logo

కరవు తీరా పని..!

కరవు పరిస్థితులతో వ్యవసాయ కూలీ పనులు దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న  గ్రామీణులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దన్నుగా నిలుస్తోంది.

Published : 28 Mar 2024 02:01 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండలంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలు

ఈటీవీ- ఖమ్మం, న్యూస్‌టుడే, సుజాతనగర్‌: కరవు పరిస్థితులతో వ్యవసాయ కూలీ పనులు దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న  గ్రామీణులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దన్నుగా నిలుస్తోంది. గతం కన్నా ఈసారి రోజువారీగా నమోదవుతున్న కూలీల సంఖ్య పెరగటమే ఇందుకు నిదర్శనం. ఇటీవల కూలీలకు దినసరి కూలి పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించటంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో లక్షలాది మందికి లబ్ధి కలుగుతుంది. ఏప్రిల్‌ నుంచి ఉపాధి   పనులకు వచ్చే కూలీల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముంది.


పెరుగుతున్న సంఖ్య

గతంలో మార్చి మూడోవారంలో ఒక్కో గ్రామం నుంచి సగటున 50 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరైతే.. ఈసారి ఆసంఖ్య పెరిగింది. రోజువారీగా గ్రామంలో సగటున ఖమ్మం జిల్లాలో 98 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 67 మంది కూలీలు పనులు చేస్తున్నారు. మొత్తమ్మీద ఖమ్మం జిల్లాలో 57,951 మంది, భద్రాద్రి జిల్లాలో 28,148 మంది పనులకు వెళ్తున్నారు. ఏప్రిల్‌ నుంచి కూలీల సంఖ్య మరింత పెరగనుంది.


ఏప్రిల్‌ 1 నుంచి కొత్త కూలి

ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీపికబురు అందించింది. ప్రస్తుతం అందజేస్తున్న దినసరి కూలిని పెంచనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త కూలి అమల్లోకి రానుంది. ఇప్పుడు రోజువారీ కూలి రూ.272 చొప్పున చెల్లిస్తుండగా వచ్చే నెల నుంచి రూ.30 వరకు పెరిగే అవకాశముంది. వేసవిలో మూడు నెలల పాటు ఉపాధి హామీ పనులతో కూలీలకు ఆర్థికంగా చేయూతనందనుంది.


గ్రామీణ కూలీలకు ఊతం

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో గత కొన్నేళ్లలో ఎన్నడూ చూడని పరిస్థితులు ఈసారి దాపురించాయి. నీరు లేక ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి. పైర్లు వడబడిపోతున్నాయి. రైతు కుటుంబాలతో పాటు రోజువారీ కూలీలకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పంటలు పుష్కలంగా పండితే..  సీజన్‌ చివర్లో కూలీలకు చేతి నిండా పని దొరికేది. పంటకాలం ముగిశాక వేసవిలో ‘ఉపాధి హామీ’ బాట పట్టేవారు. ఈసారి యాసంగి సీజన్‌ పంటల సాగుకు ఏమాత్రం అనుకూలంగా లేకుండా పోయింది. పనులు దొరక్క ఆర్థికంగా చితికిపోతున్న గ్రామీణ నిరుపేదలకు ఉపాధి హామీ పథకం ఊతమిచ్చేలా కనిపిస్తోంది.


పని ప్రదేశంలో వసతులు కల్పించాలని వేడుకోలు

గతంలో కూలీలకు మార్చి నుంచి జూన్‌ వరకు 15-30% వేసవి భత్యం చెల్లించేవారు. ఏప్రిల్‌, మే నెలల్లో ఎండల తీవ్రత కారణంగా 30 శాతం భత్యం దక్కేది. రెండేళ్లుగా కూలీలకు వేసవి భత్యం అందటం లేదు. ఫలితంగా ఏటా ఏప్రిల్‌లో దినసరి కూలి కొంత పెంచుతున్నారు. 2022లో రూ.12, 2023లో రూ.15 పెంచారు. ఈ ఏడాది ఎంత పెంచుతారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఎండల తీవ్రత నేపథ్యంలో పనిచేసే ప్రదేశంలో టెంట్లు, ప్రథమ చికిత్స కిట్లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కూలీలు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని