logo

మద్యం తాగాడని ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడి నిర్బంధం

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు మద్యం తాగి విధులకు హాజరై విద్యార్థులను కొట్టాడని పాఠశాలలో ఉంచి తాళం వేసిన ఘటన చర్ల మండలంలో చోటుచేసుకుంది.

Published : 28 Mar 2024 01:29 IST

విద్యార్థులను కొట్టాడని తల్లిదండ్రుల ఆందోళన
విచారణ నివేదికతో సస్పెండ్‌ చేసిన డీఈఓ

పాఠశాలలో కిషన్‌ను నిర్బంధించిన స్థానికులు

చర్ల, న్యూస్‌టుడే: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు మద్యం తాగి విధులకు హాజరై విద్యార్థులను కొట్టాడని పాఠశాలలో ఉంచి తాళం వేసిన ఘటన చర్ల మండలంలో చోటుచేసుకుంది. వివరాలను పరిశీలిస్తే.. జీపీపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు బి.కిషన్‌ బుధవారం ఉదయం విధులకు హాజరయ్యారు. అకారణంగా కొట్టడంతో విద్యార్థులు ఇళ్ల దగ్గరకు పరుగుతీసి తల్లిదండ్రులకు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు పాఠశాల వద్దకు చేరుకుని అతడిని నిలదీశారు. అప్పటికే మద్యం తాగి ఉన్నట్లు గుర్తించిన స్థానికులు ఆయనను పాఠశాలలోనే నిర్బంధించి ఆందోళన చేపట్టారు. ఈ వ్యవహారంపై ఎంఈఓ జుంకీలాల్‌కు సమాచారమిచ్చారు. ఎంఈఓ ఆదేశాలతో కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడు రమణరావు, మరో ఉపాధ్యాయుడు అక్కడికి చేరుకొని విచారణ    జరిపారు. ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు మద్యం తాగినట్లు గుర్తించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆయనను సస్పెండ్‌ చేస్తూ డీఈఓ వెంకటేశ్వరాచారి ఆదేశాలు వెలువరించారు.
సెలవుల్లో ముగ్గురు ఉపాధ్యాయులు: ఈపాఠశాలలో 60 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ముగ్గురు ఉపాధ్యాయులు సెలవుల్లో ఉండగా.. ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు కిషన్‌ ఒక్కరే విధులకు హాజరవుతున్నారు. కిషన్‌ తరచూ ఇలానే తాగి వస్తారంటూ గ్రామస్థులు విచారణకు వచ్చిన ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. పిల్లలు అల్లరి చేస్తే కొట్టానని.. తాను తాగినట్లు చూశారా? అంటూ విద్యార్థుల తల్లిదండ్రులను కిషన్‌ ప్రశ్నించటం కొసమెరుపు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని