logo

ప్రత్యేక బోధనతోనే అనుత్తీర్ణులు గట్టేక్కేది!

ఇటీవల వెల్లడైన పదోతరగతి వార్షిక ఫలితాల్లో ఉభయ జిల్లాల్లోని కొన్ని యాజమాన్యాల పాఠశాలలు తక్కువ ఉత్తీర్ణత సాధించాయి.

Published : 07 May 2024 02:23 IST

పాల్వంచ, న్యూస్‌టుడే

ఇటీవల వెల్లడైన పదోతరగతి వార్షిక ఫలితాల్లో ఉభయ జిల్లాల్లోని కొన్ని యాజమాన్యాల పాఠశాలలు తక్కువ ఉత్తీర్ణత సాధించాయి. ప్రైవేటు విద్యాలయాలతో పాటు బీసీ, ఎస్సీ, మైనార్టీ, తెలంగాణ గురుకులాలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో    ఉత్తీర్ణత శాతం గతేడాదికంటే పెరిగింది. ప్రభుత్వ ఉన్నత, జడ్పీ ఉన్నత, ఎయిడెడ్‌ పాఠశాలల విద్యార్థులు కాస్త వెనకబడ్డారు. ఖమ్మం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లోనూ ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత నమోదుకాలేదని అధికారులు భావిస్తున్నారు. అన్ని యాజమాన్యాల విద్యాలయాల్లో కలిపి ఖమ్మం జిల్లాలో 16,541 మందికి 1,772 మంది, భద్రాద్రి జిల్లాలో 12,341 మందికి 1,989 మంది విద్యార్థులు వివిధ  సబ్జెక్టులలో అనుత్తీర్ణులయ్యారు. వీరు సప్లిమెంటరీ పరీక్షలో కనీస మార్కులు సాధించేలా విద్యాశాఖ ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. ప్రస్తుత వార్షిక ఫలితాలను విశ్లేషించి, లోటుపాట్లు సరిదిద్దడం ద్వారా వచ్చే ఏడాది రాష్ట్రస్థాయిలో మెరుగైన స్థానంలో నిలిచేలా ఉన్నతాధికారులు కార్యాచరణ రూపొందించాలి.

ఉపాధ్యాయుల చొరవ ముఖ్యం

వివిధ సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయిన వారికి పాఠశాలల్లోనే ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు బోధించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల విద్యాసంవత్సరం వృథా కాకుండా సప్లిమెంటరీలో అర్హత మార్కులు సాధించేలా సన్నద్ధం చేయించాలి. విద్యాశాఖ రూపొందించిన షెడ్యూల్‌ ప్రకారం తరగతులు జరిగేలా హెచ్‌ఎంలు ప్రణాళిక రూపొందించుకోవాలి. కలెక్టర్‌ స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ    తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలున్నాయి.  


విద్యార్థులను అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీకి సన్నద్ధం చేయించాలని అన్నిరకాల యాజమాన్యాల హెచ్‌ఎంలు, ఎంఈఓలు, కేజీబీవీల ప్రత్యేకాధికారులకు ఆదేశాలిచ్చాం. వార్షిక ఫలితాల్లో ఫెయిల్‌ అయిన వారంతా ఈసారి ఉత్తీర్ణులయ్యేలా బోధనపై ప్రత్యేక శ్రద్ధచూపాలని ఉపాధ్యాయులకు సూచించాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై హెచ్‌ఎంల సమావేశంలో దిశానిర్దేశం చేశాం. 

వెంకటేశ్వరాచారి, డీఈఓ, భద్రాద్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని