logo

గృహమే కదా పోలింగ్‌ కేంద్రం!

పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. పోలింగ్‌ కేంద్రాలకు రాలేనివారు సైతం ఓటుహక్కు వినియోగించుకునేలా ఇంటి నుంచి ఓటేసే విధానాన్ని ప్రవేశపెట్టింది.

Updated : 07 May 2024 06:25 IST

ఈనాడు డిజిటల్‌, కొత్తగూడెం: పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. పోలింగ్‌ కేంద్రాలకు రాలేనివారు సైతం ఓటుహక్కు వినియోగించుకునేలా ఇంటి నుంచి ఓటేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. 85 ఏళ్ల పైబడిన ఓటర్లు, 40 శాతం మించి వైకల్యం కలిగిన దివ్యాంగులకూ ఈ సౌలభ్యాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో లోక్‌సభ ఎన్నికల్లో హోం ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తించిన అధికారులు ఈనెల 4 నుంచి బ్యాలెట్‌ పేపర్‌ పద్ధతిలో ఓటింగ్‌ ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే 80 శాతం మంది అర్హులు ఓటుహక్కు వినియోగించుకున్నారని, బుధవారం లోగా ఈ ప్రక్రియ 100 శాతం పూర్తవుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

అర్హతలు ఉన్నప్పటికీ..

ఇంటి వద్ద ఓటుహక్కు వినియోగానికి అర్హతలు ఉన్నప్పటికీ చాలామంది దరఖాస్తు చేసుకోవటం లేదు. అధిక శాతం మంది పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటేసేందుకు ఇష్టపడటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో హోం ఓటింగ్‌కు ఖమ్మం జిల్లాలో అర్హులు 32,663 మంది ఉంటే వీరిలో కేవలం 2,534 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. భద్రాద్రి జిల్లాలో సుమారు 15వేల మంది అర్హులుంటే కేవలం 865 మంది మాత్రమే దరఖాస్తులు సమర్పించారు. ప్రస్తుతం ఎండలు మండిపోతుండటంతో దివ్యాంగులు, వృద్ధులు పోలింగ్‌ కేంద్రాలకు ఏ మేరకు వస్తారో వేచిచూడాల్సిందే.

వయోవృద్ధులు, దివ్యాంగుల ఆనందం

వయో వృద్ధులు, దివ్యాంగులు, కొవిడ్‌ సోకినవారు ఓటుహక్కు వినియోగించుకునేందుకు వాళ్ల ఇళ్లను ఎన్నికల అధికారులు పోలింగ్‌ కేంద్రాలుగా మార్చేస్తున్నారు. రహస్య ఓటింగ్‌ ప్రక్రియకు విఘాతం కలగకుండానే నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రానికి వెళ్లేందుకు శరీరం సహకరించక చాలామంది ఓటింగ్‌కు దూరమవుతున్నారని గ్రహించిన ఎన్నికల సంఘం.. హోం ఓటింగ్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీనివల్ల చాలామంది సులభంగా తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఇంటి నుంచే ఓటేస్తున్నవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఉభయ జిల్లాల్లో..

భద్రాద్రి జిల్లాలో 865, ఖమ్మం జిల్లాలో 2,534 మంది ఓటర్లు ఇంటి నుంచే తమ ఓటుహక్కు వినియోగించుకోవటానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 4 నుంచి వీరు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే 80 శాతం మంది ఓటేసినట్లు సమాచారం. ఎన్నికల అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇందులో గెజిటెడ్‌, రెవెన్యూ అధికారులు, వీడియోగ్రాఫర్‌, సంబంధిత   బీఎల్‌ఓలు పాలుపంచుకుంటున్నారు. అవకతవకలకు తావులేకుండా ఓటరు ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని