌, కూల్‌ డ్రింక్స్‌, కేక్‌లు అంటేనే ఆసక్తి కనబర్చుతోంది. ఇప్పుడామె వయసుకు తగిన బరువు లేకపోగా, చూపు మందగించి కళ్లజోడు పెట్టుకోవాల్సి వస్తోంది.’
  • పొరుగింటి మహిళతో ఖమ్మంకు చెందిన బాలిక అమ్మమ్మ అన్న మాటలివి.

కొత్తగూడెం విద్యావిభాగం, ఖమ్మం వైద్య విభాగం, న్యూస్‌టుడే

ఒత్తిళ్లతో కూడిన విద్య, సరైన ఆహార నియమాలు పాటించకపోవడంతో నేటి బాల్యం అనారోగ్య సమస్యలతో సతమతం అవుతోంది. దాదాపు నాలుగోవంతు మంది పోషకాహార లోపం సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారేనని సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. ముఖ్యంగా బలవర్ధక, పీచు పదార్థాలతో కూడిన ఆహారం, పండ్లకు బదులు చిరుతిళ్లు తినేందుకు ఎక్కువ మంది అలవాటుపడుతున్నారు. ఇదే క్రమంలో విద్యాలయాల చెంత వెలిసిన పలు దుకాణాల్లో నాణ్యతలేని, ఊరూపేరూ లేని చిరుతిళ్లను తినే చిన్నారులు ఆరోగ్యం పాలవుతున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కల్తీ కారాలు, మసాలాలు, నాణ్యతలేని పదార్థాలతో తయారు చేసే చిప్స్‌, స్నాక్స్‌, న్యూడిల్స్‌, ఇన్‌స్టంట్‌, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ తినడం ద్వారా... ప్రతి వంద మంది బాధిత చిన్నారుల్లో ఐదో వంతు మంది పేగుపూత వ్యాధి బారిన పడుతున్నారని తాజాగా ఓ సర్వేలో తేల్చింది. పలువురు ఊబకాయంతో బాధపడేందుకు ప్రమాదకర ఆహార అలవాట్లే కారణమని తేలింది. ఈ సమయంలో పిల్లలకు అల్పాహారంగా అందించే ఆహారాన్ని తల్లిదండ్రులు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం, నాణ్యమైనదిగా ఉండేలా శ్రద్ధ వహిస్తే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు.

ఇదీ.. పరిస్థితి

  • ఖమ్మంలోని జిల్లా సర్వజన ఆసుపత్రిలో ప్రతి రోజు పిల్లల విభాగంలో 200 ఓపీ నమోదవుతోంది. చిన్నారుల్లో 25 నుంచి 30 మంది జీర్ణకోశ వ్యాధులతో బాధపడుతున్నవారే.  
  • జిల్లావ్యాప్తంగా అన్ని సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో చిన్నారుల ఓపీ 750 వరకు ఉండగా.. సుమారు వంద మందికి గ్యాస్ట్రో ఎంటరాలజీ సమస్యలు నిర్ధారణ అవుతున్నాయి.  

పాఠశాల విరామంలో..

విరామ సమయంలో పల్లీపట్టి, ఎండు ఫలాలు, పలు రకాల గింజల(నట్స్‌)తో చేసిన లడ్డూలు, లేదా అరటిపండు తినేలా చూడాలి. వీటిని తినడం లేదని చిప్స్‌, చాకెట్లు, బిస్కెట్లు, ఇతర ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ పెట్టడం తగదు.

మధ్యాహ్న భోజనంలో..

అన్నం లేదా గోధుమ రొట్టెలు, రాగిజావ, ఇతర పప్పులు, కూరగాయలు, సలాడ్‌, కొద్దిగా పెరుగు వంటివి భోజనంలో ఉండేలా చూసుకోవాలి. సలాడ్‌, పెరుగు వంటివి లేకపోతే అన్నం, చపాతి, కూరగాయల (వేపుళ్లు చేయనివి) కూరలు వండి పెట్టాలి. పప్పుధాన్యాల్లో మాంసకృత్తులు, సలాడ్లతో వివిధ విటమిన్లు లభిస్తాయి.

సాయంత్రం వేళలో..

పాఠశాల నుంచి వచ్చిన పిల్లలు అలసిపోయి ఉంటారు. ఆ సమయంలో వారికి స్నాక్స్‌ అందిస్తే శక్తి పెరిగి ఉత్తేజితులవుతారు. తాజా పండ్లతో చేసిన మిల్క్‌షేక్‌, లేదా పండ్ల ముక్కలు, జ్యూస్‌, ఓ కప్పు మొలకలు, ఆమ్లెట్‌
వంటివి పెట్టొచ్చు.

పీచు పదార్థాలతో జీవక్రియలు మెరుగు

చిన్నారుల శరీరంలో విసర్జన వంటి జీవక్రియలు సక్రమంగా జరగాలంటే పీచు పదార్థాలు ప్రముఖపాత్ర పోషిస్తాయి. పేగు క్యాన్సర్లు, ఇతర ప్రాణాంతక జబ్బులు రాకుండా ఇవి కాపాడతాయి. ముతక ధాన్యాలు, చిరుధాన్యాలు, పండ్లు, ఆకుకూరలు, బీరకాయ, చిక్కుడుకాయల్లో పీచుపదార్థాలెక్కువ. వీటికి మెనూలో ప్రాధాన్యమివ్వాలి.

విటమిన్ల లోపం దరిచేరకుండా..

ప్రొటీన్లతో పాటు విటమిన్‌ ‘ఎ’ లోపం వల్ల పిల్లల్లో త్వరగా దృష్టి సంబంధ సమస్యలు తలెత్తుతాయి. బొప్పాయి, ఆకుకూరలు, క్యారెట్‌, గుమ్మడికాయ, కర్భూజ, బొబ్బర్లలో విటమిన్‌ ‘ఎ’ సమృద్ధిగా ఉంటుంది. దీంతో పాటు ఉదయపు ఎండలో కొద్ది సమయం గడిపేలా చూస్తే విటమిన్‌ ‘డి’ శరీరానికి అందుతుంది. చిన్నప్పట్నుంచి చక్కటి ఆహార నియమాలు అలవాటయ్యేలా ప్రోత్సహిస్తే సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేసినట్లు అవుతుంది. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్లేవారైతే పిల్లల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పక చేసుకోవాలి.

చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ

స్వరూప, విద్యార్థుల తల్లి, కొత్తగూడెం

మా పాప యూకేజీ, బాబు రెండో తరగతి చదువుతున్నారు. వారికోసం వారం వారం తాజా పండ్లు కొనుగోలు చేస్తాం. వాటితో పాటు ఇంట్లో ప్రత్యేకంగా తయారు చేసిన పోషకాహారాన్నే లంచ్‌ బాక్సులో పెడతాం. ఆయిల్‌ ఫుడ్‌, జంక్‌ఫుడ్‌ పిల్లలకు ఇష్టమే అయినా.. వాటికి మెనూలో చోటివ్వం. పండ్లు, కూరలే ఆరోగ్యకరమని నచ్చచెబుతుంటాం. వారికి నచ్చిన పండ్లు తెచ్చివడంతో పెద్దగా చిరుతిళ్ల జోలికి వెళ్లడం లేదు.

బయటి పదార్థాలే అనారోగ్యానికి కారణం

పట్టణ ప్రాంత చిన్నారులు జంక్‌ఫుడ్‌, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటుంటారు. సమతుల ఆహారం తీసుకోకపోవడంతో వారు నీరసించిపోతున్నారు. కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు తదితర జీర్ణకోశ సంబంధ సమస్యల బారిన ఎక్కువగా పడుతున్నారు. ఓపీలో ప్రతి వందలో 15 నుంచి 20 మంది అజీర్తి లక్షణాలతో బాధపడుతున్నారు. పేగుపూత సమస్య అధికంగా ఉంటుంది. అల్పాహార హోటళ్లు, మొబైల్‌ టిఫిన్‌ సెంటర్లు, రోడ్డు పక్కన తోపుడు బండ్లపై లభించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. కల్తీ నూనెలు, మసాలాలు, నాణ్యతలేని పదార్థాలే గ్యాస్ట్రిక్‌ సమస్యలు తలెత్తడానికి కారణమవుతాయి. తల్లిదండ్రులు సంప్రదాయ ఆహారాన్ని అలవాటు చేయడం మేలు.

డా.పవన్‌కుమార్‌, పిల్లల వైద్య నిపుణుడు, ఖమ్మం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని